Home తాజా వార్తలు రోహిణి ఎండల వడదడ…

రోహిణి ఎండల వడదడ…

Temperatures

 

47 డిగ్రీలు దాటిన వేడి
జూన్ మొదటివారంలో మరింత ఎక్కువయ్యే సూచన
మరి పది రోజుల పాటు వడగాడ్పులు
హీట్ వేవ్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు
అత్యధిక ఉష్ణోగ్రతల వేసవి 2019
ప్రతి ప్రాంతంలో 0.5 నుంచి 1 డిగ్రీ పెరుగుదల

ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు : ఖమ్మం 44.2 డిగ్రీలు, ఆదిలాబాద్ 45.5, భద్రాద్రి కొత్తగూడెం 44.9, భద్రాచలం 41.6, హన్మకొండ 41.5, హైదరాబాద్ 42.9, జగిత్యాల 47.7, జయశంకర్ భూపాలపల్లి 45.6, జోగులాంబ గద్వాల్ 42.5, కామారెడ్డి 43.1, కరీంనగర్ 46.6, మహబూబ్‌నగర్ 41.5, మెదక్ 43.3, నల్లగొండ 43.1, నిజామాబాద్ 45, రామగుండం 43.6, కొమురం భీం ఆసిఫాబాద్ 44.6, మహబూబాబాద్ 45, మంచిర్యాల 44.9, మేడ్చల్ 42.9, ములుగు 46.9, నాగర్‌కర్నూల్ 42.8, రంగారెడ్డి 44.1, సంగారెడ్డి 42, సిద్ధిపేట 42.9, సూర్యాపేట 45.6, పెద్దపల్లి 46.8, నారాయణపేట 42.4, నిర్మల్ 43.2, రాజన్న సిరిసిల్ల 44, వికారాబాద్ 41.9, వనపర్తి 41.1, వరంగల్ రూరల్ 44.6, వరంగల్ అర్భన్ 45.1, జనగాం 44.2, మంచిర్యాల 44, యాదాద్రి భువనగిరి 40.4 .

హైదరాబాద్ : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నమోదు సంవత్సరంగా 2019 చే రింది. రానున్న రోజుల్లో అంచనా వేసిన దానికన్నా అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయి రికార్డులను క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. ఆదివారం జగిత్యాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నాగర్‌కర్నూల్ తక్కువగా 40.8 డిగ్రీలుగా నమోదయ్యిందని వాతావరణ శాఖ పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నట్టు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కారణమవుతుందని, అది ఎక్కువయ్యే కొద్దీ వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని,
చెట్ల పెంపకంతో దీనిని కొంతమేర అరికట్టవచ్చిన వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

వడగాల్పులు, ఈదురుగాలులు, వరదలు, పిడుగులు, చలిగాలులు, మెరుపులు, ఇసుక తుఫాన్లు, కరువు వంటి విపత్తులు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అంతర్జాతీయంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం 2018లో స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో 2019లో ఈ ప్రభావం మరింత అధికంగా కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎండకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొనగా ఆ దిశగానే రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు హీట్ వేవ్ జోన్‌లో ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించగా, ప్రతి ప్రాంతంలో 0.5 శాతం నుంచి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదు అవుతాయని, ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ ముందస్తుగానే తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది.

‘ఫణి’ తుపాను తీరం దాటే సమయంలో గాలిలో తేమ
‘ఫణి’ తుపాను కూడా ఈ సారి ఉష్ణోగ్రతల్లో అధిక మార్పులు చోటు చేసుకోవడానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గాలిలో తేమను తీసుకుపోవడం వల్లే అధికంగా వడగాల్పులు నమోదవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈనెల 4వ తేదీ నుంచి నిరవధికంగా వడగాల్పులు నమోదు కాగా గత వారం రోజులుగా అవి మరింత ఉధృతమయ్యాయి. 2014 సంవత్సరంలో 19 రోజులు, 2015 సంవత్సరంలో 13 రోజులు, 2016 సంవత్సరంలో 27 రోజులు, 2017 సంవత్సరంలో 23 రోజులు, 2018 సంవత్సరంలో 07 రోజులు, 2019 సంవత్సరంలో 30 రోజులు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాగా పేర్కొంటుంది. ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వగడాల్పులు ఉత్తర తెలంగాణ జిల్లాలోనే అధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, హైదరాబాద్‌లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
1901 నుంచి మొత్తం 11 వేడి సంవత్సరాల నమోదు

దేశంలో 1981 నుంచి 2010 మధ్యలో నమోదైన సగటు ఉష్ణోగ్రతల కంటే 2018లో 0.41 డిగ్రీలు ఎక్కువగా నమోదయినట్టు అధికారులు తెలిపారు. వందేళ్లకు పైగా ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకొని 2018లో నెలకొన్న నెలకొన్న అసాధారణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ కూడా నివేదిక సైతం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏటా ఎండలు పెరుగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 1901 నుంచి ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఆరు సంవత్సరాల్లో 2018 సంవత్సరం కూడా ఒకటని వాతావరణ శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది.

2004 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు మొత్తం 11 వేడి సంవత్సరాలుగా (ఎండలు) ఎక్కువగా నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఎక్కువగా ఎండ తీవ్రత ఉన్న 5 సంవత్సరాల జాబితాతో పాటు మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన 7 వేడి సంవత్సరాల జాబితాలోనూ 2018కి చోటు దక్కడం విశేషం. మొత్తంగా 2018 సంవత్సరాన్ని చూసుకుంటే ఎండలతో పాటు చలిగాలులు ఎక్కువగా నమోదయినట్టు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా 2019 సంవత్సరం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయిన సంవత్సరంగా రికార్డు సృష్టించినట్టు అధికారులు పేర్కొన్నారు.

ముందస్తు చర్యలను చేపట్టిన ప్రభుత్వం

ఎండలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను ముందుగానే ప్రారంభించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 12,741 పంచాయతీలు, 42 మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్‌లలో సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా పలు నివారణ చర్యలను తీసుకుంది. ముఖ్యంగా ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరంపై అవగాహన శిబిరాలను ఎక్కడికక్కడ నిర్వహించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవి ప్లూయిడ్లు అధిక మొత్తంలో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్‌డబ్లూఎస్ శాఖ తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోగా, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు మండల, గ్రామ స్థాయిలో సమీక్ష చేసుకొని యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకున్నారు.

ఉపాధి కూలీలకు పనిచేసే చోట టెంట్లతో పాటు షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 924 అబ్జర్వేటర్‌లను ఏర్పాటు చేయగా, జిహెచ్‌ఎంసి పరిధిలో 120 అబ్జర్వేటర్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి చోట డిస్ ప్లే వాతావరణ వివరాలను ప్రకటించడంతో ప్రజలు వాటి ద్వారా అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా అవసరం ఉంటేనే బయటకు వచ్చారు. ఈసారి వడదెబ్బతో పాటు వడగాలులకు చాలా మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తున్నా, దీనిపై పూర్తి స్థాయి లెక్కలను జూన్‌లో విడుదల చేస్తామని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం కన్నా ఈసారి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమాచారం.

నేడు వర్షం కురిసే అవకాశం

ఆదివారం రాత్రి, సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30 నుంచి 40 కి.మీల) వేగంతో తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడురోజులు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Daytime Temperatures in the State are Rising