Home రంగారెడ్డి ప్రమాదకరంగా మూల మలుపులు..

ప్రమాదకరంగా మూల మలుపులు..

Dangarous Road Curves In  Rangareddy District
యాచారంరూరల్ : యాచారం మండలంలోని ఆయా గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధాన రోడ్లు మూలమలుపులతో ప్రమాదకరంగా మారాయి. ఈ మూలమలుపుల వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికి ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రమాదకర మలుపులు నరకానికి నకళ్లుగా మారాయి. ఈ రోడ్ల వెంబడి ప్రయాణం చేయాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదకరంగా మూలమలుపులు ఉండటంతో పాటు ఇటీవల గ్రామీణ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్దంలా మార్చడంతో వాహనదారులు భయంలేకుండా ప్రయాణం చేస్తూ ప్రాణాలను వదులుతున్నారు. కొందరు తీవ్రంగా గాయాలపాలై అంగవైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మూలమలుపుల వద్ద ప్రదానంగా ఉన్న చెట్ల పొదలను తొలగించవల్సి ఉన్నప్పటికి అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నరు. ముఖ్యంగా ప్రమాదకర మూలమలుపుల వద్ద ఆర్‌అండర్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు హెచ్చరికబోర్డుల, స్పీడ్‌బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామీణ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా యాచారం మండల కేంద్రం నుండి కుర్మిద్ద, యాచారం నుండి మేడిపల్లి, నానక్‌నగర్‌తో పాటు ఆయా గ్రామాలను కలుపుతూ ఉన్న రోడ్లు మూలమలుపులతో ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.