Home లైఫ్ స్టైల్ పెళ్లి పేరుతో మోసగించడం నేరం

పెళ్లి పేరుతో మోసగించడం నేరం

బాల్యవివాహాలు చేయకూడదని బాల్యవివాహాల నిరోధక చట్టం 1929 ప్రవేశ పెట్టబడింది. సెక్షన్ 2 ప్రకారం అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాల వయసు నిర్ధారణ చేశారు. అలాగే సెక్షన్ 5 ప్రకారం బాల్యవివాహం జరిపినందుకు శిక్ష వుంటుంది. తల్లిదండ్రులు, పెద్దలు, బంధువులు, పురోహితులు ఎవరైనా కూడా శిక్షార్హులే. అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లో తెచ్చారు. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహాన్ని రద్దు చేసుకోదగిన వివాహంగా నిర్ధారించారు. బాల్య వివాహం జరిగిన అమ్మాయి తను మేజర్ అయిన తర్వాత రెండేళ్లలోగా తన బాల్య వివాహాన్ని రద్దు చేయాలని పిటిషన్ వేసుకునే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించారు. కనుక, నీవు నీ తల్లిదండ్రులను ఒప్పించి, వారిని కూడా బాధించకుండా నచ్చజెప్పి, ముందు నీ చదువు డిగ్రీ పూర్తి చేశాకా నువ్వు ప్రేమించిన అబ్బాయి అన్ని విధాల యోగ్యుడైతే, పెద్దలందరి సమక్షంలో పెళ్లి జరిపించమని తల్లిదండ్రులను అడుగు.

Childhood-Marriageప్ర : మా అక్క సుమ గురించి రాస్తున్నాను. నేను ఇంటర్ చదువుతున్నాను. మా అక్క పదవతరగతిలోనే చదువు ఆపేసింది. దానికి కారణం మా నాన్న మరణం. అమ్మ, నాన్నాలిద్దరూ మమ్ముల్ని చదివించడానికి కష్టపడేవారు. నాన్న ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తే, అమ్మ నాలుగిళ్ళల్లో పని చేసి మా జీవితాలు చదువుకుంటే బాగుపడతాయని ఆలోచించేవారు. కానీ నాన్న హఠాన్మరణం మా బతుకుల్ని మార్చేసింది. అక్క చదువు మానేసి, నాన్న చేసే ప్రింటింగ్ ప్రెస్‌లో పనిలో చేరింది.

ఆ యజమాని మా నాన్న పనిని అక్కకి ఇచ్చారు. మేము సంతోషించాము. కానీ అతను మా అక్క జీవితంతో ఆడుకున్నాడు. మాకు తెలియకుండా ఒకరోజు మా అక్క మెడలో పసుపు తాడు కట్టి, పెళ్లి అని చెప్పి నమ్మించి గర్భవతిని చేశాడు. మాకు తెలిసేసరికి అక్కకి నాలుగు నెలల గర్భవతి. కానీ అతనికి పెళ్లై, పిల్లలు (ఇద్దరు). నేనూ, అమ్మా వెళ్లి ఆయన్ని అడిగితే మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని చెప్పి పంపేశాడు. ఆయన భార్యకు ఈ విషయం తెలిసి కేసు పెట్టింది. కోర్టు రెండవ పెళ్లి నేరం కింద క్రిమినల్ కేసు కింద సమన్లు పంపింది. మా బావ, మా అక్కతో నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను. తనతో పెళ్లి జరగలేదని చెప్పమంటున్నాడు. మేము ఏం చేయాలో దయచేసి చెప్పండి. అక్కకి బాబు పుట్టి మూడు నెలలైంది. పరిష్కారం చెప్పండి.
-సుజాత, అశ్వరావుపేట
జ : చూడమ్మా సుజాత! మీ అక్క గురించి నీవు రాసింది చదివాకా చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల తండ్రి చనిపోయి కుటుంబ పోషణ కోసం పనిలో చేరితో, నమ్మించి మోసం చేయడానికి అతను మనీషా, పశువా? అని అనిపిస్తుంది. ఆడపిల్లల్ని, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో వున్న వాళ్ళను నమ్మించి చాలా ఈజీగా మోసం చేస్తున్నారు. మీ బావ లాంటి వాళ్లు. ఏరకమైన సాక్షాలు లేకుండా చాలా తెలివిగా జాగ్రత్తపడ్డాడు. మీ అక్కను పెళ్లి పేరుతో మోసం చేసి తనని వాడుకోవడం చాలా దారుణం, అనైతికం. డబ్బుతో ఆ తప్పు కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నాడు. అయితే మీ అక్క తనని మోసపూరితంగా పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టుకోవచ్చు.

