Home ఆఫ్ బీట్ ప్రాణం నిలిపే పాడి

ప్రాణం నిలిపే పాడి

lf

రైతు ఆత్మహత్యలకు బర్రెల పంపిణీతో చరమ గీతం !

తెలంగాణలో రైతు ఆత్మహత్య కుటుంబాలను కలిసినప్పుడు పంటలు నష్టపోయినప్పుడు వారికి అప్పుల వారినుండి వచ్చే వత్తిడే కాక రోజూ గడవటం కూడా కష్టమవుతున్నదని చెప్పారు. వారి కుటుంబాలకు ఉన్న ఇతర ఆదాయ వనరులను పరిశీలిస్తే కనీసం ఒక బర్రె కాని గొర్రె కాని ఉన్న పరిస్థితి ఉండదు.ఆ సమయంలో ఈ కుటుంబానికి ఒక పశువు  ఉండి ఉంటే ఆత్మహత్య జరగకపోయేదేమో అని చాలా సార్లు అనిపిస్తుంటుంది. పశువులు ఆ కుటుంబానికి ఆదాయ వనరుగా ఉండటమే కాకుండా  రసాయనిక ఎరువుల కారణంగా పెరిగిపోతున్న పంటల ఉత్పత్తి ఖర్చును వాటితో కూడా తగ్గించవచ్చు. దేశ వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ పెరుగుతున్న ప్రస్తుత క్రమంలో పాడి పరిశ్రమ  పెంచవలసిన  అవసరం ఉంది. కాని పాడి పశువులు పెంచుకోవటానికి చిన్న,సన్న కారు రైతులకు,కౌలు రైతులకు ఉన్న అవరోధం ఇంటి దగ్గర స్థలం లేక పోవటమే. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి స్థలం  కేటాయించినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తే మంచిది. 

రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు జిల్లాలో మిగిలిన ప్రాంతాలతో పోల్చితే చాలా తక్కువ సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు నమోదు అవుతాయి. వర్షపాతం, పంటల సరళి,జీవన విధానం దాదాపు ఒకే విధంగా వుండికూడా ఎందుకు ఈ జిల్లాలో రైతు ఆత్మహత్యలు తక్కువగా జరుగుతున్నాయి అని పరిశీలిస్తే మనకు తెలిసిన బలమైన కారణం పాడి పశువులు. అలాగే రాష్ట్రాల విషయానికి వస్తే అతితక్కువ వర్షపాతం ఉన్న ఎడారి రాష్ట్రము రాజస్థాన్ జాతీయ నేర గణాంకాల విభాగం(NCRB) 2016 లెక్కల ప్రకారం అతితక్కువ రైతు ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రాలలో ఒకటి. సంవత్సర కాలంలో రైతులు,రైతు కూలీలు కలిపి 43 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2014 లో రాజస్థాన్ లో జరిగిన 373 రైతు,రైతు కూలీల ఆత్మహత్యలతో పోల్చితే 90% రైతు,రైతు కూలీల ఆత్మహత్యల్ని తగ్గించగలిగారు.దేశంలోని పెద్ద రాష్ట్రాలలో 2016 లో తక్కువ రైతు ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రము రాజస్థానే.ఇదే సమయంలో రాజస్థాన్ ఆ రెండు సంవత్సరాలలో పాల ఉత్పత్తిని 40% పెంచుకుని దేశంలోనే రెండవ స్థానానికి చేరుకుంది . అయితే రైతు ఆత్మహత్యలు తగ్గి పోవటానికి ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు కాని ఇది ఒక బలమైన కారణం అని మాత్రం చెప్పవచ్చు. తెలంగాణలో రైతు ఆత్మహత్య కుటుంబాలను కలిసినప్పుడు పంటలో నష్టపోయినప్పుడు వారికి అప్పుల వారినుండి వచ్చే వత్తిడే కాక రోజూ గడవటం కూడా కష్టమవుతున్నదని చెప్పారు. వారి కుటుంబాలకు ఉన్న ఇతర ఆదాయ వనరులను పరిశీలిస్తే కనీసం ఒక బర్రె కాని గొర్రె కాని ఉన్న పరిస్థితి ఉండదు.ఆ సమయంలో ఈ కుటుంబానికి ఒక పశువు ఉండి ఉంటే ఆత్మహత్య జరగకపోయేదేమో అని చాలా సార్లు అనిపిస్తుంటుంది. పశువులు ఆ కుటుంబానికి ఆదాయ వనరుగా ఉండటమే కాకుండా రసాయనిక ఎరువుల కారణంగా పెరిగిపోతున్న పంటల ఉత్పత్తి ఖర్చును వాటితో కూడా తగ్గించవచ్చు. దేశ వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ పెరుగుతున్న ప్రస్తుత క్రమంలో పాడి పరిశ్రమ పెంచవలసిన అవసరం ఉంది. కాని పాడి పశువులు పెంచుకోవటానికి చిన్న,సన్న కారు రైతులకు,కౌలు రైతులకు ఉన్న అవరోధం ఇంటి దగ్గర స్థలం లేక పోవటమే. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయించినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తే మంచిది.
