Home దునియా హరితావళి

హరితావళి

దీపకాంతుల ఉత్సవమే దీపావళి..
అందరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ..
చీకటి నుండి వెలుగు వైపు పయనమే ఈ వేడుక..
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక..
అజ్ఞానం నుండి జ్ఞానం వైపు
నడవాలనే సందేశాన్నిచ్చే పండుగ..
పర్యావరణహితంగా జరుపుకుంటే
నిజంగానే వెలుగు వైపు
మన జీవన ప్రయాణం సాగుతుంది.
పెరుగుతున్న కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోవడమే అసలైన దీపావళి…

పర్యావరణహిత దీపావళి ఆనందమే కాదు ఆరోగ్యం కూడా. ప్రమాదకరమైన రసాయనాలతో నిండిన బాణా సంచా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుంది. వాటి పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. విపరీతమైన శబ్దాల వల్ల చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. పర్యావరణానికి హాని కలిగించే బాణా సంచాకు ‘నో’ చెప్పి, దీపాలంకరణలతో, ఎకో ఫెండ్లీ క్రాకర్స్‌ను కూడా చాలా తక్కువ వినియోగిస్తూ పండుగ జరుపుకుందాం.

ఢిల్లీ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో విపరీతమైన కాలుష్యం పెరిగింది. ఇప్పటికే ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నవారు నగరాల్లో ఎక్కువ ఉన్నారు. అందుకే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రసాయనాలతో తయారు చేసిన పటాసులు కాల్చకుండా ఉంటేనే మంచిది అని
పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

బాణా సంచా లేకుంటే పండుగ సంబరమే లేదని చాలా మంది భావిస్తారు. అలాంటి వారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్. ఇవి మామూలు బాణాసంచాలా కాకుండా, వాతావరణానికి ఎలాంటి హాని కలిగించనటువంటివి. వీటి శబ్దం కూడా పరిమిత దూరం వరకే వినిపిస్తుంది. కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను ఇవి వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్, ఫాస్పేట్‌ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు. బాణసంచా కాల్చే బదులు సంగీతం, నృత్యం, ఆటలు, పాటలు వంటి అనేక కార్యక్రమాలతో ఈ రోజును సంతోషంగా గడపండి. ఎందుకంటే సామాజిక వేడుకలు వ్యక్తిగత వేడుకల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. ఒకరికొకరు మిఠాయిలు పంచుకోండి.

జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాలు, ఆనంద కోలాహలంతో వెల్లి

విరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్లు దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. మహిళలంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. దీపావళి

రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. దీంతో దుర్వాసుడు దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

గ్రీన్ క్రాకర్స్
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) శాస్త్రవేత్తలు సరికొత్తగా కాలుష్యరహిత టపాసుల తయారీకి ఫార్ములా కనుగొన్నారు. వీటినే ‘గ్రీన్ క్రాకర్స్’ అని అంటారు. ఇవి ఉద్గారాల స్థాయిలను తగ్గించడమే కాకుండా, గాల్లో ఉండే ధూళి కణాలను గ్రహించుకుంటాయి. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ క్రాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆంటిమోని, లీథియమ్, మెర్క్యురీ, ఆర్సెనిక్, లెడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించరు. రంగులు, మెరుపులను వెదజల్లుతూ బాణాసంచాలను మరిపిస్తాయి.
గ్రీన్ క్రాకర్లలో మండే పదార్థాలకు బదులు అతి తక్కువ కాలుష్యం ఉత్పత్తి చేసే మెగ్నీషియంను ఉపయోగిస్తారు. పొటాషియమ్ నైట్రేట్, సల్ఫర్ వంటివి కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల పర్యావరణానికి హాని కలుగదు. ఈ గ్రీన్ క్రాకర్లు పేలినప్పుడు నీటి పరమాణువులను ఉత్పత్తి చేస్తాయి. ఇవి గాల్లోని ధూళి కణాలను గ్రహిస్తాయని ఎన్‌ఈఈఆర్‌ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రకృతి కన్నెర్రజేస్తే మానవ మనుగడే ప్రశ్నార్థకం. అలాంటి ప్రకృతికి మేలు చేయకపోయినా.. కనీసం చేటు చేయకుండా ఉందాం. ఒక్కరం టపాసులు కాలిస్తే ఏమవుతుందిలే అనుకోవద్దు. మార్పుకు నాంది ఒక్కరితోనే మొదలవుతుంది. ఈసారైనా మేల్కొందాం.. మోతలకు దూరంగా కొంగొత్తగా దీపావళి జరుపుకొందాం. భద్రమైన భవితవ్యం మన నిర్ణయంలోనే! చైతన్యం మన చేతిలోనే!!

