Home తాజా వార్తలు ఎలాంటి అవకాశాలైన హార్డ్‌వర్క్ వల్లే వస్తాయి…

ఎలాంటి అవకాశాలైన హార్డ్‌వర్క్ వల్లే వస్తాయి…

Dear Comrade

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మికా మందన్న రెండవ సారి జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా రష్మిక చెప్పిన సినిమా విశేషాలు…

ఇద్దరి జర్నీ హైలైట్‌గా…
‘డియర్ కామ్రేడ్’ భావోద్వేగాలతో సాగే ఒక ఎమోషనల్ ఫిల్మ్. సినిమాలోని ఎమోషన్, మెసేజ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్, విజయ్ క్యారెక్టర్‌ల మధ్య జర్నీ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది.

ప్రేమలో పడితే…
సినిమాలో నేను లిల్లీ అనే స్టేట్ లెవల్ క్రికెటర్ పాత్రలో నటించాను. ఆమె బాబీ అనే అతనితో ప్రేమలో పడితే.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలాంటివి, బాబీతో తన లైఫ్, లవ్ జర్నీ ఎలా సాగింది అనేదే సినిమా.

క్రికెట్ బేసిక్స్ తెలుసుకున్నా…
నిజం చెప్పాలంటే క్రికెట్ గురించి నాకు ఏమి తెలియదు. ఈ చిత్రంలోని లిల్లీ పాత్ర వల్లే నేను క్రికెట్ గురించి బేసిక్స్ తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు వికెట్ పడకుండా క్రికెట్ ఆడగలను. అలా అని సిక్స్‌లు కొట్టమంటే కష్టం. ఇప్పటికైతే ఫోర్లు చాలా సార్లు కొట్టాను.

కన్నడ, తెలుగులో డబ్బింగ్ చెప్పా…
ఈ సినిమా కోసం నేను కన్నడ, తెలుగులో డబ్బింగ్ చెప్పాను. తమిళ్, మలయాళంలో వేరేవాళ్లు చెప్పారు. ఇక తమిళ్, మలయాళంలో కూడా నేను వరుసగా సినిమాలు చేస్తే… ఆ భాషలు నేర్చుకుని అక్కడ కూడా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను.

అందుకే అంగీకరించాను…
విజయ్ దేవరకొండ కోసమో, మరొకరి కోసమో నేను ఈ సినిమా ఒప్పుకోలేదు. స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు బాగా నచ్చింది. దాంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.

స్క్రిప్ట్ మీద ఫుల్ కమాండ్…
దర్శకుడు భరత్‌కమ్మకు స్క్రిప్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంది. మొదట ఆయన నాకు స్క్రిప్ట్ మెయిల్ చేశారు. కానీ నేను చదవలేదు. ఆ తరువాత ఆయన కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది.

నేను లక్కీ అనుకోవడం లేదు…
మహేష్‌బాబు సినిమాలో నాకు అవకాశం రావడాన్ని నేను లక్కీ అనుకోవడం లేదు. ఎలాంటి అవకాశాలైన హార్డ్‌వర్క్ వల్లే వస్తాయి. నేను హార్డ్ వర్క్ చెయ్యడం వల్లే నాకు మంచి అవకాశాలు వస్తున్నాయని భావిస్తున్నాను.

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా…
‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ షెడ్యూల్‌లో నా రోల్ కి సంబంధించి ఎలాంటి షూట్ జరుగలేదు. దాంతో మహేష్‌తో కలిసి వర్క్ చేయలేకపోయాను. తరువాత షెడ్యూల్ లో ఆయనతో కలిసి నటించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే ఇప్పటివరకూ మహేష్‌ను ఒకసారి కలిశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు.

Dear Comrade is an Emotional Film