Friday, April 19, 2024

ప్రతిష్టంభన

- Advertisement -
- Advertisement -
Delay in handing over projects to Krishna Board
కృష్ణ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతలో జాప్యం
అప్పగింతకు అడ్డంకిగా ఉన్న సమస్యలపై నిపుణుల కమిటీని నియమించిన
తెలంగాణ నివేదిక వచ్చేంతవరకు వాటి యాజమాన్యాన్ని బోర్డుకు ఇచ్చే అవకాశాలు
శూన్యం తెలంగాణ నుంచి వెలువడని అప్పగింత జిఒ తెలంగాణ అప్పగించిన
తర్వాతనే తామూ ఇస్తామని మెలిక పెడుతూ ఎపి జిఒ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల పరిధిలో కృష్ణా నదిపైనున్న ప్రధాన ప్రాజెక్టులను బోర్డులకు అప్పగింతపై ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర జలవనరుల శాఖ గత జులైలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఉత్కంఠపరిస్థితుల నేపథ్యంలో గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ జీవోలు జారీ చేయాల్సిన రెండు తెలుగు రాష్ట్రాలు జీవోలను తర్జనభర్జనలు పడ్డాయి. చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోను ఇస్తూనే తెలంగాణ రాష్ట్రం కూడా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తర్వాతనే తమ ప్రాజెక్టులు కూడా బోర్డుకు అప్పగించినట్లుగా భావించాలని మెలికపెట్టింది. దీంతో జీవో ఇచ్చినట్టుగా ఉందిగానీ అవి ఏ మాత్ర అమలు నోచుకోని విధంగా ఇచ్చారు. అదే సమయంలో గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా కెఆర్‌ఎం బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖలో తాము ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి అడ్డంకిగా ఉన్న సమసయలను పరిష్కరించుకోవడానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదిక వచ్చేంత వరకూ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపైన ఆధారపడటంతో ఏపీ ఇచ్చిన జీవో కూడా అమలు కాకుండా పోయింది. మొత్తంగా చూస్తే బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించలేనట్టేనని కొందరు బోర్డు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే గేజిట్‌లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలే లక్షంగా ఆచి తూచి అడుగులు వేస్తోంది. కృష్ణానదీ యాజమాన్యబోర్డు ప్రత్యేక సమావేశంలో చర్చించి ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో కొన్నింటిని బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న అభిప్రాయలు పలు వైపులనుంచి వస్తున్న నేపధ్యంలో ఈ అంశంపై ప్రభుత్వం కూడా తొందర పాటు పనికి రాదన్న అభిప్రాయానికి వచ్చింది. జలవనరుల రంగం నిపుణులు ,న్యాయ కోవిదులుతో ప్రభుత్వం సమాలోచనలు చేసింది. తెలంగాణ రా్రష్ట్ర భౌగోళిక పరిస్థితులు, ఈ ప్రాంతంలో నీటి వనరుల ఆవశ్యకత, అంతకు మించి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందజేత తదితర అంశాల్లో నిపుణుల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంది.

కృష్ణానదీ యాజమాన్య బోర్డు పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ముందుగా వాటిపై సమగ్ర అధ్యయనం చేయించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేంద్రం జారీ చేసి గెజిట్ నోటిఫికేషన్ అములు సహా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో ఈ కమిటీని నియమించిది. జూరాల, శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, కేంద్ర జల వనరుల సంఘం సూచించిన ఆపరేషన్ ప్రోటోకాల్స్ తదితర అంశాలపై ఉపసఘం దృష్టి పెట్టనుంది. ఈ కమిటీలో చీఫ్ ఇంజనీర్లు మోహన్ కుమార్, శ్రీకాంతరావు, నీటిపారుదల రంగం నిపుణులు ఎం.ఎ రవూఫ్, ఘనశ్యాఝా, కన్సెల్టెంట్ చేతన్ పండిట్, సీనియర్ న్యాయవాది రవీందర్ రావులను సభ్యులుగా నియమించారు.

15రోజుల్లో నివేదిక

గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు , ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్స్‌ను నిపుణుల కమిటి అధ్యయనం చేయాల్సివుంది. కృష్ణానదిలో నీటి వాటాలను తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ ్రబ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్న అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాలు , ప్రాధాన్యతలు ,నీటి అవసరాలకు ప్రాముఖ్యతనిచ్చేలా తగిని సిఫార్సులు చేసేబాధ్యతను ప్రభుత్వ కమిటీకి అప్పగించింది. ఈ కమిటి అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి 15రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

