Home ఎడిటోరియల్ పాక్ లో దళిత చైతన్యం

పాక్ లో దళిత చైతన్యం

Dalit-image

ముస్లిం మెజారిటీ దేశం పాకిస్తాన్. హిందు జనాభా చాలా తక్కువ. పాకిస్తాన్ హిందువుల్లో దళితులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ దళిత సముదాయం నుంచి ఒక మహిళ ఇప్పుడు అక్కడి పార్లమెంటుకు ఎంపికయ్యింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి కోహ్లి సముదాయానికి చెందిన దళిత మహిళ కృష్ణకుమారి కోహ్లి పార్లమెంటుకు ఎంపికయ్యింది. పాకిస్తాన్ లో కోహ్లీ సముదాయం ఒకప్పుడు అంటరాని సమాజం. మన రాజ్యసభ వంటి అక్కడి ఎగువసభకు కృష్ణకుమారి కోహ్లీ ఎంపికయ్యారు. ఆరేళ్ళ పదవీకాలం.
ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని కృష్ణకుమారి మీడియాతో అన్నారు. హత్యకు గురైన పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఆమెకు టిక్కట్టు ఇచ్చింది. కృష్ణకుమారి యూనివర్శిటీ డిగ్రీ సంపాదించుకుంది. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజాసేవా కార్యక్రమాల్లో పనిచేయడం ప్రారంభించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో పనిచేస్తున్నప్పుడే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కార్యకర్తగా మారారు. సింథ్ ప్రాంతంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి మంచి బలం ఉంది. జనాభా ఎక్కువగా సింధ్ ప్రాంతం లోనే ఉన్నారు. ముప్పయి తొమ్మిది సంవత్సరాల కృష్ణకుమారి కోహ్లీ వివాహం కూడా కేవలం 15 సంవత్సరాల వయసులోనే అయిపోయింది. ఆమె భర్త లాల్ చంద్ ప్రోత్సాహంతో చదువు కొనసాగించింది. సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. పాకిస్తాన్ లోని అత్యంత వెనుకబడిన నాగర్ పర్కార్ జిల్లా లోని మారుమూల పల్లె థార్ కి చెందిన కృష్ణకుమారి 1979లో జన్మించింది. చిన్నప్పుడు వెట్టిచాకిరి కూడా చేయవలసి వచ్చింది. ఆమె 3వ తరగతి చదువుతున్నప్పుడు ఉమర్ కోట్ జిల్లాలో భూస్వామి కున్రీ ఆమె కుటుంబాన్ని మూడేళ్ళ పాటు నిర్బంధంలో ఉంచాడు.

ఆమె కుటుంబం 1857 ప్రథమ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది. నాగర్ పర్కార్ లో బ్రిటీషు సైన్యంతో పోరాడిన రూప్ కోహ్లీ వంశానికి చెందిన మహిళ ఆమె. రూప్ కోహ్లీని 1858లో బ్రిటీషు ప్రభుత్వం ఉరితీసింది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం తరఫున ఒక దళిత మహిళ గెలుపొందడం పాకిస్తాన్ లో సంచలనమయ్యింది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయ్యింది. జిబ్రాన్ నసీర్ వంటి సామాజిక కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తూ పాకిస్తాన్ పార్లమెంటులో అన్ని మతాల స్త్రీపురుషులు అందరూ ఉండాలని అన్నారు. పాకిస్తాన్ లో హిందూ మహిళా పార్లమెంటేరియన్ రీటా ఈశ్వర్ లాల్. ఆమె కూడా సింధ్ నుంచే ఎంపికయ్యారు. పాకిస్తాన్ లో మహిళలకు రిజర్వేషన్లున్నాయి. సింధ్ లో మహిళలకు రిజర్వు స్థానం నుంచి రీటా ఈశ్వర్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫునే ఎంపికయ్యారు. అంతకు ముందు రత్న భగవాన్ దాస్ చావ్లా కూడా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫునే ఎంపికయ్యారు.

కౌంటర్ కరెంట్స్ పత్రికలో పాకిస్తాన్ కు చెందిన పాకిస్తాన్ హిందూ సేవా వెల్ఫేర్ ట్రస్ట్ రిసెర్చ్ అసోసియేట్ చందర్ కోహ్లీ రాసిన వ్యాసం అక్కడి దళిత సముదాయం గురించి మరిన్ని వివరాలు అందజేస్తోంది. ఆ వ్యాసం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా దళిత సమస్యల అధ్యయనం అనేది పాకిస్తాన్ లో ఎక్కువయ్యింది. పాకిస్తాన్ లో దళితుల స్థితిగతుల గురించి తెలుసుకునే ప్రయత్నాలు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. దళిత సాహిత్యాన్ని చదివే వారి సంఖ్య కూడా పెరిగింది. పాకిస్తాన్‌లో దళితుల గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు కోణాలు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఒక కోణమేమంటే పాకిస్తాన్ లో దళితులుగా గర్వంగా చెప్పుకునే దళితులు కొందరు. దళితులుగా బాహాటంగా చెప్పుకోవడం వల్ల సమాజంలో మిత్రులను కోల్పోయినా, బంధువులు దూరమైనా, సామాజికంగా కష్టాలెదురైనా లెక్కచేయకుండా తాము దళితులమని గర్వంగా చెప్పుకునేవారు ఉన్నారు. మరో కోణమేమంటే, దళితులుగా చెప్పుకోడానికి సంకోచించే, సిగ్గుపడే వారూ ఉన్నా రు. పాకిస్తాన్ హిందూ సమాజంలో అగ్రవర్ణాల కన్నా ఎక్కువగా దళితుల్లోని కొందరే దళిత గుర్తింపు విషయంలో వ్యతిరేక వైఖరి పాటిస్తున్నారు.

