న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కంటోన్మెంట్ జోన్ల బయట స్కూళ్లలో ఈనెల 18 నుంచి 10,12 తరగతులను ప్రారంభించడానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. సిబిఎస్ఇ బోర్డు ఎగ్జామినేషన్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. మే 4 నుంచి జూన్ 10 వరకు బోర్డు ఎగ్జామినేషన్స్ జరుగుతాయని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే సిబిఎస్ఇ ఇంకా పరీక్షల తేదీలను ప్రకటించ వలసి ఉంది.
విద్యార్థులు ప్రత్యక్షంగా స్కూళ్లకు హాజరు కావాలన్నది తప్పనిసరి కాదని, తల్లిదండ్రుల అంగీకారంతో మాత్రమే హాజరు కావాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పదో తరగతి సిబిఎస్ఇ బోర్డు పరీక్షలకు ఢిల్లీ రీజియన్ నుంచి దాదాపు 3 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకోగా, 12 వ తరగతి పరీక్షలకు 2.5 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 12 వ తరగతికి మార్చి 20 నుంచి ఏప్రిల్ 15 వరకు, 10 వ తరగతికి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ప్రీ బోర్డు ఎగ్జామ్స్ స్కూళ్లు నిర్వహిస్తాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.