నివేదిక వచ్చాకే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

కృష్ణాపరివాహకంగా ఉన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. కృష్ణానదీయాజమాన్య బోర్డు కోరిన ప్రాజెక్టుల అప్పగింతకు ముందు వాటి అధ్యయనానికి నియమించిన కమిటి నివేదిక వచ్చాకే తుదినిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర అవసరాలు ప్రధానంగా విద్యుత్‌పైనే అధారపడి ఉండటంతో కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డుకు అప్పగిస్తే తదనంతర పరిణామాలు ఏమిటన్న సందేహాలే ప్రభుత్వాన్ని తర్జన భర్జనకు గురిచేస్తున్నాయి. మననీళ్లు, మన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మన ప్రాజెక్టులు బోర్డు చేతికి అప్పగించి పైగా వాటి నిర్వహణకు కూడా విత్తన నిధికింద రూ. 200కోట్లు అందచేస్తే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట నీటి అవసరాలు, విద్యుత్ అవసరాలకు బోర్డుల వద్ద సాగిలపడే పరిస్థితే వస్తే ప్రజలు,ప్రతిపక్షపార్టీల ముందు ఎవిధంగా సమర్ధించుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల ముందు సమస్యగా మారింది. ప్రాజెక్టుల అప్పగింతపై తొందరపడటకం కంటే సావధానంగా అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయిచి మంచి చెడులు బేరీజు వేసుకున్నాకే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ లక్షగా చేసుకుని గెజిట్ అమలుపై ఒక నిర్ణయానికి రావాలన్న అభిప్రాయంతో వుంది.

నాలుక మడతేసిన ఎపి

కృష్ణానది పరివాహకంగా తమ రాష్ట్ర పరిదిలోని అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో పేర్కొన్న విధంగా బేషరతుగా బోర్డుకు అప్పగిస్తామని బోర్డు ప్రత్యేక సమావేశంలోనూ, అతర్వాత మీడియా ముందు డాంబికాలకు పోయిన ఎపి తీరా గెజిట్ అమలు సమయం వచ్చే సరికి నాలుక మడతేసింది. ప్రాజెక్టుల అప్పగింతలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చూశాక ఎపి దూకుడు తగ్గించి ఇదివరకటి నిర్ణయాన్ని మార్చుకొంది. ప్రాజెక్టుల అప్పగింతపై జివో జారీ చేసినట్టుగానే చెసి అశ్వద్దామ హతః కుంజరహ అన్నరీతిలో షరతుల మెలిక పెట్టింది.బోర్డు సమావేశంలో తీర్మానం మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులు అప్పగిస్తేనే తాము విడుదల చేసిన జీవోను అమల్లోకి తీసుకోవాలని గురువారం నాడు షరతులతో కూడిన జీవో జారి చేసింది. జూరాల ప్రాజెక్టును కూడా బోర్డు స్వాధీనం చేసుకోవాలని లేదంటే శ్రీశైలం ప్రాక్టుకు వచ్చే నీటి ప్రవాహంలో తెలంగాణ రాష్ట్రం నుంచి సమస్యలు వస్తాయని పేర్కొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ కుడి ,ఎడమ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రధాన నీటి విడుదల కేంద్రాలు, ప్రాజెక్టులు, రెగ్యులేటర్లు, ప్రధాన కాలువలు, పంప్‌హౌస్‌లు ఇతర కట్టడాలు ,మోటార్లు, కార్యాలయాలు, వాహనాలు ,సిబ్బంది, డిపిఆర్‌లు, ఇతరఫైళ్లు అన్నింటినీ స్వాధీనంలోకి తీసుకోవాలని సూచిస్తూ ఎపి నీటిపారుదశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు జివోలో పేర్కొన్నారు.

నిస్తేజంగా మారిన బోర్డు

నిన్నటి దాక ఎంతో గాంభీర్యాన్ని ప్రదర్శించిన కృష్ణానదీయాజమాన్య బోర్డు ్రప్రాజెక్టుల అప్పగింతలో ఏర్పడిన ప్రతిష్టంభన చూసి నిస్తేజంగా మారిపోయాయి. కేంద్రం విడుదల చేసిన గెటిట్ నోటిఫికేషన్ అమలుకోసం గత జులై నుంచి తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారులతో భేటిల మీద భేటిలు కసరత్తుల మీడ కసరత్తులు చేసింది. అవి చాలవన్నటు ఉపసంఘాల ద్వారా హడావుడి చేసింది. ప్రత్యేక సమావేశాల పేరుతో కృష్ణానదీయామాన్య బోర్డు ప్రాజెక్టుల అప్పగింతపై చేసిన హాడావుడి రాష్ట్ర అధికార యంత్రాంగంపై వత్తిడి చేసిన తీరు అంతా ఇంతాకాదు. గురువారం గెజిట్ అమలుకు సమయం రావటంతో రెండు రాష్ట్రాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత జీవోలకోసం బోర్డు ఛైర్మన్ ఉదయం నుంచి సాయంత్రం దాక ఎదురు చూశారు. సాయంత్రం వరకూ ఏవిధమైన స్పందన కనిపించకపోవటంతో బోర్డు యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. సాయంత్రం ఎపి నుంచి షరతులతో విడుదలైన జీవో బోర్డు యంత్రాగాన్ని ఉస్సూరు మనిపించింది. గెటిజ్ అమలుపై బోర్డు స్పందన కోసం ప్రయత్నించిన మీడియా ముందు బోర్డు ఛైర్మన్ మహేంద్రప్రతాప్ సింగ్ ముఖం చాటేయాల్సిన పరిస్థితి పుట్టుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News