Saturday, April 20, 2024

నిర్మల్‌లో జింకపై పులి పంజా.. భయాందోళనలో ప్రజలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం పాంగ్రీ గ్రామ శివారులో పులిదాడి చేయడంతో ఓ జింక మృతి చెందింది. మృతి చెందిన జింకపై దాడి జరిగిన తీరు గమనించిన గ్రామస్తులు సదరు జింకను చిరుత పులి చంపిందన్న నిర్థారణకు రావడంతో పాటు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రజలు జింక మృతిపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతి చెందిన జింకను పరిశీలించారు. చుట్టు పక్కల అంతా గాలించారు. చిరుత పులి ఆనవాళ్లు కనిపించలేదు. దాంతో జింక మృతిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జింక మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. ఫోస్ట్ మార్టం అనంతరం జింకను చిరుత దాడి చేసి చంపిందా? మరేదైనా కారణం వల్ల ఇది జరిగిందా? అనే దానిపై స్పష్టతనిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా పాంగ్రీ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. కాగా, ఇంతకు ముందు కూడా పాంగ్రీ గ్రామ శివారులో చిరుత పులి సంచరించింది. గ్రామ శివారు ప్రాంతంలో జింకపై దాడి చేసి చంపేసింది. ఆ ఘటన మరువక ముందే మరోసారి జింక మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బందించాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులను వేడుకుంటున్నారు.

కాగా ఇటీవల కొమురం భీం జిల్లాలో పెద్దపులి బెజ్జూరు మండలం తలాయి సమీపంలో ఓ ఆవుపై దాడి చేసి చంపడంతో స్థానిక ప్రజలు ఇప్పటికీ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పెద్దపులి సంచారం నేపథ్యంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సంచరిస్తున్న పులులు ఇటీవల పలువురి ప్రాణాలను హరిస్తున్నాయి. జనాలు, మూగజీవులపై విరుచుకుపడుతున్నాయి. ఇటీవల జిల్లాలోని ఓ వాగు దగ్గర యువకుడిని, పత్తి చేనులో ఓ యువతి ప్రాణాలను పొట్టన బెట్టుకున్నాయి. అటవీ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లాలంటే రైతన్నలు జంకుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు పులి సంచరిస్తోందన్న భయంతో ఇళ్లలోంచి ప్రజలు ఎవరూ బయటికి రావడం లేదు. పులుల సంచారం వల్ల కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు. పులులు మూగజీవాల ప్రాణాలు తీస్తుండటంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు.

Deer killed by Leopard in Nirmal District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News