Home రాష్ట్ర వార్తలు కోటాపై కోట్లాట

కోటాపై కోట్లాట

TRS-LEADERS

లోక్‌సభలో 8వ రోజూ మార్మోగిన టిఆర్‌ఎస్ నిరసన కంఠం 

జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్
ఎస్‌సి, ఎస్‌టిల హక్కులను కేంద్రం కాలరాయడం అన్యాయమన్న ఎంపిలు
స్పష్టత ఇచ్చేంత వరకు నిరసన ఆపబోమని హెచ్చరిక 

మన తెలంగాణ/ న్యూఢిల్లీ: జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు ఇచ్చేలా రాజ్యాంగాన్ని సవరించాలని టిఆర్‌ఎస్ ఎంపిలు డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని వారు కేంద్రాన్ని కోరారు. పార్లమెంటులో 8వ రోజైన బుధవారం కూడా టిఆర్‌ఎస్ ఎంపిల నిరసన కొనసాగింది. లోక్‌సభ స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేయగానే పార్లమెంటులోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో నినాదాలు చేశారు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే స్పీకర్ వెల్‌లోకి  కోటాపై కొట్లాట వెళ్లి నిరసన తెలిపారు. వాయిదా అనంతరం 12గంటలకు సభ ప్రారంభం కాగానే టిఆర్‌ఎస్ సభ్యులు మాత్రం సభా కార్యక్రమాలకు హాజరు కాలేదు. పార్లమెంటులోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించిన సందర్భంగా టిఆర్‌ఎస్ ఎంపిలు మీడియాతో మాట్లాడారు. బిసిలు, ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ క్రమంలోనే సిఎం కెసిఆర్ రిజర్వేషన్లు పెంచాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారన్నారు. ఎంపి సీతారాం నాయక్ మాట్లాడుతూ…. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50శాతం పెంచకూడదన్న తీర్పును బూచిగా చూపి తెలంగాణలోని వెనుకబడిన వర్గాలకు కేంద్రం అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు.

ఈశాన్య రాష్ట్రాలలో 90శాతం పైగా ఎస్‌సి, ఎస్‌టిల శాతం అక్కడ 15శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అక్కడ మాత్రం జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తూ…. ఇతర రాష్ట్రాలకు వచ్చేసరికి వేరే న్యాయం ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ప్రశ్నించారు. ఎస్‌సి, ఎస్‌టిలకు రాజ్యంగం ఇచ్చిన హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాయడం న్యాయం కాదన్నారు. తెలంగాణ సిఎం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకునే అవకాశం కల్పించాలన్నారు. ఎంపి బాల్కసుమన్ మాట్లాడుతూ…. పార్లమెంటులో టిఆర్‌ఎస్ ఎంపిలు చేసినట్లే, అసెంబ్లీలో తాము చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాము పార్లమెంటులో ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి చేసిన ఆందోళనలో ఎక్కడా మైకులు విరగగొట్టి స్పీకర్ పై విసరడం కాని, రాష్ట్రపతిపై ప్రసంగ కాపీలు చించి వేయడం కాని చేయలేదంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణలకు గట్టిగా బుదులిచ్చారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు చేసిన పనిని ఆయన దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతల పొంతనలేని పోలికలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా వేశారు. కాంగ్రెస్ నేతలు తాము చేసిన తప్పును ఒప్పుకొని, ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ వాయిదా పడగానే టిఆర్‌ఎస్ ఎంపిలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలిచి ఎప్పటి వరకు ఈ నిరసన చేస్తారని ప్రశ్నించారు.