Home తాజా వార్తలు అందం అంటే కొలతలేనా?

అందం అంటే కొలతలేనా?

Laxmi Agarwal

 

లక్ష్మీ అగర్వాల్… ఢిల్లీలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి. సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఒక చిన్న ఉద్యోగం చేస్తూ, సంగీతం నేర్చుకుంటూ జీవితంపైన ఎన్నో ఆశలతో, కలలతో గడిపే మామూలు అమ్మాయి. ఇలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉంటారు. ఏదైనా ఆపద ఎదురొస్తే ఆ క్షణంలో వాళ్లు ఎలా స్పందిస్తారో అన్న దానిపైన వాళ్లెంత ధైర్యసాహసాలు కలవాళ్లో తేలిపోతుంది. లక్ష్మీనిస్సందేహంగా అద్భుతమైన అమ్మాయి. ఆమె బంధువు ఒకడు ఆమెకు రెట్టింపు వయసులో ఉన్నవాడు ప్రేమించాననీ, పెళ్లాడమని వెంటాడాడు. తిరస్కరిస్తే మొహాన యాసిడ్ పోశాడు. మొహం మొత్తం కాలిపోయి రూపురేఖలు చెదిరిపోయిన క్షణాన ఆమె కథ ముగిసిపోయింది అనుకున్నారు.

లక్ష్మీ అగర్వాల్ అలా ఏమీ అనుకోలేదు. సూర్యుడి వేడిమికి మాడి బూడిద అవుతూ మళ్లీ ఆ బూడిదలోంచి పునర్జన్మ ఎత్తే గ్రీక్ మైథాలజీలోని ఫినెక్స్ బర్డ్ లాగా తన దుఃఖంలోంచి నిలబడింది. సంవత్సరాల తరబడి సర్జరీలు జరిగి రూపం పోయిన మొహంతోనే మళ్లీ చదువుకుంది. యాసిడ్ ఎటాక్ (దాడి) ఉద్యమంలో భాగస్వామి అయింది. యాసిడ్ బాధితులకు పునరావాసం కల్పించింది. యాసిడ్ అమ్మకాలు నిషేధించాలని కోర్టులో పిల్ వేసింది. రాంప్‌వాక్ చేసింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది లక్ష్మీ అగర్వాల్.

“ బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం ప్రధానం అంటారు. కానీ వాస్తవంలో బాహ్యసౌందర్యం దాటి ముందుకు వెళ్లలేదు. ముఖ్యంగా యాసిడ్ బాధితుల విషయంలో. వాళ్లను ఎవ్వరూ భరించరు. వాళ్లు ఎవరికీ నచ్చరు. ఈ పరిస్థితిలో మార్పుతేవాలనుకున్నా. ముసుగుచాటున నా మారిపోయిన రూపాన్ని దాచి పెట్టాలనుకోలేదు. నా ముఖంపై యాసిడ్ పోశారు కానీ నా కలలపై కాదు కదా! అందం శరీరానికి సంబంధించింది కాదని బహుశా నిరూపించాను. నా విజయగాథ వెండితెరకు ఎక్కటం బహుశా నేను సాధించిన విజయం అంటోంది. ఆమె పాత్రలో దీపికాపదుకొనే నటించిన ఛపాక్ విడుదల అయింది. అందాల కథానాయక దీపిక ఈ యాసిడ్ బాధితురాలుగా నటించి సాహసం చేసింది. మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌లోనే దీపిక నటన, ఆహార్యంపై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఒక ఉన్మాది దాడితో ఒక అమ్మాయి జీవితం, మొహం, కలలు సర్వం ఎలా దగ్ధం అయ్యాయో సమాజం అలాంటి బాధితుల పట్ల స్పందించే తీరు అదంతా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌లో ఫస్ట్‌లుక్‌తో దీపికను భరించ లేకపోయారు ప్రేక్షకులు. ట్రోల్స్‌తో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. ఒక వైపు ప్రశంసలు, మరోవైపు నిరసనలతో ఒక మిశ్రమమైన అభిప్రాయం వచ్చింది. కానీ దీపిక చేసిన ఈ సాహసం సమాజం ముందు ఎన్నో ప్రశ్నలు నిలబెట్టాయి. అందం అంటే శరీర కొలతలేనా? మనిషి సౌందర్యం ఆమె ధైర్యం కాదా? ఆమె వ్యక్తిత్వం అందం కొలతల్లోకి రాదా? ఈ ప్రశ్నలకు దీపిక సమాధానం చెప్పినట్లే ఉంది. సౌందర్యం కొలతల మధ్యన ఇమిడిపోదు. తెలివి, సంస్కారం, సహృదయం, సమాజం పట్ల బాధ్యత, ఇతరుల పట్ల ప్రేమ, బాధ్యత ఇవన్నీ కలిపి ఒక అందమైన వ్యక్తి రూపం దిద్దుకోవాలి. హృదయం ఒక కష్టం గురించి ఆలోచించి కరిగిపోవాలి. ఎదుటి మనిషి కంటినీరు తుడవగలిగే సున్నితమైన మనసు పేరు సౌందర్యం!

చూసే విధానం మారాలి :
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా నటించిన సినిమా ఛపాక్. అయితే దీపికా, ఛపక్ టీం కలిసి యాసిడ్ దాడి బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందో మనకు చూపించేందుకు ప్రయోగం చేసింది. సూపర్ మార్కెట్, బట్టల షాపులు, ఫ్యాన్సీ షాపుల్లో రహస్యంగా కెమెరాలు ఉంచారు. అక్కడికి దీపిక, మరికొంత మంది యాసిడ్ దాడి బాధితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. దుకాణాల్లో వీరిని చూసి కొందరు చిరాకు, విసుగు తెచ్చుకున్నారు. అయితే ఈ అవమానాలను నేరుగా అనుభవించిన దీపికా.. సాటి మనుషులను చూసే విధానం మారాలి అంటూ తెలిపింది. బాధితుల పట్ల సమాజం అలా ప్రవర్తించడం చాలా తప్పు. వాళ్లపట్ల మరింత గౌరవంగా ప్రవర్తించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.