అలాగే ఈ పెళ్లిని రద్దు చేయమని కోరుకోవచ్చు. పెళ్లి జరిగిందని, లేదా జరుగుతుందని చెప్పి సహజీవనం చేస్తే అది నేరం సెక్షన్ 493 పీనల్ కోడ్ ప్రకారం పది సంవత్సరాల శిక్ష విధిస్తుంది. అలాగే మొదటి భార్య వుండగా రెండవ పెళ్లి చేసుకోవడం సెక్షన్ 494 బైగమీ కింద నేరం. దీనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష వుంటుంది. అలాగే మీ అక్కకి 18 సంవత్సరాలు నిండని పక్షంలో బాల్య వివాహాల నిషేధ చట్టం కింద నేరంగా పరిగణింపబడుతుంది. మీరు ఇవన్నీ వివరిస్తూ ఒక ఫిర్యాదు పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వండి. అలాగే మీ అక్కకు పుట్టిన బిడ్డ అతనికి లీగల్ వారసుడే అవుతాడు. మీ అక్క కొడక్కి ఆస్తిలో భాగం వస్తుంది. కనుక భయపడకుండా అతనికి బుద్ధి చెప్పడానికి పైన చెప్పిన విధంగా కేసు పెట్టండి. మీకు న్యాయం జరుగుతుంది.
భయం వద్దు హ్యాపీగా చదువుకోండి

ragging2ప్ర : నేను గుంటూరు నుంచి రాస్తున్నాను. నేను ఇంటర్ (ఎంపిసి) 80శాతం మార్కులతో పాస్ అయ్యాను. మా తండ్రికి నన్ను బి.టెక్ చదివించాలని కోరిక. కానీ, మా ఫ్యామిలీలో ఇప్పటి వరకూ అమ్మాయి ఎవ్వరూ బి.టెక్ చదవలేదు. నాకు ఇంట్రస్ట్ వుంది కానీ మా ఫ్రెండ్ చెప్పిన దగ్గర నుండి నాకు ఎందుకో భయంగా వుంది. మా ఫ్రెండ్ నీరజ వాళ్ళ దూరపు రిలేషన్ ఒకరు ర్యాగింగ్ బాధ తట్టుకోలేక ఉరి వేసుకున్నాడని, అందుకే వాళ్ళన్నయ్యను కూడా వాళ్ల డాడీ బి.టెక్ చదివించలేదని చెప్పింది.

అప్పటినుండీ నేను అదే తలచుకొని భయపడుతున్నాను. మా ఇంట్లో చెబితే భయపడకు ర్యాగింగ్ అనేది కామన్ ఎక్కడైనా వుంటుంది దాని గురించి ఎక్కువగా ఆలోచించకు అంటున్నారు. ర్యాగింగ్ అనేది ఎందుకు చేస్తారు. జూనియర్లు అయినంత మాత్రాన ఈ ర్యాగింగ్ భరించాలా? అందరూ ధైర్యవంతులు వుండరు కదా! ర్యాగింగ్ పేరుతో బాధించి, హద్దు మీరి ప్రవర్తిస్తే వారికి శిక్షలు లేవా? కొందరు విద్యార్థులు చదువు మధ్యలో ఆపి వెళ్లిపోతుంటారు. మరికొందరు సూసైడ్ చేసుకుంటుంటారు. కొంతమంది ఇంట్లో వారికి చెప్పకుండా బాధపడుతుంటారు. వీటిని అరికట్టడానికి ఏ చట్టాలున్నాయి దయచేసి తెలుపగలరు. నేను ఎం.సెట్ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. కానీ ఈ భయం నన్ను పీడిస్తుంది.
-మేఘన, గుంటూరు.
జ : మేఘన ఈ ర్యాగింగ్ అనేది ఒక వికృతమైన చర్య. దీనికి ఇదివరలో చాలా మంది బలైనారు. ఆ సంఘటనలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. దీనికి సంబంధించి ర్యాగింగ్ నిషేధ చట్టం వుంది. దీన్ని లెక్క చేయకుండా వున్న వారికి ఈ కింది సూచనలు వర్తిస్తాయి.
పాల్పడిన విద్యార్థులకు చదువు మధ్యలోనే కాలేజీ నుండి సస్పెన్షన్ చేస్తారు.
సంవత్సరంతో సంబంధం లేకుండా పంపించేస్తారు.

క్షమాపణ చెప్పించి, జరిమానా వేస్తారు. ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 ప్రకారం.
బహిరంగంగా ఏడిపించడం, అవమానపరచడం (ర్యాగింగ్ పేరుతో) చేసిన సెక్షన్ 4(1) ప్రకారం ఆరు నెలలు జైలుశిక్ష వెయ్యి రూపాయల జరిమానా వుంటుంది.

నేరపూరితమైన పనులు చేసిన సెక్షన్ 4(2) ప్రకారం ఒక సంవత్సరం జైలుశిక్ష, రెండు వేలు జరిమానా ఉంటుంది.
పేరుతో బలమైన గాయాలు చేసినా, కిడ్నాప్ లాంటివి చేసినా ఐదేళ్ల జైలుశిక్ష పదివేల రూపాయల జరిమానా వుంటుంది.
లేదా చనిపోయేటట్లు ప్రేరేపించడం వంటివి చేసినా పది సంవత్సరాల జైలుశిక్ష లేదా జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా వుంటుంది.
టేకిమినల్ కేసులు, నేరచరిత్ర కలిగి వున్న వారికి విదేశీ పాస్‌పోర్ట్ రద్దు చేయబడుతుంది.

