Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా

ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా

Darna at the Medchal collectorate to give houses

మేడ్చల్ జిల్లాః శామీర్‌పేట మండలం ఉప్పర్‌పల్లి గ్రామంలో గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. శామీర్‌పేట జడ్పీటీసీ పి.బాలేష్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాలేష్ మాట్లాడుతూ గ్రామంలోని 837, 838 సర్వే నంబర్లలో 2003లో అప్పటి ప్రభుత్వం స్థానిక పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని తెలిపారు. కొందరు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోయారని ఆవేధన వ్యక్తం చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌లో పోను మిగతా స్థలంలో సర్వే చేసి తిరిగి పోజిషన్ చూపిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామనడంతో గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకపోగా ఇతర అవసరాలకు స్థలాన్ని కేటాయించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రామంలో గతంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామస్తులు కలెక్టర్ యంవి రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో కె.రమేష్, పి.శేఖర్, పి.లక్ష్మణ్, , వై.శాంతమ్మ,ఎ.శ్రీను, ఎ.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.