Home జాతీయ వార్తలు ‘సరిబేసి’పై సోమవారం నిర్ణయం

‘సరిబేసి’పై సోమవారం నిర్ణయం

Kejriwal

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి నాణ్యత మరో రెండు మూడు రోజుల్లో మెరుగయ్యే సూచనలున్నాయి కనుక రోడ్లపై వాహనాల నియంత్రణ పథకం ‘సరిబేసి’ పొడిగింపుపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ సిఎం ప్రజలకు లేనిపోని ఇబ్బందులు కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ‘పరిస్థితిని మేము పరిశీలిస్తున్నాం.

వాతావరణం మెరుగైతే సరిబేసి’ ని పొడిగించే అవసరం లేదు. సోమవారం ఉదయం తుది నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు. నవంబర్ 4న ఢిల్లీలో ప్రారంభించిన ఈ పథకం శుక్రవారంతో ముగిసింది. సిక్కుల మతగురువు గురునానక్ 550వ జయంత్యుత్సవాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో రోడ్లపై ఆంక్షల్ని ప్రభుత్వం తొలగించింది. అవసరమైతే పొడిగించవచ్చు. ‘ఈ పథకం జయప్రదమైందా?’ అని అడగ్గా… ‘దుమ్ము, పొగ, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాల నియంత్రణకు ఇదొక పద్ధతి’ అని కేజ్రీవాల్ చెప్పారు. ‘ఢిల్లీ రోడ్లపై రోజుకు 30 లక్షల కార్లు తిరుగుతాయి.

వాటి సంఖ్య తగ్గితే, తప్పకుండా ఈ పథకం ఫలితం కనబడుతుంది. అయితే…చలికాలంలో కాలుష్యం పెరగడానికి మొదటి కారణం… పొరుగు రాష్ట్రాలు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం’ అన్నారాయన. పథకాన్ని విజయవంతం చేసినందుకు ఆయన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విషపూరిత వాయువులతో ఢిల్లీ చుట్టూ దట్టమైన పొర ఏర్పడినందున శుక్రవారం కూడా గాలి నాణ్యత సూచిక 465 స్థాయిలో ఉంది.

Decision on odd even extension to be taken on Monday