Home ఎడిటోరియల్ బోసి నవ్వులను కాపాడలేమా?

బోసి నవ్వులను కాపాడలేమా?

Raod Accident

 

పిల్లలతో రోడ్లపై నడిచేవాళ్లు దిక్కులు చూడకుండా శ్రద్ధంతా పక్కనున్న పిల్లలపైనే ఉంచాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 43 మంది పసివాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. కావాలని తమ పిల్లల్ని ఎవరూ చంపుకోరనే కారణంగా పెద్దలు చట్టపరంగా చట్టం బోనులో నిలబడడం లేదు. పిల్లల ప్రమాదాలకు, నిర్లక్ష మరణాలకు పెద్దల ప్రమేయం ఎంతుందో విచారించి వారికి తగిన గుణపాఠం ఉంటే పరిస్థితులు కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. పిల్లల పెంపకం క్లిష్టమైన, ఇష్టమైన ప్రక్రియ. దానికి సంబంధించి మన దేశంలో ప్రశూతి కేంద్రాలు, పిల్లల వైద్యం రెండే అంశాలు ప్రధానంగా కనబడతాయి. పసివాళ్లు ప్రమాదాల బారినపడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మాత్రం ఎక్కడా కనబడవు. దానికి సంబంధించిన ఎలాంటి విద్య, శిక్షణ కేంద్రాలు లేవు. 

‘క్షణం చూపు మరల్చితే ఎంతటి ఘోరమైనా జరిగిపోవచ్చు’ చాలా సందర్భాలకు ఈ మాట వర్తించినా పసిపిల్లల సంరక్షణ విషయంలో మాత్రం తప్పని సరిగా పాటించవలసిన సూత్రమిది. దీనివల్ల ఎలాంటి ముప్పుందో ఎరగని పసిపాపలు పెద్దల ఏమరపాటుకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ నేరస్థులుగా బోనులో నిలబడాల్సింది పెద్దవాళ్లే. తమ స్వల్ప నిర్లక్షానికిగాను తీరని వ్యధను శిక్షగా జీవితాంతం అనుభవించాల్సి వస్తోంది.

ఇంట్లో గోడలకున్న మరకలు తుడవడానికి మూత తీసిపెట్టి ఉన్న బాటిల్లోంచి యాసిడ్ తాగిన పదకొండు నెలల బాలుడు శరీరం బయట లోపల తీవ్ర గాయాలతో చనిపోయాడన్న వార్త మీడియాలో వచ్చింది. పత్రికలో ఓ మూలకున్న చిన్న వార్తే కాని చదివిన వారి మనసు ఒక్కసారిగా బాధతో నిండిపోతుంది. కన్నవారి గుండె కోతను ఊహించుకోగలం. ఆ తల్లి గర్భం దాల్చిన నుండి ఎంత అపురూపంగా తన కడుపులోని బిడ్డను కంటితో చూడక ముందు నుండే ప్రేమిస్తూ, పుట్టాక ఎన్ని మురిపాలు పంచుతుందో, అవన్నీ నేలపాలయిపోయాయి.

తన వెనుకాలే వచ్చిన ఏడాదిన్నర అబ్బాయిని తండ్రి గమనించకుండా ఆఫీసుకెళ్లే తొందరలో కారు రివర్స్ తీసుకొని బయటపడ్డాడు. తల్లి కొడుకు కోసం వెతుకుతూ కారు పార్కింగ్ దగ్గరికి వచ్చింది. కాంపౌండు గోడకు అప్పచ్చిలా అతుక్కొని ప్రాణాలు వదిలిన కొడుకును చూసి గుండెలు బాదుకుంది. కారు రివర్స్ తీసేప్పుడు కారుకు గోడకు మధ్య పిల్లాడు ఇరికి ఉన్నాడన్న విషయం తండ్రికి అబ్బాయి చనిపోయాడని చెప్పేదాకా తెలియదు. ఇదీ నగరంలోనే జరిగిన మరో సంఘటన.

