Home జాతీయ వార్తలు 113కు చేరిన మెదడువాపు మృతులు

113కు చేరిన మెదడువాపు మృతులు

Muzaffarpur district

 

ముజఫర్‌పూర్ (బీహార్): బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో మెదడు వాపు మృతుల సంఖ్య 113కు పెరిగింది. ఈ మరణాలు శ్రీక్రిష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రి (ఎస్‌కెఎమ్‌సిహెచ్) లోనే జరిగాయి. మంగళవారం రాత్రి తాజాగా 20 కేసులు వచ్చాయి. మెదడువాపు బాధితులు జూన్ 1 నుంచి ఆస్పత్రిలో 372 మంది చేరారు. వీరిలో 118 మందిని చికిత్స తరువాత డిశ్చార్జి అయ్యారని, 93 మంది మృతి చెందారని, మిగతా వారు చికిత్స పొందుతున్నారని సీరియస్ కండిషన్‌లో ఉన్న వారిని పాట్నా లోని ఆస్పత్రులకు రిఫర్ చేసినట్టు అధికారులు తెలిపారు. కేజ్రివాల్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి తాజాగా ఇద్దరిని చేర్చారు. జూన్ 1నుంచి ఇక్కడ మొత్తం 146 మంది చేరగా,19 మంది చనిపోయారు. పొరుగున ఉన్న తూర్పు చంపారన్ జిల్లా నుంచి మంగళవారం ఒకరు చనిపోయారు. ముజఫర్‌పూర్ నుంచి దర్భాంగ, సుపౌల్, మధుబని ప్రాంతాలకు 11 మంది మెడికల్ ఆఫీసర్లను నియమించారు. మిగతా జిల్లాలకు ముగ్గురు పిల్లల డాక్టర్లను నియమించారు. వీరు కాక 12 మంది నర్సులను ముజఫర్‌పూర్ సివిల్ సర్జన్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు.

సిఎం నితీష్‌కుమార్‌పై కేసు
ముజఫర్‌పూర్‌కు చెందిన స్థానికుడు మొహమ్మద్ నసీమ్ ఈ మరణాలకు ఆవేదన చెంది ముఖ్యమంత్రి నితీష్‌కుమార్,డిప్యూటీ సిఎం సుషీల్ మోడి, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్, ఉపమంత్రి అశ్విని చౌబే, రాష్ట్ర ఆరోగ్యమంత్రి మంగల్ పాండేపై స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరందరి నిర్లక్షం వల్లనే మరణాలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఈ కేసు విచారణను వచ్చే మంగళవారం నాటికి వాయిదా వేశారు.

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: బీహార్‌లోని ముజఫర్ జిల్లాలో మెదడువాపుతో బాధపడుతున్న చిన్నారులకు నిపుణుల ద్వారా అత్యవసర చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే సోమవారం ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సూర్యాకాంత్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ తెలిపింది. అంటు వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు సమర్థవంతమైన చికిత్స అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలు, ఇతర సహాయం అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. వారం క్రితం 100 మందికి పైగా చిన్నారులు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయవాది మనోహర్ ప్రతాప్ తెలిపారు.

Death toll climbs to 113 in Muzaffarpur district