Friday, April 19, 2024

దళిత బంధు ఓ మహాయజ్ఞం

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు వెలి బతుకులు.. ఊరికి దూరం గా బిక్కుబిక్కుమంటూ దీనంగా కాలం గడిపిన గడ్డు రోజులు.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా వలపోతలే మా తలరాతలని బతుకులీడ్చిన వెతల గాథలు.. కలతలు ముసురుకుని కన్నీళ్లు తాగిన వెలివాడల బతుకు చిత్రం నుండి నేడు దళితులు ఆర్థిక స్వావలంబన సాధించి, దళిత కాలనీల్లో ప్రగతి బాటకు నాంది పలికి వెలుగు బాటగా మార్చుతున్న కనీవినీ ఎరుగని సరికొత్త చరిత్ర ఇది. సిఎం కెసిఆర్ రాసిన అద్భుతమైన ప్రగతి గీతిక… దళిత తల్లి మురిసి నవ్వుతూ చిందేసే సమయం ఆసన్నమైన గడియలు మన కండ్ల ముందు కదలాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రగతికాముకుడు తెలంగాణ జాతి గర్వించదగిన నాయకుడు, సిఎం కెసిఆర్ మానస పుత్రికగా చెప్పుకునే తెలంగాణ దళితబంధు ఓ మహాయజ్ఞంలా అప్రతిహాతంగా దళితుల పాలిట వెలుగులు పంచుతోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని సుమారు 16.50 లక్షల మంది దళిత కుటుంబాలకు కాంతిరేఖలా దారిచూపుతోంది. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన అనేక బృహత్తర పథకాలలో దళిత బంధు పథకం నేడు యావత్ దేశంలోని దళితులందరి మస్తిష్కాలలో పదేపదే గుర్తుకు వచ్చేలా చేస్తోంది. ముఖ్యంగా సామాజికంగా దూరంగా నెట్టి వేయబడిన వారికి న్యాయం చేసేలా ఉన్న ఈ పథకం దళిత లోకానికి ఓ దిక్సూచీలా ఉంది. తెలంగాణలో ఇప్పటికే సుమారు 39 వేల మంది లబ్ధిదారులకు రూ. 10లక్షల చొప్పున గ్రౌండిరగ్ చేసి వారికి ఆర్థిక పరిపుష్టిని కలిగించారు. నాటి ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్ నేడు బిఆర్‌ఎస్‌గా మారి దేశానికి సరికొత్త నిర్దేశం ఇవ్వాలని వేగంగా అడుగులు వేస్తున్న వేళ ఇంతటి బృహత్తర పథకాన్ని ఒక సారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఇలాంటి పథకం దేశంలోని దళితులందరికీ చేరాల్సిన అవసరం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఎవరూ ఊహించని ఈ పథకం మరింతగా విరాజిల్లాలని కోరుకుంటున్నారు.

దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలా రూపొందించిన దళిత బంధు పథకాన్ని తొలుత 2021 సంవత్సరం బడ్జెట్‌లో ‘సిఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీం’ పేరుతో రూ. వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు 2021, ఫిబ్రవరి 10న నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ప్రకటించడంతో పాటు వెనువెంటనే 2021లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దళిత ఎంపవర్‌మెంట్ స్కీం కోసం రూ. వెయ్యి కోట్లు ప్రవేశపెట్టి బృహత్తర పథకానికి బాటలు వేశారు. దీంతో దళితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే 2021, జూలై 18న సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ‘దళిత సాధికారత అమలు పైలట్ ప్రాజెక్టు ఎంపిక అధికార యంత్రాంగం విధులు’ అనే అంశం మీద ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ పథకానికి ‘తెలంగాణ దళితబంధు పథకం’ అనే పేరును కెసిఆర్ ఖరారు చేశాడు.

పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై 2021, జూలై 26న ప్రగతి భవన్‌లో తొలి అవగాహన సదస్సు జరిగింది. కెసిఆర్ అధ్యక్షతన ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు, 15 మంది రిసోర్సు పర్సన్స్ ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆ రోజున సిఎం కెసిఆర్ దళితులకు షడ్రుచులతో కూడిన భోజనం వండించి దళితులతో కలిసి భోజనం చేశారు. స్వయంగా వారికి పథకం గొప్పతనాన్ని స్వయంగా సవివరంగా వెల్లడిరచారు.

అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి మళ్లీ చెల్లింపుల్లేకుండా పూర్తిగా రాయితీతో ప్రభుత్వం రూ. 10 లక్షలు చెల్లించడంతో సిఎం కెసిఆర్ పలికిన ఒక్క మాటతోనే నిరుపేద దళితులు ఒక్కసారగా లక్షాధికారులయ్యారు. ఇలా రాష్ట్రంలోని అన్ని దళిత కుటుం బాలకు పథకం వర్తింపజేస్తామని చెప్పడం తో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకం ద్వారా తెలంగాణలోని పదహారున్నర లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి, లబ్ధిదారుడి నుండి రూ. 10 వేలతో ప్రభుత్వం భాగస్వామ్యం తో రక్షణ నిధిని ఏర్పాటు చేసి, లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి సహాయం అందజేసేలా దీర్ఘకాలిక ప్రయోజనాలతో పథకాన్ని రూపొందించడం గొప్ప విష యం. క్షేత్ర స్థాయిలో ఈ పథకం అమలు తీరును గమనించేందుకు ఆరుగురితో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో దళిత బంధు కమిటీల ఏర్పాటు చేసి పథకాన్ని ఎక్కడా దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించేలా రూపొందించారు. దళితబంధు పథకం విజయవంతం అయ్యేలా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన తెలంగాణ సర్కారు సరిగ్గా 2022, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి 2వేల మంది లబ్ధిదార్లకు దళితబంధు యూనిట్లు పంపిణీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

విపక్షాలు దళితబంధు ఓ డ్రామా అని చెప్పిన వారి నోళ్లు మూతపడేలా చేసిన సిఎం కెసిఆర్ పథకాన్ని మరింత వేగంగా అడుగులు పడేలా చేస్తున్నారు. డ్బ్బై ఏండ్ల స్వాతంత్య్రంలో దళితులకు ఒక్కసారిగా ఇంత స్థాయిలో ఆర్దిక సాయం అందించిన దాఖలాల్లేకపోవడంతో ప్రస్తుతం ఈ పథకంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు మండలాలు (చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్)లో 100 శాతం దళిత కుటుంబాలకు ప్రభుత్వం మంజూరుచేస్తోంది. ఈ 4 మండలాల్లో 8,518 దళిత కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో 6,947 కుటుంబాల బ్యాంకు ఖాతాలకు ప్రభు త్వం నిధులు జమచేసింది. ఈ 4 మండలాల్లో ఇప్పటి వరకు 4,808 దళిత బంధు యూనిట్స్ గ్రౌండింగ్ అయినట్టు తాజా వివరాలు తెలియజేస్తున్నాయి.
ఈ ఏడాది 17,700మందికి లబ్ధి

దళిత కుటుంబాలకు వరప్రదాయినిగా పేరుగాంచిన ఈ పథకం రాష్ట్రంలోని 33 జిల్లాలలోని 118 నియోజకవర్గల్లో 100 కుటుంబాలకు దళిత బంధు కింద యూనిట్స్ మంజూరు చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొత్తం 11,835 దళిత కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో ఇప్పటి వరకు 11,159 కుటుంబాల ఖాతాలలో నిధులు జమ చేసింది. 10,893 యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యాయి. దళిత బంధు కింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం 36,392 మంది లబ్ధిదారుల ఖాతాలకు ప్రభుత్వం నిధులు జమ చేసింది.

వారిలో 31,088 మంది లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. 2022 -23 బడ్జెట్లో కేటాయించిన రూ. 17,700 కోట్ల నిధులను పూర్తిగా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 1500 కుటుంబాల చొప్పున 118 నియోజకవర్గంలలో 1,77,00 మంది లబ్ధిదారులకు దళితబందు పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ సంవత్సరం మొదటి దశలో నియోజక వర్గానికి 500 మంది చొప్పున మొత్తం 59,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దళితుల కోసం సాగుతున్న ఈ యజ్ఞం విజయవంతంగా పూర్తికావాలని వేనోళ్లా కోరుకుంటున్నారు.

వనం నాగయ్య
9441877695

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News