కళ్లముందు జరిగిన ఓ పసిపాప దుర్మరణం పీడకలలా వెంటాడుతూనే ఉంది. పొద్దున్నే హైదరాబాద్ నుండి వచ్చిన బస్సు ప్రయాణికుల్ని దింపేందుకు బస్టాండులో ఓ వైపు ఆగింది. చివరగా ఓ జంట, వారితోపాటు రెండేళ్ల పాప దిగారు. దింపిన బ్యాగును విసురుగా భుజంపైకి వేసుకునేప్పుడు పాప తన వెనుకాలే నిలబడిందని తండ్రి గ్రహించలేదు. బ్యాగు ఊపు పాపకు తగలడంతో నెట్టేసినట్లు అడ్డంగా పడిపోయింది. అప్పుడే డిపో వైపు కదులుతున్న బస్సు వెనుక చక్రం పాప తలపైంచి వెళ్లింది. పాపపడడం, కండక్టర్ రైట్ చెప్పాడని డ్రైవర్ బస్సును ముందుకు తీసికెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. రబ్బరు బొమ్మ చితికినట్లు పాప తల పచ్చడైపోయి నిర్జీవమైంది. ఈ ఘటన అసిఫాబాద్‌లో జరిగింది. కొమురంభీం ప్రాజెక్టులో కొత్తగా ఇంజనీర్‌గా చేరడానికి వచ్చిన కుటుంబంలో జరిగిన విషాదమిది. తెలియని ప్రాంతంలో అడుగుపెట్టిన క్షణ కాలంలోనే ఊహించని దుర్ఘటన, తట్టుకొని నిలబడడానికి ఏ కాలమూ సరిపోదు.

ఏప్రిల్ 2011లో గాయని చిత్ర ఎనిమిదేళ్ల కూతురు దుబాయి హోట్‌ల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి దుర్గతి పాలవడం తెలిసిందే. కూతురు తన కిష్టమైన కార్టూన్ షో టివిలో చూస్తుంది కదాని బెడ్ రూం అటాచ్‌డ్ బాత్‌రూంలో స్నానానికి వెళ్లిన తల్లికి పది నిమిషాల సమయం భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. బెడ్ రూం తలుపుకి తాళం వేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు అని తర్వాత తెలిసింది. ఇలా దేశంలో ఏటా సుమారు 12,000 మంది పిల్లలు నీట మునిగి చనిపోతున్నారు.

రెండేళ్ల పాప మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులిద్దరూ ఉరి వేసేకొని ప్రాణాలు తీసుకొన్న సంఘటన మరోటి. పిల్లలు దూరమైతే కన్నవారి క్షోభ ఎంత కఠినాత్మకంగా ఉంటుందో ఈ అఘాయిత్యం తెలుపుతోంది. ఉన్న సంపదంతా కరిగిపోయినా బతకొచ్చు, అవకాశం దొరిగితే తిరిగి కూడబెట్టుకోవచ్చు. కాని ముద్దుల, మురిపాల పసిపాపల్ని కోల్పోతే దానికి ప్రత్యామ్నాయమే లేదు. అతి చిన్న పొరపాటు, అశ్రద్ధ, ఆదరబాదరా పసివాళ్ల ప్రాణాలకు పాశాలవుతున్నాయి. పెరుగుతున్న పిల్లలపట్ల తల్లిదండ్రుల పోషకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో పై సంఘటనలు చెబుతున్నాయి.

తవ్వి వదిలేసిన బోరు బావుల్లో ఆడుకునే పిల్లలు పడిపోవడం పరిపాటైపోయింది. తవ్వి మూతపెట్టకుండా వదిలేయడం చట్టపరంగా నేరమైతే, తమ పిల్లలు ఆడుకొనే పరిధిలో ఎలాంటి ప్రమాదకర ఆస్కారమేదీ లేదని ముందుగానే పరిశీలించడం కన్నవారి విధి, దాన్ని మరవడం అతిపెద్ద నేరం. షాపింగ్ మాల్‌లో ఎస్కలేటర్‌పై సెల్ఫీ తీసుకోవాలనే తొందరలో చంకలో నున్న పది నెలల పాపను వదిలేసిన తల్లి ఒకరు. మూడో అంతస్థులోంచి కిందపడి పాప ప్రాణం వదిలింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని గంగానగర్‌లో జరిగింది.

కడుపులో పుట్టిన వారినైనా హింసించినా, చంపేసినా చట్టం దృష్టిలో నేరమే. దానిపై విచారణ జరిగి శిక్షపడే అవకాశం ఉంది. బిడ్డల సంరక్షణలో జరిగిన ప్రమాదాలకు తల్లిదండ్రుల్ని బాధ్యులు చేసే చట్టం లేదు. పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉన్నా ఆటల్లో వారిని వదిలేసి టివి చూస్తున్న వాళ్లు, మొబైల్ ఫోన్లతో కాలం గడిపేవాళ్లు తమ పరిసరాల్ని మరచిపోతుంటారు. పిల్లలు ఎటునుంచి ఎటు వెళ్లారో, ఏమినోట్లో పెట్టుకుంటున్నారో గమనించే స్పృహ వారి కుండదు. బరువైన వస్తువులను పైన వేసుకోవడం, చేతికందిన వస్తువులను నోట్లో పెట్టుకోవడం, వాటిలో కొన్ని గొంతులో ఇరుక్కోవడంలాంటి సంఘటన జరుగుతున్నాయి.