Diwali Festival Celebrations
పర్యావరణహిత దీపావళిలో బన్‌చరౌదా మహిళలు
పర్యావరణ హిత దివ్వెలను ఆవుపేడతో తయారుచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని బన్ చరౌదా గ్రామ మహిళలు. ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షలకు పైగా దివ్వెలను తయారుచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘గోథన్’ (గోశాల) ప్రాజెక్టుకు బన్ చరౌదా గ్రామం ఎంపికయ్యింది. చత్తీస్‌గఢ్‌లోని 1,905 గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ మహిళలు పశుపోషణ చేసి, పాల ఉత్పత్తికి తోడ్పడుతారు. ప్రాజెక్టులో భాగంగా వర్మీకం పోస్ట్ కోసం ఆవుపేడను సేకరించేవారు. ఇక్కడే బన్ చరౌదా మహిళలు సృజనాత్మకంగా ఆలోచించారు. ఆవుపేడకు కొన్ని ఇతర పదార్థాలు కలపి, దీపావళికి పర్యావరణహితంగా ఉండే దివ్వెలను తయారు చేయాలనుకున్నారు. ఆవుపేడలో చింతగింజల పేస్టుతో పాటు ఇతర ఎండబెట్టిన వనమూలికల పొడులు కలిపి, వాటితో ఆకట్టుకునే ఎకోఫ్రెండ్లీ దివ్వెలను తయారు చేశారు. ఈ ఆలోచన నచ్చడంతో అధికారులు అక్కడి స్వయం సహాయక సంఘాలను దివ్వెల తయారీలో ప్రోత్సహించారు.
రోజూ 4 నుంచి 5 వేల దివ్వెలు…
ఆవుపేడతో రూపుదిద్దుకునే ఈ దివ్వెల తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఆవుపేడను ఒక యంత్రంలో డ్రైగా మార్చి, పౌడర్‌లా తయారుచేస్తారు. అందులో చింత గింజల పేస్టు కలుపుతారు. సువాసనల కోసం రకరకాల వనమూలికలు కలుపుతారు. వివిధ ఆకృతుల్లో ఉన్న దివ్వెల అచ్చుల్లో ఈ మిశ్రమాన్ని వేసి, వాటిని ఎండబెడతారు. దివ్వెలు గట్టిగా మారిన తర్వాత వాటికి సహజసిద్ధమైన రంగులతో అందమైన డిజెన్లు వేస్తారు. ఆకర్షణీయమైన ‘మోటిఫ్స్’తో అలంకరిస్తారు. సైజు, డిజైన్‌ని బట్టి ఒక్కో దివ్వె రెండు నుంచి పది రూపాయలకు అమ్ముతున్నారు. నగరాల్లో వీటికి మంచి ఆదరణ లభించడంతో రాత్రింబవళ్లు శ్రమించి రోజుకు 4 నుంచి 5 వేల దివ్వెలను తయారుచేస్తున్నారు. వీటితో పాటు దేవతా విగ్రహాలు, పూల కుండీలు, దీపపు స్తంభాలు, మొబైల్‌ఫోన్ స్టాండ్, కీచైన్స్ వంటివి కూడా.