పాల ఉత్పత్తి విషయానికి వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు(NDDB) 2016-17 లెక్కల ప్రకారం 4681 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ దేశంలో 13 స్థానంలో ఉంది. రాష్ట్రంలో తలసరి పాల వినియోగం మరీ దారుణంగా ఉంది. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలలో సగటు వినియోగం 1 లీటర్ పైనే ఉంటే మన రాష్ట్రంలో మాత్రం పాల లభ్యత బాగా ఉన్న కరీంనగర్ లాంటి జిల్లాలలో కూడా 262 గ్రాములు మించటంలేదు.మనం ఇప్పటికిప్పుడు పాల ఉత్పత్తిలో హర్యానా,పంజాబ్ రాష్ట్రాలతో పోటిపడక పడకపోయినా పరవాలేదు కాని దిగుమతి చేసుకోకుంటే చాలు.పైగా దేశంలో పాలు , పాల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే అవకాశం లేదు. దేశంలో 2022 నాటికి 220 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల అవసరం ఉంటుందని అంచనా కాగా ప్రస్తుతం మన దేశ పాడి ఉత్పత్తి 2016-17 నాటికి 165 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే.అంటే దేశ అవసరాల రీత్యా కూడా ఈ నాలుగేళ్లలో పాల ఉత్పత్తిని మరో 25% పెంచవలసిన అవసరం ఉంది. తెలంగాణలో రోజుకు కోటి లీటర్ల పాలు అవసరం కాగా, ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. దీంతో పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రాలతోపాటు గుజరాత్ నుంచి కూడా రోజూ పాలు తెప్పిస్తున్నారు. రాష్ట్రంలో గేదెల పంపిణీ ఈ రోజు ,రేపు అంటూ ఊరిస్తూనే ఉన్నారు. గేదెల పంపిణీ జరిగితే పాల ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మనకు ప్రస్తుతం సాగులో ఉన్న భూమి కాని ,మిషన్ కాకతీయ, కొత్త ప్రాజెక్టు ల కారణంగా అదనంగా కొంత భూమి సాగులోకి వచ్చినా వెంటనే అధికంగా నీరు తీసుకునే పంటలవైపే ఆలోచిస్తున్నాము. కనీసం 10 గుంటల స్థలం కేటాయిస్తే 2 లేదా 3 పాడి పశువులను పెంచుకోగలిగే కో3లాంటి గడ్డి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. నిజంగా పంటలు నష్టపోయినప్పుడు పంటల బీమాలో ఇప్పుడు ఉన్న లోపాల కారణంగా బీమా క్లయిం రావటం లేదు. కాని ఏదైనా పరిస్థితులు అనుకూలించక పశువు చనిపోయిందనుకోండి బీమా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2.17 లక్షల పాడి గేదెలను సబ్సిడీతో అందించటం కోసం 2 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్టు పత్రికలలో వస్తున్నది. అది వెంటనే కార్యరూపం దాల్చి రైతుకు గేదెలు అందితే ఆత్మహత్యలకు కొంత పరిష్కారం కనిపించినట్టే.