పాకిస్తాన్ లో దళితులు, షెడ్యూల్ కులాలు రెండు ఒక్కటి కాదు. దళిత పదం చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. హిందూ ముస్లిమ్ సముదాయాలన్నింటిలో బడుగు, బలహీనవర్గాలందరినీ సూచించడానికి దళితపదం ఉపయోగిస్తారు. కాని పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలు ఖచ్చితంగా గుర్తించబడి ఉన్నా యి. ఇవి 42 కులాలు. ఇందులో కోహ్లీ, భీల్, మేఘవార్, జోగి, అవధ్, కలాల్ వగైరా కులాలున్నాయి. ఇవన్నీ హిందూ బడుగు బలహీన కులాలు. ఈ కులాలన్ని షెడ్యుల్ కులాలుగా రాజ్యాంగం గుర్తించింది. ఈ షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న కులాలన్నీ దళిత కులాల క్రిందికే ఖచ్చితంగా వస్తాయి. అయితే ఈ కులాలు మాత్రమే కాకుండా మరికొన్ని హిందూ, ముస్లిమ్ బడుగు సముదాయాలు కూడా దళితులుగా పేర్కొనడం జరుగుతుంది. కాని ఇవి షెడ్యూల్ కులాల పరిధిలో ఉండవు. పాకిస్తాన్‌లో మరో సమస్య ఏమిటంటే దళిత పదం హిందూ కులాలకు సంబంధించిందిగానే ఎక్కువగా చూస్తారు. అందువల్ల దళిత పదాన్ని కొన్ని దళిత వ్యతిరేక శక్తులు కించపరిచే పదంగా భావిస్తాయి. పాకిస్తాన్ లో చాలా మంది మేధావులు, ఉదారవాదులుగా చెప్పుకునేవారు దళిత ఉద్యమాన్ని హిందూ వ్యతిరేక ఉద్యమంగా భావిస్తుంటారు. ఉదారవాదులకు సంబంధించిన అనేక వాస్తవాలను దళిత ఉద్యమం బట్టబయలు చేసింది. మానవవాదులుగా, సమానత్వాన్ని కోరుకునేవారుగా చెప్పుకునే ఉదారవాదుల్లోనూ దళితుల పట్ల ఉన్న అపార్థాలను దళిత ఉద్యమం ఖండిస్తోంది.

పాకిస్తాన్ లో మానవహక్కుల కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకునే కొందరు ఆర్యసమాజ్ ను సమర్ధించడానికి భూమ్యాకాశాలు ఏకం చేస్తారని, బ్రాహ్మణుల కన్నా ఎక్కువగా బ్రాహ్మణులను సమర్థిస్తారని చందర్ కోహ్లీ రాశారు. ప్రోగ్రెసివ్ హ్యూమన్ ఫ్రంట్ నాయకుడిగా కూడా ఉన్న చందర్ కోహ్లీ ఈ విషయమై మాట్లాడుతూ పాకిస్తాన్ లోని వివిధ దళిత సంస్థలు, భీల్ ఇంటలెక్చువల్ ఫోరమ్, పాకిస్తాన్ మేఘవార్ కౌన్సిల్, ఆల్ సింధ్ కోహ్లీ అసోసియేషన్, సింధ్ కోహ్లీ ఇత్తెహాద్ లోని రాంషల్ గ్రూపు, నామ్ దాస్ గ్రూపు, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ పాకిస్తాన్, బాగ్రీ వెల్ఫేర్ అసోసియేషన్, అవధ్ సమాజీ తంజీమ్, పాకిస్తాన్ దళిత్ సాలిడారిటీ నెట్ వర్క్, బాగ్రీ వెల్ ఫేర్ అసోసియేషన్, దళిత్ అదబ్ ఫోరమ్, ఖౌమీ అవామీ తహ్రీక్, తబఖతీ జిదోజహద్ వంటి సంస్థలన్నీ మీర్ పుర్కా లో బాబాసాహెబ్ 125వ జయంతి నాడు సమావేశమయ్యాయి. దళిత్ ఇన్సాఫ్ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. పాకిస్తాన్ దళితుల్లో 70 శాతం ప్రజలు రైతుకూలీలే. దళిత సముదాయాల్లో వస్తున్న రాజకీయ చైతన్యం పాకిస్తాన్ లోని ప్రధాన పార్టీలను కూడా దళితుల విషయంలో ఆలోచించక తప్పని పరిస్థితి కల్పిస్తోంది.

                                                                                                                                        * రఫీక్