మనతెలంగాణ/జగిత్యాలటౌన్ : సేవా కులాలో ఉన్న కుమ్మరులను బిసి.బి నుండి బిసి.ఎ జాబితాలోకి మార్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు నడికుడ జయంత్‌రావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్‌జి గార్డెన్స్‌లో ఆదివారం కుమ్మరి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మామిడి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జయంత్‌రావు మాట్లాడుతూ కుమ్మరులు రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. కుల వృత్తి పేనే ఆధారపడి జీవిస్తున్న అర్హులైన కుమ్మరులకు రూ.5వేల జీవన భృతిని చెల్లించాలని కోరారు. అదే విధంగా మూడెకరాల భూమిని కేటాయించాలన్నారు. పది 76 జీవో ప్రకారం ఒండ్రు మట్టితో నిండిన కుంటలపై కుమ్మరులకు పూర్తి హక్కు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఐదు ఎకరాల స్థలంలో కమ్యూనిటీ భవన్ నిర్మించాలన్నారు. యువతకు కుండల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యపరంగా హాస్టల్ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కుమ్మరుల కోసం ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేసిన తరహాలోనే తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. కుమ్మరులకు ఆధునిక పరిశ్రమలపై అవగాహన కల్పించేలా స్టడీటూల్ ఏర్పాటు చేయాలని, కుల వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుమ్మరులకు షో రూమ్‌లు కేటాయించి కుండలు అమ్ముకునేలా చర్యలు చేపట్టాలన్నారు. మట్టి పాత్రల వినియోగంపై కలిగే లాభాలపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయించాలన్నారు. కుమ్మరులు తమ ఇంటి వద్ద మట్టి పాత్రలను ఉపయోగించాలని, ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. కుమ్మరుల కోసం ప్రభుత్వం వంద కోట్ల బడ్జెట్ కేటాయించిందని, ఆన్‌లైన్‌లో ఋణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లాలో ఇటీవల దారుణంగా హత్య చేయబడిన మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపెల్లి శ్రీనివాస్ మృతికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లయ్య, ఉమ్మడి జిల్లా నాయకులు ఇస్తారి, నాంపెల్లి హన్మండ్లు, జగిత్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడిపెల్లి కృష్ణ, అయిలాపురం తిరుపతి, ఎనగంటి రామచంద్రం, సిరికొండ శ్రీనివాస్, దేవదాసు, మరిపెల్లి శంకర్, కెల్లెటి రమేష్, దుబ్బరాజం, రాజేశం, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
కుమ్మరులను బిసి.ఎ జాబితాలో చేర్చాలని డిమాండ్
- Advertisement -
- Advertisement -