పిల్లల సంరక్షకులకు ఆ బాధ్యతే తొలి ప్రాధాన్యతా అంశం. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి నుండి చూపును మరల్చకూడదు. అత్యవసరంలో ఆ బాధ్యత మరొకరికి పూర్తిగా అప్పగించి కదలాలిగాని క్షణ కాలంలో ఏం జరుగుతుందిలే అనే భరోసా వద్దే వద్దు.

పిల్లలతో రోడ్లపై నడిచేవాళ్లు దిక్కులు చూడకుండా శ్రద్ధంతా పక్కనున్న పిల్లలపైనే ఉంచాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 43 మంది పసివాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. కావాలని తమ పిల్లల్ని ఎవరూ చంపుకోరనే కారణంగా పెద్దలు చట్టపరంగా చట్టం బోనులో నిలబడడం లేదు. పిల్లల ప్రమాదాలకు, నిర్లక్ష మరణాలకు పెద్దల ప్రమేయం ఎంతుందో విచారించి వారికి తగిన గుణపాఠం ఉంటే పరిస్థితులు కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. పిల్లల పెంపకం క్లిష్టమైన, ఇష్టమైన ప్రక్రియ. దానికి సంబంధించి మన దేశంలో ప్రశూతి కేంద్రాలు, పిల్లల వైద్యం రెండే అంశాలు ప్రధానంగా కనబడతాయి. పసివాళ్లు ప్రమాదాల బారినపడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మాత్రం ఎక్కడా కనబడవు. దానికి సంబంధించిన ఎలాంటి విద్య, శిక్షణ కేంద్రాలు లేవు.

పిల్లలకు సంభవించే అవకాశం ఉన్న ప్రమాదాల గురిం చో లేదా ఇదివరకు జరిగిన దుర్ఘటనల సజీవ సాక్షాల గురించో తెలియజేసే కరపత్రాలు, గోడ పత్రికలు కనీసం పిల్లల దవాఖానాల్లోనైనా అందుబాటులో ఉంచాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్టు ఇప్పుడిప్పుడు మన దగ్గర నగరాల్లో కొంత స్పృహ కనబడుతోంది. పిల్లల పె ంపకంపై మాస పత్రికలు వస్తున్నాయి. కారులో పసివాళ్లున్నారనే సూచికగా వెనుక అద్దానికి చిన్న చొక్కాపై పసివాళ్లున్నారు అనే స్టిక్కర్ అతికిస్తున్నారు. ఆ కారు మెల్లగా వెళ్లినా, అత్యవసరంగా పక్కన ఆపుకున్నా భంగపరచవద్దని ఆ మనవి.

పిల్లలు కుదురుగా ఒకచోట ఉండటానికి టివిలో వాల్ట్ డిస్నీ వారు ప్రసారం చేస్తున్న ‘బేబీ’ ఛానల్‌ను చూపించవచ్చు. అందులో తేలిగ్గా గుర్తు పట్టే లేత రంగుల్లో బొమ్మలు, మంద్రస్థాయి వాయిద్య సంగీతం పిల్లల్ని ఆకట్టుకుంటాయి, నిద్రపుచ్చుతాయి కూడా. రాంకో గ్రూపు తరపున నళిని రామలక్ష్మి పిల్లల సంరక్షణ కోసం ‘పేరెంట్ సర్కిల్’ అనే పత్రికను ఇంగ్లీషులో వెలువరిస్తున్నారు. ఏప్రిల్ 2011 నుండి వస్తున్నా ఈ పత్రిక సర్కులేషన్ 30 వేల కాపీలకు చేరింది. అమెరికా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనే సంస్థ హెల్దీ చిల్డ్రెన్ అనే ఇంటర్‌నెట్ పత్రికను నడుపుతోంది. ఈ పత్రికను ఉచితంగా చదవొచ్చు. వీటి ద్వారా పిల్లల తల్లిదండ్రులకు పెంపకంలో మార్గదర్శకాలు లభించవచ్చు. ప్రధానంగా గమనించవలసినదేమిటంటే పసిపిల్లల కన్నా ఏ పనీ ముఖ్యం కాదు, ఉద్యోగం, సద్యోగం అన్నీ వారి తర్వాతే. గాలిలో కలిసిపోయిన బోసినవ్వులు తిరిగి వచ్చే మార్గమే లేదు.

Daily 43 people childrens died in road accidents in India