2002లోనే ర్యాగింగ్‌ని నిషేధిస్తూ అన్ని విద్యాసంస్థలకూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఈ ర్యాగింగ్ చర్యలు అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కనుక మీరు భయం వదిలి, హ్యాపీగా చదువుకోండి. మీకు చట్టాలు అండగా వుంటాయి.
ఎవ్వరూ బాధపడకూడదనే చట్టాలు

ప్ర : నేను ‘మన తెలంగాణ’ దినపత్రికలో మీ న్యాయసలహాలు ప్రతీవారం చదువుతాను. నా సమస్యకు మీ ద్వారా పరిష్కారం లభిస్తుందని మీకు రాస్తున్నాను. నేను ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను మా తల్లిదండ్రులకు పెద్ద కూతుర్ని. నాకు ఒక తమ్ముడు పదవతరగతి చదువుతున్నాడు. నాకు 12ఏళ్ల వయసులో మా నానమ్మకు అనారోగ్యంగా వుండడంతో డాక్టర్స్ ఆమె ఇక బతకడం కష్టమన్నారు. మా నాన్న ఆమె కోరిక తీర్చడం కోసం నాకు మా మేనత్త (నాన్న చెల్లి) కొడుకునిచ్చి (సురేష్ 17 సంవత్సరాలు) పెళ్లి చేశారు. అప్పటినుండి నన్ను మా అత్త ఏ పెళ్లిళ్లకెళ్లినా, ఫంక్షన్స్‌కు వెళ్లినా తన కోడలిగా అందరికీ పరిచయం చేస్తుంది.

నాకు ప్రస్తుతం 19 సంవత్సరాలు. తను నాన్నతో ఈ మధ్య మా ఇంటికి వచ్చినప్పుడు మంచి ముహూర్తం చూసి నా కోడల్ని మా ఇంటికి పంపించండి అని చెప్పింది. నేను మా క్లాస్‌మేట్ వినయ్‌ని ప్రేమిస్తున్నాను. నా చిన్నప్పుడు జరిగిన పెళ్లి ముఖ్యమా, నా ప్రేమ ముఖ్యమా అని నన్ను నా తల్లిదండ్రులు అడిగితే నాకు ప్రేమించిన వినయ్‌తో పెళ్లి చేయండి అని చెప్పాలని వుంది. ఈ విషయం నా తమ్ముడితో కూడా చెప్పుకోలేక నాలో నేను బాధపడుతున్నాను. వినయ్ మనం రహస్యంగా వెళ్లి పెళ్లి చేసుకుందామంటున్నాడు. నేను ఏం చేయాలి? ప్లీజ్ దయచేసి సలహా చెప్పండి.
-చంద్రిక, వరంగల్.
జ : చూడు చంద్రికా! నీ సమస్య చదివాకా, మీ పెద్దలు (తల్లిదండ్రులు) నీ విషయంలో పెద్ద తప్పు చేశారు. వాళ్ల ప్రేమాభిమానాలు, వాళ్ళ కోరికలు చిన్న పిల్లలైన మీ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అందువల్లే నీవు ఈ బాధకు గురై ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా బాల్యవివాహాలు చేయకూడదని బాల్యవివాహాల నిరోధక చట్టం 1929 ప్రవేశ పెట్టబడింది. సెక్షన్ 2 ప్రకారం అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాల వయసు నిర్ధారణ చేశారు. అలాగే సెక్షన్ 5 ప్రకారం బాల్యవివాహం జరిపినందుకు శిక్ష వుంటుంది.

తల్లిదండ్రులు, పెద్దలు, బంధువులు, పురోహితులు ఎవరైనా కూడా శిక్షార్హులే. అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లో తెచ్చారు. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహాన్ని రద్దు చేసుకోదగిన వివాహంగా నిర్ధారించారు. బాల్య వివాహం జరిగిన అమ్మాయి తను మేజర్ అయిన తర్వాత రెండేళ్లలోగా తన బాల్య వివాహాన్ని రద్దు చేయాలని పిటిషన్ వేసుకునే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించారు. కనుక, నీవు నీ తల్లిదండ్రులను ఒప్పించి, వారిని కూడా బాధించకుండా నచ్చజెప్పి, ముందు నీ చదువు డిగ్రీ పూర్తి చేశాకా నువ్వు ప్రేమించిన అబ్బాయి అన్ని విధాల యోగ్యుడైతే, పెద్దలందరి సమక్షంలో పెళ్లి జరిపించమని తల్లి దండ్రులను అడుగు. ఎవ్వ రూ బాధ పడకూడదనే చట్టాలు ప్రవేశపెట్టారు.

SBT-Sundariఎస్.బి.టి. సుందరి
హైకోర్టు న్యాయవాది,
ఫ్యామిలీ కౌన్సిలర్.