Wednesday, April 24, 2024

విచారణలో వెక్కివెక్కి ఏడ్చిన దీపిక..

- Advertisement -
- Advertisement -

మూడు సార్లు వెక్కివెక్కి ఏడ్చిన నటి
యాక్షన్లొద్దు.. నిజాలు కావాలి: దీపికతో ఎన్‌సిబి ఘాటు సీన్
సరుకువాలాల పేర్లు వెలుగులోకి

ముంబై: ప్రముఖ నటి, సినిమాలో రాణి పద్మావతి దీపిక పదుకొణే ఇప్పుడు నిజజీవితంలో వెక్కివెక్కి ఏడ్చారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో తలెత్తిన డ్రగ్స్‌కేసులో ఈ నటి మాదకద్రవ్యాల నిరోధక సంస్థ(ఎన్‌సిబి) ఎదుట హాజరయి నప్పుడు పలు ఉద్విగ్నభరిత ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడూ సినిమాలలో తనకు అనుకూలంగా కాల్షీట్స్ ఇచ్చే ఈ బాలీవుడ్ అగ్రనటి ఇప్పుడు ఎన్‌సిబి సమన్లతో ఇటీవలే ముంబైలో అధికారుల ఎదుట హాజరయ్యారు. వారు ఆమెను ఐదున్నర గంటల పాటు విచారించారు. కేవలం స్క్రిప్ట్‌కు అనుగుణంగానే కన్నీరు కార్చడం లేదా ఇతరత్రా హావభావాలను పలికించే హీరోయిను ఇప్పుడు తనకు కొత్తగా ఎదురైన అనుభవంతో, అధికారుల ఇంటరాగేషన్ల తంతుతో కంగుతిన్నారు. రెండు మూడుసార్లు శనివారం నాటి ఈ ఇంటరాగేషన్ దశలో ఆమె కన్నీరు పెట్టుకున్నట్లు వెల్లడైంది. సుశాంత్ ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరిగి చివరికి బాలీవుడ్‌తో ముంబై చీకట్లో ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో, ఫార్మ్‌హౌజ్‌లలో పెనవేసుకుని పోయిన డ్రగ్స్‌లోకపు చిమ్మచీకట్లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రముఖ నటి రియా చక్రవర్తి కేసులో అరెస్టు అయ్యారు. బెయిల్ దొరకని స్థితిలో ఉన్నారు. మరో వైపు దీపిక, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ఇతరులకు సమన్లు అందాయి.

