Home ఎడిటోరియల్ కాలుష్యం కోరల్లో ఢిల్లీ

కాలుష్యం కోరల్లో ఢిల్లీ

sampadakeyam

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం అపరిమితంగా, దుర్భరంగా పెరిగిపోయి పాఠశాలలకు సెలవులు ప్రకటించక తప్పనిస్థాయికి పేట్రేగిపోవడం ప్రమాదకర పరిణామం. మామూలుగానే వాయు కాలుష్యానికి ఢిల్లీ పెట్టింది పేరు. అది ఎప్పటికీ అదుపులోకి రాకపోగా మరింతగా విజృంభించి ప్రజారోగ్యానికి దైనందిన జనజీవనానికి హానికరంగా, అవరోధంగా తయారవుతున్నది. ఢిల్లీని, ఆ పరిసర ప్రాంతాలను వాసయోగ్యం కాని విధంగా మార్చివేస్తున్నది.
తాజాగా ఢిల్లీని ముంచెత్తిన పొగమంచు 1999 తరువాత ఇప్పటివరకు కనీవినీ ఎరుగనిది. అత్యంత అథమస్థాయి కాలుష్యాన్ని సృష్టిస్తున్నది. ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాన్ని, చూపు నష్టాన్ని కలిగిస్తున్నది. వాహనాలు ఢీ కొనే దుస్థితిని దాపురింపచేస్తున్నది. శీతల వాతావరణానికి కాలుష్య కారక పదార్థాలు కలిసి బరువెక్కిన గాలి తోడై విపత్తు ముంచుకొస్తున్నది.
ఢిల్లీలో ఈ కాలుష్యాన్ని తగ్గించడానికే సుప్రీంకోర్టు ఈ ఏడాదికూడా దీపావళి దినాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధించింది. అయినా అమలుకు నోచుకోలేదు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చొరవతో వాహనాలను రెండు బృందాలుగా విభజించి ప్రత్యామ్నాయ దినాల్లో నడిపే పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇన్ని చేసినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ కాలుష్యాన్ని యూదుల ఊచకోతకు హిట్లర్ ప్రయోగించిన విషవాయు కొట్టాలతో పోల్చడంలో బొత్తిగా అనౌచిత్యం, అసామంజస్యం కానరావడం లేదు.
నిన్న నవంబర్ 9 బుధవారంనాడు దేశ రాజధానిలో రికార్డైన వాయుకాలుష్యం లోని ప్రమాదకరస్థాయి ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత వాతావరణ నగరంగా ప్రసిద్ధికెక్కిన బీజింగ్‌లో ఇదేరోజు నమోదైన దానికంటే పదిరెట్లు ఎక్కువ. ఈ గాలిని పీల్చడంవల్ల రోజుకు 5౦సిగరెట్లు కాల్చితే కలిగే హాని దాపురిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల ధూమం, గృహాది నిర్మాణాల దుమ్ము, ధూళి,తగలబెట్టడం వల్ల ఎగసే పొగ కలిసి కాలుష్యం దట్టమవుతుంది. దీంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఛాతీ సమస్యలు తలెత్తుతాయి. ఆస్తమా తదితర ఉబ్బస వ్యాధులు ప్రబలుతాయి. నేత్ర రోగాలూ కలుగుతాయి. ఇది అంతిమంగా అకాల మరణాలకు దారితీసే ప్రమాదం సంభవిస్తుంది. మనుషులకే కాదు, మొక్కలకు, పంటలకు సైతం హాని కలిగిస్తుంది. వాటి పెరుగుదలను హరిస్తుంది. కాలుష్యానికి భయపడి ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండవలసి వస్తుంది. పర్యవసానంగా వారి పనిపాట్లు దెబ్బతింటాయి. తరచూ ఆరుబయట ఉండడానికి ఇష్టపడే పిల్లల ఆరోగ్యాన్ని బలిపీఠం మీద ఉంచిన వారమవుతాము.
ఢిల్లీ దాని పరిసరాలు వాయుకాలుష్య విషనిలయాలు కావడానికి పంజాబ్, హర్యానాలలో వరి కోతలు ముగిసిపోయింతర్వాత మిగిలిపోయే దుబ్బులను, గడ్డిని తగులబెట్టడంవల్ల ఉత్పన్నమయ్యే పొగ ప్రధాన కారణమని నిర్ధారించారు. పూర్వం పంటకోతను మనుషులే చేసేవారు. దాంతో వచ్చే ఎండుగడ్డి వచ్చి పశువులకు ఆహారంగా ఉపయోగపడేది. ఇప్పుడు కోత యంత్రాలు రావడంతో ఎందుకూ పనికిరాని వ్యర్థం పోగులు పడుతోంది. దానిని తగులబెట్టడంవల్ల పొగ దట్టంగా వాతావరణంలో కలుస్తున్నది. ఈ వ్యర్థాలను సురక్షిత మార్గాలలో వదిలించుకోవడం రైతులకు అలవికాని పని. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక నానా యాతనలు పడి అప్పటికీ బతకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు పంట వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో వదిలించుకోవడానికి తగినంత వెచ్చించగలిగే స్థితిలో లేరు. అందుచేత ప్రభుత్వాలే ఈ బాధ్యతను వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన సూచన ఆచరించదగినది. అభివృద్ధి చెందడమంటే అపూర్వమైన ప్రమాదాలను కొనితెచ్చుకోవడం కాకూడదు. గతంలోని మేలును కోల్పోవడం, కొత్తకీడులను సృష్టించుకోవడం మానవ అవివేకానికి నిదర్శనాలవుతాయి. వ్యవసాయం యాంత్రీకరణ వల్ల శారీరక శ్రమమీద ఆధారపడే సాగు కార్మికులు ఉపాధిని కోల్పోవడమే కాకుం డా ఇటువంటి కాలుష్య ప్రళయాలు కూడా విజృంభిస్తున్న చేదు వాస్తవాన్ని గమనించి తగు నివారణోపాయాలను ఆశ్రయించాలి. ఢిల్లీ వంటి మహానగరాలను వాసయోగ్యంగా చేసుకోవాలి.