Home జాతీయ వార్తలు అవిశ్వాసంచలనం

అవిశ్వాసంచలనం

విలక్షణ రీతిలో అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేత

గవర్నర్ అండతో స్పీకర్ తొలగింపు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన హోటల్‌లో అసెంబ్లీ –
అవిశ్వాసం బిజెపితో చేతులు కలిపిన కాంగ్రెస్ రెబెల్స్ లోక్‌సభలో ప్రతిధ్వనులు, వాయిదా
గవర్నర్ నిర్ణయంపై, స్పీకర్ తొలగింపుపై హైకోర్టు స్టే

arunachal-pradeshఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో అసాధారణరీతిలో ఓ హోటల్‌లో కాన్ఫ రెన్స్ హాల్‌లో పోటీ అసెంబ్లీ జరిగింది.  ముఖ్యమంత్రి నబమ్ తుకి స్థానంలో కొత్త సిఎంను ఎన్నుకోవడం వరకూ చకచకా కీలక పరిణామాలు జరిగాయి.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు అసెంబ్లీ అత్యంత అసాధారణ, విచిత్ర ఘటనల నేపథ్యంలో తీవ్రస్థాయికి చేరాయి. వివాదాస్పద రీతిలో గురువారం రెండోరోజుకూడా అసెంబ్లీ సమావేశాలు ఆద్యంతం నాటకీయంగా సాగాయి. ఇందులో కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి సిఎం నబమ్ తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడం, దీనికి ఆమోదం దక్కినట్లు  అసెంబ్లీలో ప్రకటించడం ఆ తరువాత అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మె ల్యే కలికో పూల్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టు ప్రకటించడం జరిగి పోయింది. ఒక్కరోజు క్రితమే బుధవారం హైడ్రామా నడుమ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు, 11 మంది   బిజెపి సభ్యులు, ఇద్దరు ఇండిపెండెంట్లతో చేతులు కలపడంతో సాగిన అసెంబ్లీ పరిణామాలలో స్పీకర్ నబం రెబియా అభిశంసనకు గురయినట్లు ప్రకటించారు. శాంతిభద్రతల కారణాలతో అసెంబ్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌ను అధికారులు సీల్ చేయడంతో అభిశంసనపై చర్చ , ఓటింగ్ కార్యక్రమాన్ని స్థానిక కమ్యూనిటీహాల్‌లో సాగించి స్పీకర్ అభిశంసనకు గురయినట్లు ప్రకటించారు. ఇక రెండోరోజు కూడా ఇదే విధమైన కీలక పరిణామాలు సాగాయి. బిజెపి, రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం ఓ హోటల్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌నే తమ అసెంబ్లీగా మలుచుకుని సమావేశం నిర్వహించారు. అసెంబ్లీకి తాళం వేసి ఉండటంతో ఇక్కడ అసెంబ్లీని నిర్వ హించినట్లు ప్రకటించారు. వారు ముఖ్యమంత్రిపై అవిశ్వాసం ప్రవేశపెట్టడం అది నెగ్గినట్లు ఉపసభాపతి టి నోర్బు థోంగ్డోక్ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో ప్రకటించడం జరిగిపోయింది. థోంగ్డోక్ కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. 60 మంది సభ్యుల అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 33 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 20 మంది ముఖ్యమంత్రికి వ్యతి రేకంగా అసమ్మతిని లేవనెత్తి రెబెల్స్‌గా మారారు. వారు సాగించిన తాజా పోటీ అసెంబ్లీ ఓ ఎత్తయితే ఇప్పుడు మరింత నాటకీయంగా ఆ తరువాత అసమ్మతి ఎమ్మెల్యేలు కలిసి తాము ఎమ్మెల్యే కలికో పూల్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు, ఆయన ఇప్పుడు సిఎం అని ప్రకటించారు. అయితే ఈ సమావేశాలు చెల్లనేరవని, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రస్తుత సిఎం తుకి ఆయనకు మద్దతు ఇచ్చే 26 మంది ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి, వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పి బహిష్కరించారు. దీనితో రెబెల్ ఎమ్మెల్యేలు గవర్నర్ జెపి రాజ్‌ఖోవా నుంచి సరైన మద్దతు తీసుకుని తాము హోటల్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో అసెంబ్లీని పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ హోటల్ అసెంబ్లీ సెషన్‌కు డిప్యూటీ స్పీకర్ సారథ్యం వహించారు. మూజువాణి ఓటుతో ముఖ్యమంత్రిని దించివేస్తున్నట్లు వెల్లడించారు. త్వర లోనే తమకు గవర్నర్ నుంచి ఆహ్వానం లభిస్తుందని, ఆ మేరకు కొత్త మంత్రి మండలి ప్రమాణం చేస్తుందని తెలిపారు.సభలో బిజెపి నేత తమియో తాగా సిఎంపై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఏప్రిల్ నుంచి కూడా ముఖ్య మంత్రికి వ్యతిరేకంగా అసెంబ్లీలో అత్యధిక స్థాయిలో అవిశ్వాసం నెలకొని ఉందని, తుకి నాయక త్వంలోని మంత్రిమండలి డోలాయమాన స్థితిలో ఉన్నందున ఇప్పుడు ఈ అవిశ్వాసం అనివార్యం అయిందని ప్రతిపక్ష నేత ప్రకటించారు.
అప్రజాస్వామికం, ఏకపక్షం: తుకి లేఖ
అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిణామాలపై కలుగచేసుకుని న్యాయం చేయాలని అధికారికంగా ఇప్పటికీ సిఎంగా ఉన్న నబమ్ తుకి వేర్వేరుగా రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. గవర్నర్ ఏకపక్షంగా పోటీ అసెంబ్లీ భేటీకి పిలవడం , ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సంప్రదించకపో వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సలహా సహకారం మేరకే గవర్నర్ తగు విధంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.