Home జాతీయ వార్తలు మళ్లీ కొట్టను.. తిట్టనంటేనే వస్తా!

మళ్లీ కొట్టను.. తిట్టనంటేనే వస్తా!

CREZY

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాసి సమావేశంలో పాల్గొన్న సిఎస్

న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) అన్హు ప్రకాశ్ మంగళవారం నాడు మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. సిఎస్‌పై ఆప్ ఎంఎల్‌ఎల దాడి ఘటన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అధికారులతో సమావేశం కావడం ఇదే మొదటిసారి. వచ్చే నెలాఖరులోగా ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం సిఎంతో ఆయన మరోసారి మంగళవారం సమావేశం కావాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలపై చర్చించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ముందు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. తనపై భౌతికంగా దాడి చేయబోమని, దుర్భాషలాడబోమని హామీ ఇస్తేనే సమావేశానికి హాజరవుతానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశ తేదీలను ఖరారు చేయడానికి, ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగేందుకు గాను బడ్జెట్‌ను ఆమోదింపజేయడానికి, ఈ భేటీ నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో సిఎస్ పేర్కొన్నారు. ఈ లేఖలో ’ఢిల్లీ ఉద్యోగులు కష్టపడిపనిచేస్తున్నారు.ప్రభుత్వపాలన సజావుగా సాగాలని కోరుకుంటున్నారు.బడ్జెట్ సమావేశాలతోనే అది సాధ్యం.అందుకే దానికి సంబంధించిన తేదీలు ఫైనల్ చేయడానికి నేను, మా ఇతర అధికారులు సమావేశానికి వస్తున్నాం.అయితే మాపై ఎలాంటి దాడి జరగదని సిఎం హామీ ఇస్తే నే వస్తాం’అంటూ ఆయన పేర్కొనడం గమనార్హం.

ఎంఎల్‌ఎకు నో బెయిల్ : కాగా, సిఎస్‌పై దాడి కేసులో అరెస్టయిన ఆప్ ఎంఎల్‌ఎ ప్రకాశ్ జర్వాల్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సిఎస్‌పై దాడి ఘటన నేపథ్యంలో ఐఎఎస్, డానిక్స్, డాస్ కేడర్ అధికారులంతా మంత్రులతో రాతపూర్వకంగానే సమాచార కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే, బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే మంత్రివర్గ సమావేశానికి ప్రజాప్రయోజనాల రీత్యా హాజరు కావాలని ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యవేదిక సమావేశంలో తీర్మానించుకున్నారు. సిఎం,డిప్యూటీ సిఎంలు రాతపూర్వకంగా క్షమాపణ చెప్పేంత వరకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సమయంలో ఐదు నిమిషాల పాటు మౌనం పాటించాలని, మంత్రులతో సమాచారానికి లేదా ఇతరత్రా ఏ కార్యకలాపాలైనా కూడా రాతపూర్వకంగానే కొనసాగించాలని ఐక్యవేదిక నిర్ణయించింది.