పాడి పశువుల వల్ల అనుకూలమైన అంశం ఏమంటే పంటల వలే ధరలలో తీవ్ర హెచ్చు తగ్గులు ఉండవు.పాలను సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం సేకరిస్తుంది. ముఖ్యంగా 70%గా ఉన్న కౌలు రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యతతో ఒకటి,రెండు పశువులను సబ్సిడీ పై అందిస్తే చాలావరకు వారి ఆత్మహత్యలు తగ్గే అవకాశం లేకపోలేదు.పైగా పోషకాహార లోపంతో భాదపడుతున్న మన పిల్లలకు ఇది దోహదపడుతుంది. ఆరోగ్య ఖర్చులు చాలావరకు తగ్గుముఖం పట్టి కొంత ఆర్థిక స్వావలంబన వైపు వెళ్ళవచ్చు.
పాల ఉత్పత్తిదారులకు ఎదురవుతున్న కొన్ని సవాళ్లు
క్షీర విప్లవం సాధించడానికి కొన్ని సమస్యలు ఎదుర్కొక తప్పదు. 2017 జూలై లో మన హైదరాబాద్ నగరంలో జరిగిన RCEP ఒప్పందాల వలన మన పాడి రైతులకు జరిగిన నష్టాన్ని మరవకూడదు. RCEP ఒప్పందాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలనుండి ఇబ్బడి,ముబ్బడిగా పాలు, పాల పదార్థాలు దిగుమతి చేసుకోవడానికి తలుపులు బార్ల తెరిచాయి. మన పాడి రైతుల పోట్టగొడుతుంది. అది ఇప్పటికి మన దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వేయేతర సహకార సంఘాలు అన్నీ కలిపి పాడి రైతుల దగ్గర కొంటున్న పాలు 30 శాతమే. మిగిలిన పాడి రైతులు ఇంటి దగ్గర, హోటళ్లకు, హాస్టళ్ళకు ఇతరత్రా అమ్ముకుంటున్నారు. సహకార సంఘాలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల వల్ల 2020 సంవత్సరానికి పాల దిగుబడి తగ్గవచ్చన్న భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐ సి ఏ ఆర్) పరిశోధన పుశువుల పెంపకంలో మరిన్ని జాగ్రతలు తీసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. ప్రస్తుతం చాలా గ్రామాలలో పశువులను గుంపుగా తీసుకెళ్ళి ఒకచోట మేపడం చాలా సమస్యగా ఉంది. పశుగ్రాసం కోసం ప్రతి గ్రామానికి 10 ఎకరాల గడ్డి భూమి ఉంచాలని గతంలో హైకోర్టు సూచించింది. దీనిని పాటిస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుంది.
యదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో గత 5 సంవత్సరాలలో స్వర భారతి పరస్పర సహకార సంఘం ద్వారా 300 మంది సన్న చిన్న కారు,కౌలు, మహిళా రైతులకు బర్రెలు పంపిణీ చేయగా అందరూ వాటిని పోషించుకుంటూ తమ జీవన విధానం మెరుగుపరుచుకున్నారని, పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని,పొదుపు చేసుకోవటం కుడా అలవాటు చేసుకున్నారని ఆ కుటుంబాలలో ఏ ఒక్కరు అత్య్మహత వైపు ఆలోచన కుడా చేయలేదని,కుటుంబంలో మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతున్నదని, రైతుల ఆత్మహత్యలు నివారించటానికి పశువుల పంపిణీ చాలా దోహదపడుతుందని గత 25 సంవత్సరాలుగా సామజిక సేవలో ఉన్న పిలుపు సంస్థ డైరెక్టర్ జనార్దన్ అంటున్నారు.
భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన ఉమా రాణి 20 సంవత్సరాల క్రితం భర్త సుధాకర్ ను కోల్పోయినప్పటికీ పశువులను పోషించుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటూ పొదుపు అలవాటు చేసుకుని చాలా ధైర్యంగా, సంతృప్తితో జీవనం కొనసాగిస్తున్నది. తన జీవితానికి పశువులకు విడదీయరాని బంధం వుందంటుంది.
