హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 కి అత్యంత ప్రాధాన్యత ఉన్న రోజు అని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసేందుకైనా సిద్ధపడి ఉద్యమనాయకుడు కెసిఆర్ ఆమరణ నిరహార దీక్ష చేసి ఢిల్లీపాలకుల మెడలు వంచిన రోజు అని హరీశ్‌రావు చెప్పారు. అలాగే తెలంగాణకోసం ప్రాణాలను శ్రీకాంతచారి సమర్పించిన రోజుకూడా ఇదే రోజుఅని హరీశ్ రావు ఆనాటి ఉద్యమాలను, త్యాగాలను ప్రజలకు గుర్తు చేశారు. ఆదివారం పటాన్చెరులో ఏర్పాటుచేసిన గ్రేటర్ ఎన్నికల బహిరంగసభలో హరీశ్‌రావు ప్రసంగిస్తూ తెలంగాణ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణ వచ్చుడో కెసిఆర్ చచ్చుడో అని కెసిఆర్ ఆమరణ దీక్ష చేయకపోయినా, తెలంగాణ కోసం కెసిఆర్ ఖమ్మం జైలుకు వెళ్లకపోయినా తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించేదాని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని అధికారంలోకి వచ్చి ఆనాడు బిజెపి మోసం చేసిందన్నారు.
తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న 12వందల మందిని నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పొట్టనపెట్టుకుందని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. ఎన్నో త్యాగాలు చేసి ఆనాడు తెలంగాణ తెచ్చి నేడు బంగారు తెలంగాణగా మార్చుకున్నామని ఆయన చెప్పారు. మరో మూడు సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి పనులు చేస్తుంది. ప్రజలకు భద్రత కల్పిస్తుంది. ఉపాధి పెంచుతుందన్నారు. కరోనా వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి మీమ్ములను కాపాడుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం, వరదలు వస్తే కాపాడుకున్నది టిఆర్ఎస్ ప్రభత్వం,భవిష్యత్‌లో కూడా కాపాడుకుని అభివృద్ధిచేసే బాధ్యతకూడా టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ప్రజలపక్షాన ప్రజలకోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు దీవించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.