Home తాజా వార్తలు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

Demand for actions on the contractor

 విద్యార్థులకు పొంచివున్న ప్రమాదం

బురదమయంగా దుగినవెల్లి బడిబాట
మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రుల వేడుకోలు
కాంట్రాక్టర్‌పై చర్యలకు డిమాండ్

మన తెలంగాణ/కట్టంగూర్ : మండల పరిధిలోని దుగినవెల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లే బడిబాట కాంట్రాక్టర్ నిర్లక్షం, అధికారుల బాద్యతారాహిత్యం వలన నిత్యం విద్యార్ధులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 20 రోజుల క్రితం దుగినవెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో సదరు కాంట్రాక్టర్ మిషన్ భగీరధ ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం లోతైన గోతి తవ్వి, తీసిన మట్టిని బడిలోపలి భాగంలో దారికి అడ్డంగా కుప్పలుగా పోసారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాఠశాలకు వెళ్లడానికి పడరాని పాట్లు పడుతూ, సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనేకసార్లు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో డోజర్ సహాయంతో కొంతమట్టిని పక్కకు తొలగించారు. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా కురుస్తున్న చిరుజల్లులు, భారీ వర్షానికి పాఠశాల ప్రధాన గేటునుండి లోపలికి వెళ్లే దారిలోకి పక్కను ఉన్న మట్టి దిబ్బల నుండి ఒండ్రు కిందకి జారింది. ఒండ్రు మట్టిలోకి వరదనీరు వచ్చి, చేరడంతో బురద కుంటను తలపిస్తుంది. ఈ క్రమంలో గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది పలుమార్లు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, నిర్లక్షం సమాధానం చెబుతూ,  మొరం పోయించకుండా రేపు మాపు అని, కాలయాపన చేస్తుండడంతో ఇటు విద్యార్ధులు, అటు ఉపాధ్యాయులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అసలే వర్షాకాలం, వర్షాలు కురుస్తుండడంతో ఏక్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్ధులు పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా పాఠశాలకు సైకిల్‌పై వచ్చే విద్యార్ధులు, బైక్‌లపై వచ్చే ఉపాధ్యాయులు గేటువద్ద బురదగుంట ఉండడంతో పాఠశాల గేటుబయటే వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలో నిత్యం 168 మంది విద్యార్ధులు, 11 మంది పాఠశాల సిబ్బంది, ముగ్గురు వంట ఏజెన్సీ మహిళలు ఈ బురద మార్గం గుండా నడవడం వలన వారికి ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, కాంట్రాక్టర్‌పై తగు చర్యలు తీసుకొని, మరమ్మత్తులు చేపట్టాలని పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు కోరుతున్నారు.