Home తాజా వార్తలు డిగ్రీ, పిజి పరీక్షలకు రెడీ

డిగ్రీ, పిజి పరీక్షలకు రెడీ

Degree, PG final semester exams in offline

 

యుజిసి తాజా మార్గదర్శకాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్న వర్సిటీలు
ఆఫ్‌లైన్‌లోనే చివరి సెమిస్టర్ పరీక్షలు
ప్రభుత్వంతో చర్చించి త్వరలో షెడ్యూల్ ఖరారు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ, పిజి కోర్సులతో పాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీలు సిధ్ధమవుతున్నాయి. చివరి సెమిస్టర్ పరీక్ష లు సెప్టెంబరు నెలాఖరులోగా నిర్వహించాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఈ దిశగా యోచిస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అ వసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు వర్సిటీలు సమాయత్తమవుతున్నాయి. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని యుజిసి వెసులుబాటు కల్పించినప్పటికీ ఆఫ్‌లైన్‌లో పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా విస్తృతి నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరుపుతున్నారు. డిగ్రీ, పిజి పరీక్షలపై ప్రభుత్వంతో చర్చించి త్వరలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పరీక్షలు నిర్వహించాల్సిందే : యుజిసి
సంప్రదాయ డిగ్రీ,పిజి కోర్సులతోపాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షలు యుజిసి కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశామని చెప్పారు. యూనివర్సిటీలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఓ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో యుజిసి కార్యదర్శి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

పరీక్షలపై యుజిసి విధివిధానాలు
దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ పరిధిలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసిన యుజిసి, తాజాగా పరీక్షల నిర్వహణలో అనుసరించాలని విధివిధానాలను జారీ చేసింది. పరీక్షల కేంద్రాలలో కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని యుజిసి స్పష్టం చేసింది. పరీక్షలకు సంబంధించిన విధులకు హాజరయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నుంచి వారి ఆరోగ్యానికి సంబంధించిన డిక్లరేషన్ తీసుకోవాలని తెలిపింది. థర్మల్ గన్ ద్వారా సిబ్బంది ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతనే వారిని విద్యాసంస్థల్లోకి అనుమతించాలని పేర్కొంది. వీటికి నిరాకరించిన సిబ్బందిని పరీక్షల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని పేర్కొంది.

పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతనే పరీక్షా కేంద్రాలలోకి అనుమతించాలని పేర్కొంది. పరీక్షా కేంద్రాలలో ప్రవేశ మార్గాలు, బయటకు వెళ్లే మార్గాల వద్ద రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. పరీక్షా కేంద్రాలలో గేట్ వద్ద, హాలులో సానిటైజర్లు, లిక్విడ్ హ్యాండ్‌వాష్ బాటిళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపింది. పరీక్షా హాలులో భౌతికదూరం పాటించేలా ఒక బెంచీకి,మరొక బెంచీకి మధ్యలో గ్యాప్ ఉండేలా విద్యార్థులను కేటాయించాలని యుజిసి పేర్కొంది. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది, విద్యార్థులు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారికి ప్రత్యేక గది కేటాయించాలని లేదా మరుసటి రోజు పరీక్షకు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించాలని పేర్కొంది.

విద్యార్థులు, సిబ్బందికి సరిపడా తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపింది. అలాగే విద్యాసంస్థల్లో టాయిలెట్లలో ఎలాంటి నీటి కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డస్ట్ బిన్‌లు కవర్లతో శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. పరీక్షా కేంద్రాలలో కరోనా జాగ్రత్తలు తెలిపే పోస్టర్లు అంటించాలని తెలిపింది. పరీక్షా కేంద్రాలలో లిఫ్ట్ బటన్‌లు,తలుపులు,కిటికీలు సానిటైజ్ చేయలని పేర్కొంది. పరీక్షల విధులు నిర్వహించిన సిబ్బంది ధరించిన మాస్కులు, గ్లౌజులు చెత్త బుట్టలో పడేయాలని, అలాగే సిబ్బందికి సంబంధించిన రికార్డును కంప్యూటర్లలో పొందుపరచాలని యుజిసి తెలిపింది.

Degree, PG final semester exams in offline