Saturday, April 20, 2024

ఎదురులేని రిషబ్ సేన

- Advertisement -
- Advertisement -

Delhi's solid win over Rajasthan

ఆదుకున్న అయ్యర్, హెట్‌మెయిర్, రాణించిన బౌలర్లు, రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయం

అబుదాబి: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయం అందుకుంది. శనివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది 8వ విజయం. ఈ గెలుపుతో ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 121 పరుగులు చేసి ఘోర పరాజయం పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఢిల్లీ బౌలర్లు సఫలమయ్యారు. పిచ్ బౌలర్లకు సహకరించడంతో రాజస్థాన్ స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పోయింది. బ్యాటింగ్‌లో రాణించిన శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆరంభంలోనే..

లక్షఛేదనకు దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు లియామ్ లివింగ్‌స్టోన్, యశస్వి జైస్వాల్ జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. లివింగ్ స్టోన్ ఒక పరుగు మాత్రమే చేసి అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాతి బంతికే మరో ఓపెనర్ జైస్వాల్ కూడా వెనుదిరిగాడు. ఐదు పరుగులు చేసిన అతన్ని నోర్జే వెనక్కి పంపాడు. దీంతో రాజస్థాన్ ఆరు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

సంజు ఒంటరి పోరాటం

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ సంజు శాంసన్ తనపై వేసుకున్నాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన డేవిడ్ మిల్లర్ కూడా నిరాశ పరిచాడు. ఏడు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన మహిపాల్‌తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే ఒక సిక్స్‌తో 19 పరుగులు చేసి మహిపాల్‌ను రబడా వెన్కి పంపాడు.

తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ శాంసన్ ఒంటరి పోరాటం చేశాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 53 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతావారు విఫలం కావడంతో రాజస్థాన్ స్కోరు 121 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చిన రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, రబడా, అవేశ్ ఖాన్, అక్షర్ తదితరులు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

తడబడ్డారు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి కూడా ఆశించిన రీతిలో శుభారంభం దక్కలేదు. రాజస్థాన్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. శిఖర్ ధావన్ 8 పరుగులు మాత్రమే చేసి కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ పృథ్వీ షా (10) కూడా ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 21 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సమన్వయంతో ఆడిన కెప్టెన్ పంత్ రెండు ఫోర్లతో 24 పరుగులు చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ వెంటనే అయ్యర్ కూడా ఔటయ్యాడు. 32 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 43 పరుగులు చేసి రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపు హెట్‌మెయిర్ దూకుడును ప్రదర్శించాడు. 16 బంతుల్లోనే ఐదు ఫోర్లతో 28 పరుగులు చేశాడు. లలిత్ యాదవ్ 14 (నాటౌట్), అక్షర్ పటేల్ (12) కాస్త రాణించడంతో ఢిల్లీ స్కోరు 154 పరుగులకు చేరింది. రాజస్థాన్ బౌలర్లలో ముస్తఫిజుర్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News