రైతు ఆత్మహత్య కుటుంబాలను కలిసినప్పుడు ప్రస్తుతం మీకు ఏ సహకారం అందజేస్తే జీవితంలో కొద్దిగా స్థిరపదగలరు అని అడిగినప్పుడు ఎక్కువ కుటుంబాలనుండి వచ్చిన సమాధానం పశువులు ఇప్పిస్తే పెంచుకుంటామని. అంటే చితికిపోయిన తమ కుటుంబాలను నిలబెట్టగలిగేవి పశువులేనని వారు బలంగా నమ్ముతున్నారు . వీరి కోరిక మేరకు ఐ ఫర్ ఫార్మర్స్,అడాప్ట్ ఏ ఫార్మర్,మన భూమి ఫౌండేషన్ లాంటి సంస్థలు కొందరికి పాడి పశువులను అందజేశాయి. పాడిపై వచ్చిన ఆదాయంతో గతంకంటే మెరుగైన జీవితం గడుపుతున్నామని,చిన్న చిన్న కుటుంబ అవసరాలు,పిల్లల చదువులు కుడా కొనసాగుతున్నాయని తెలిపారు. నెలకు ఒకసారి కొంత ఆదాయం రావటం వల్ల కొంత ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని స్వయంగా ఆ కుటుంబాలే తెలిపాయి.
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుశాపురం శివారు కొత్తతాండ గ్రామానికి చెందిన బానోతు రాజు గిరిజన రైతు. వ్యవసాయంలో వచ్చిన నష్టాల కారణంగా 1305-2016 నాడు ఆత్మహత్య చేసుకున్నారు. రాజు ఆత్మహత్యను రైతు ఆత్మహత్యగా గుర్తించక పోవటంతో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు. భానోతు రాజు భార్య అంభి ఇద్దరు చదువుకుంటున్న పిల్లలతో ఎలా జీవనం నడుస్తుందో అని భాదపడుతున్న సమయంలో అడాప్ట్ ఏ ఫార్మర్ అనే సంస్థ అంభి కి ఒక పాడి గేదెను ఇచ్చింది. ప్రస్తుతం అంభి ఆ గేదెను పెంచుకుంటూ రోజూ 5 లీటర్ల పాలు పాలకేంద్రానికి పోస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటుంది. జయశంకర్ జిల్లా, రేగొండ మండలం, రంగాయపల్లే గ్రామానికి చెందిన కట్టమల్ల శ్యాంరావు (38)వ్యవసాయంలో అయిన అప్పల కారణంగా 8-7- 2016 నాడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్వంత భూమి లేదు. కౌలు రైతు. ఇంటి స్థలం కూడా లేదు. కౌలు రైతు కావటం వల్ల రైతు ఆత్మహత్య కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన ఎక్ష్ గ్రేషియా కుడా అందలేదు . భర్తను కోల్పోయిన ఇందిర ఇద్దరు పిల్లలతో ఎలా జీవనం కొనసాగించాలి అని రంది పడుతున్న సమయంలో ఐ ఫర్ ఫార్మర్స్ సంస్థ వీరికి ఒక గేదెను కొనిచ్చింది. రేపో మాపో ఆ గేదె పాలు ఇస్తుందని తాను పిల్లలను చదివించుకుంటానని ఇందిర కొండంత దైర్యంతో ఉంది. ప్రభుత్వం పశువుల పంపిణీ చేపట్టినప్పుడు కూడా గత అనుభవం దృష్ట్యా కొన్ని జాగ్రతలు తీసుకుంటే మంచిది.
గతంలో హర్యానా నుండి దిగుమతి చేసుకున్న పశువులు మన వాతావరణానికి అలవాటు పడలేక వాటి పిల్లలు(దూడలు) చనిపోయి,ఆ బర్రెలు పాలు ఇవ్వని పరిస్థితులు ఎదురయ్యాయి. కాబట్టి స్థానిక రకాలైన పశువులను పంపిణీ చేస్తేనే అనుకూలంగా ఉంటుందనిపిస్తుంది.ఇక తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పశువుల పంపిణికి శ్రీకారం చుట్టి రైతు ఆత్మహత్య కుటుంబాలకు కొంత భరోసానిస్తూ ఆత్మహత్యలను నివారించాలి.