Saturday, April 20, 2024

సంపాదించుకోగలవు సాయం ఎందుకమ్మా.. భార్య పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భర్త నుంచి తాత్కాలిక ఆర్థిక సాయం కావాలనే ఓ మహిళ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఈ మహిళ విద్యాధికురాలు, సంపాదించుకునేందుకు అర్హురాలిగా ఉందని, ఈ క్రమంలో భర్త నుంచి ఆమె ఆర్థిక సాయం కోరడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కొన్ని కారణాలతో ఆమె భర్తకు దూరంగా ఉంటోంది, గృహ హింస నిరోధక చట్టం పరిధిలో ఆమె భర్తపై కేసు పెట్టింది. తనకు ఆర్థికంగా సాయం అందించేలా ఆదేశించాలని ఆమె కోరడంపై సానుకూలమైన విధంగా స్పందిస్తే అది ఆమెలో సోమరితనాన్ని, భర్తకు దూరంగా ఉంటూనే భర్తపై ఆధారపడే తత్వాన్ని పెంచుతుందని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ స్వయం సిద్ధ త్రిపాఠీ తెలిపారు. తనకు భర్త నుంచి నెలకు రూ 50000 భత్యం వచ్చేలా చూడాలని ఆమె కోరింది.

చట్ట ప్రకారం ఇది తనకు రావల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఆమె తన విద్యార్హతతో సంపాదించుకునే స్థితిలో ఉందని, భర్త అర్హుడైన డాక్టరు అయినప్పటికీ ఇప్పుడు నిరుద్యోగిగా ఉన్నారని, భార్య చెపుతున్నట్లు విలాసవంతమైన జీవితం ఏదీ గడపడం లేదని కోర్టు పేర్కొంది. పైగా భర్త నుంచి ఆర్థిక సాయం డిమాండ్ చేసే దశలో ఆమె తన దైనందిన జీవన మనుగడ కష్టసాధ్యం అని నిరూపించుకోవల్సి ఉంటుందని లేకపోతే ఆమెకు సాయం చేయాల్సిన బాధ్యత సంపాదన సరిగ్గా లేని భర్తకు లేదని, ఇది అసాధ్యమే అవుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆమె తాను ఏ ఉద్యోగం చేయకుండా వేరుగా ఉంటూ భర్త నుంచి భరణం కోరుకోవడం కుదరదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News