ఇలా చేయండి…

* పేలుడు శబ్దాలొచ్చే పటాసులను కాల్చొద్దు. పటాకుల వల్ల గాలి, పరిసరాలు శబ్దంతో నిండిపోతాయి. మరుసటి రోజు వీధివీధంతా వ్యర్థాలతో నిండివుంటుంది. పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌ను కాల్చడం మంచిది.
* సంప్రదాయ లైటింగ్ ఉపయోగించండి. ఈ రోజుల్లో మట్టి ప్రమిదలు డిజైనర్ లుక్‌ని ఇస్తున్నాయి. సంప్రదాయ మట్టి ప్రమిదలతో పాటు టీ లైట్స్, ఫ్లోటింగ్ క్యాండిల్స్, ఫంకీ ల్యాంప్స్‌ను ఇంట్లో అలంకరించవచ్చు.
* ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఇంటికి కొత్త అందాన్ని ఇస్తాయి. ఏదైనా పెద్ద గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో చిన్న ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఉంచండి. వీటిని ద్వారానికి ఇరువైపులా పెట్టండి. లివింగ్ రూమ్‌లో కూడా మధ్యమధ్యలో వాటిని పెట్టి అంతటా వెలుగు నింపవచ్చు. నీళ్లలో గులాబీ పూల రెమ్మలు వేసి కూడా వాటిని అలంకరించవచ్చు. ఫ్లోటింగ్ కందీల్ ల్యాంప్స్‌తో కూడా ఇంటిని ప్రత్యేకంగా అలంకరించవచ్చు.


* బయో డిగ్రేడబుల్ దీపాలతో ఖర్చు కూడా తక్కువే. దీపాల కుందుల్లో కొబ్బరి చిప్పలు, ఆరంజ్ తొక్కలు, గోధుమ పిండితో తయారుచేసిన దీపాలను కూడా వాడొచ్చు.
* దీపావళికి కొందరు బంధువులు, స్నేహితులకు బహుమతులు ఇచ్చుకుంటారు. వాటిలో మొలకలు, జ్యూట్ బ్యాగులు, ఖాదీ వస్త్రాలు ఇలాంటివి ఇచ్చుకుంటే పర్యావరణాన్ని కాపాడినవారం అవుతాం. ప్లాస్టిక్ జోలికి వెళ్లనే వెళ్లొద్దు. రీసైక్లింగ్‌కి ఉపయోగపడే వస్తువుల్ని వాడదాం. అలంకరణ సామగ్రిలో తిరిగి ఉపయోగపడే వస్తువులనే వాడాలి. పండుగలకు ముగ్గు వేయడమనేది మన సంప్రదాయం. రసాయనాలు కాకుండా బియ్యం పిండి, సహజ రంగుల్ని ఉపయోగిద్దాం. ఇందువల్ల చిన్న చిన్న కీటకాలు, పక్షులు వీటిని తింటాయి. పర్యావరణానికీ హాని వుండదు.

Diwali Firecrackers
* దీపావళి అంటేనే మిఠాయిలు గుర్తొస్తాయి. చక్కెరతో చేసిన స్వీట్లను కాకుండా బెల్లంతో తయారుచేసినవి తింటే మంచిది. ఇంట్లో తయారుచేసుకుంటే శుచి శుభ్రతతోపాటు రుచి ఉంటాయి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం మర్చిపోవద్దు. ప్లాస్టిక్ పూలకు బదులుగా గృహాలంకరణకు బంతి, గులాబి, చామంతి వంటి పూలను వినియోగిస్తే బాగుంటుంది. పూలలో ఉండే పరిమళం ఇంట్లోని హానికరమైన బాక్టీరియాను చంపటానికి ఉపయోగపడుతుంది.
* మామిడి తోరణాలతో ఇంటి అలంకరణ చేస్తే పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బంతి పూలు, గులాబీలు వంటి పూలతో రంగవల్లులను అలంకరించినా ఇంటికి కొత్త అందం వస్తుంది.

మల్లీశ్వరి వారణాసి

 

Deepavali Festival Story in Telugu