Home తాజా వార్తలు ‘మాకు న్యాయం చేయాలి’… ఢిల్లీ పోలీసుల నిరసన

‘మాకు న్యాయం చేయాలి’… ఢిల్లీ పోలీసుల నిరసన

 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ బయట ధర్నా చేస్తున్న పోలీసులకు పైఅధికారులు భరోసా ఇవ్వడంతో నిరసనలు విరమించారు. ఢిల్లీలో పోలీసులకు, లాయర్లకు మధ్య తలెత్తిన ఘర్షణ నేపథ్యంలో మంగళవారం వేలాది మంది పోలీసులు… పోలీసు ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ‘మాకు న్యాయం చేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శనివారం తీస్ హజారీ కోర్టు, సోమవారం సాకేత్ కోర్టులో జరిగిన ఘర్షణకు కారణమైన లాయర్లపై చర్యలు తీసుకోని కారణంగానే ఈ నిరసన ప్రదర్శనకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఘర్షణకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ఆధారంగా తప్పెవరిదో తేల్చి చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేశారు. వీరికి ఐపిఎస్ పోలీసు అసోసియేషన్ బాసటగా నిలిచింది.ఈ గొడవల్లో గాయపడిన సిబ్బందికి దేశవ్యాప్తంగా పోలీసులు అండగా నిలుస్తారని వారు హామీ ఇచ్చారు.

మరోవైపు శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే ఆందోళన చేయడం సరికాదని, వెంటనే ఆందోళనను విరమించి విధుల్లోకి రావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చేస్తున్న పోలీసులను కోరారు. అయినప్పటికీ వారు అధికారుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్, స్పెషల్ కమిషనర్ సతీష్ గోల్చాలు నచ్చజెప్పి భరోసా ఇవ్వడంతో నిరసనను విరమించారు.  గత 11 గంటలుగా ఢిల్లీలో ధర్నా చేసిన పోలీసులు తమ పోరాటాన్ని ముగించి విధుల్లో చేరడానికి అంగీకరించారు.. విజ్ఞప్తి చేశారు.

కాగా, తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో పార్కింగ్ విషయమై శనివారం కొంతమంది లాయర్లకు, పోలీసులకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారని కొంతమంది లాయర్లు ఆరోపించారు. ఈ ఘర్షణల్లో దాదాపు 20 మంది పోలీసులు, పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. అటు పోలీసు విభాగానికి చెందిన పలు వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. లాయర్ల దాడిపై మంగళవారం పోలీసుల నిరసనకు దిగడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా మెస్సేజిలు పెట్టాల్సి వచ్చింది.

delhi cops call off Protest against Lawyers