వీరిలో ప్రముఖంగా అగ్రనటి దీపిక ఎన్‌సిబి విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నటి విచారణ క్రమంలో ఎన్‌సిబికి సరిగ్గా సహకరించలేదని, వారు వేసిన పలు ప్రశ్నలకు జవాబులు దాటేశారని, ఈ క్రమంలో వారి నుంచి పలు సార్లు హెచ్చరికలు అందుకున్నారని వెల్లడైంది. ఏజెన్సీ అంతర్గత వ్యక్తులు అందించిన సమాచారం మేరకు ఈ బాలీవుడ్ నటికి ఈ కేసు అనూహ్యమైన రియల్ షాక్ అయిందని వెల్లడైంది. ఆమె సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదని, అవసరం అయితే తిరిగి విచారణకు పిలుస్తామని ఎన్‌సిబి అధికారులు తొలుత తెలిపారు. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆమెకు తిరిగి సమన్లు ఏమీ జారీ చేయలేదని ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. అయితే దీపిక విచారణ క్రమంలో మరికొందరు మత్తుమందు విక్రేతల పేర్లు కూడా వచ్చినట్లు తెలిసింది. దీనితో ఈ హీరోయిన్‌కు డ్రగ్స్‌కేసు మరింత ఉచ్చుగా బిగుస్తోంది.
మా వద్ద డ్రామాలొద్దు
ఎన్‌సిబి ఎదుట ముందు చాలా సేపటివరకూ దీపిక విచారణ బాగానే సాగింది. అయితే ఆమె మేనేజర్ కర్మిషా ప్రకాశ్‌ను కూడా పిలిపించి విచారణ జరిపించడం, పలు ప్రశ్నలు సంధించిన దశలో దీపిక కంగుతిన్నారు. దీనితో ఆమె మూడు సందర్భాలలో కంటనీరు పెట్టుకున్నారు. అయితే ఇటువంటి భావోద్వేగాలు, సినిమా కార్డులకు దిగవద్దని, సరైన విధంగా జవాబులు ఇవ్వాలని ఆమెతో ఎన్‌సిబి అధికారులు ఘాటుగానే మాట్లాడినట్లు వెల్లడైంది. యాక్షన్‌లు వద్దు, ఎమోషన్లు పనికిరావు, కేవలం నిజాలు చెప్పండి చాలు, తమకు డైలాగ్‌లతో పనిలేదని పద్ధతి ప్రకారం జవాబులు చెపితే సరిపోతుందని దాదాపుగా అధికారులు ఆమెను గద్ధించినట్లు, ఈ దశలో ఆమె గద్గద స్వరంతో బదులివ్వాల్సి వచ్చిందని వెల్లడైంది. డ్రగ్స్ గురించి తాను మేనేజర్‌తో ఛాట్ చేసినట్లు దీపిక అంగీకరించారని అనధికారికంగా తెలిసింది. డిపి అడ్మిన్‌గా ఉండే ఓ వాట్సాప్ గ్రూప్ నుంచే మేనేజర్‌తో ఛాటింగ్ చేసినట్లు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. ఈ దశలో నటి మాల్, హాష్, వీడ్ వంటి కోడ్ పదాలను వాడారు. వీటిని ఆమె ఏ క్రమంలో వాడారనేది ఇప్పుడు కూపీ లాగుతున్నారు.
డ్రగ్స్ తీసుకోలేదు. సప్లై చేయలేదు
విచారణ క్రమంలో పలు ప్రశ్నలకు తరచూ దీపిక ఒక్కటే సమాధానాన్ని పదేపదే చెప్పినట్లు తెలిసింది. తాను మత్తుమందును తీసుకోలేదు, వాటిని ఏ రూపంలో అయినా ఇతరులకు సరఫరా చేయలేదు అని స్పష్టం చేసినట్లు వెల్లడైంది. దీపికను స్థానిక కొలాబాలో ఉన్న ఎవెలియన్ గెస్ట్‌హౌస్‌లో విచారించారు. ఇక్కడనే ఎన్‌సిబి దర్యాప్తు బృందం తమ ప్రత్యక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. బాలీవుడ్ తారలతో లింక్‌లున్న డ్రగ్స్ రాకెట్‌పై దర్యాప్తు జరుపుతోంది. రియా ఇచ్చిన సమాచారం ఇతరత్రా వెలుగులోకి వచ్చిన అంశాలతోనే పలువురికి ఎన్‌సిబి సమన్లు పంపించింది. మరికొందరు నటీనటులకు, చిత్రప్రముఖులకు కూడా విచారణాహ్వానాలు పంపిస్తారని వెల్లడైంది. దీనితో బాలీవుడే కాకుండా ఇతరత్రా భాషల సినిమా వారు కూడా ఉలికిపాట్లకు గురైనట్లు తెలిసింది. యావత్త్ చలనచిత్ర సీమలో డ్రగ్స్ ప్రకంపనలు దడ పుట్టించినా లేకపోయినా సినిమా రంగంతో మత్తు అనుబంధం ప్రజలను చివరికి విస్తుపోయే ప్రేక్షకులుగా మార్చింది. ఇటీవలే శ్రద్ధాకపూర్, సారాలను ఎన్‌సిబికే చెందిన బాలార్డ్ ఎస్టేట్ కార్యాలయంలో వేర్వేరుగా విచారించారు.

Deepika Padukone cries during NCB Interrogation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News