Friday, April 26, 2024

రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో దట్టంగా మేఘాలు

- Advertisement -
- Advertisement -

cloudy

 

హైదరాబాద్ : శీతాకాలం వెళ్లిపోయి, వేసవి కాలం రాబోతున్న వేళ, అల్పపీడన ద్రోణి ప్రభావంతో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయి. హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావం అధికంగా ఉండటంతో మబ్బులు కమ్ముకున్నాయని ఒకటి, రెండురోజుల్లో వీటి ప్రభావం తగ్గుతుందని ఓ అధికారి వెల్లడించారు.

రానున్న రోజుల్లో వేసవి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాలపై ఉంటుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్టంగా 46 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటొచ్చని అధికారులు ఓ పేర్కొంటున్నారు. కాలుష్యం, అడవుల నరికివేత, జలవనరులు కుదించుకుపోవడం లాంటివి ఈ మార్పులకు కారణాలుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

నడినెత్తిన నిప్పులు కురిపించనున్న సూర్యుడు
రానున్న రోజుల్లో ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శివరాత్రి తర్వాత శివశివ అంటూ చలి వెళ్లిపోగా సూర్యుడికి భూ దక్షిణార్ధగోళం దగ్గరవుతోందని, అందులో భాగంగానే ఈసారి ఎండలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వేసవిలో నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపించనున్నాడని వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు.

గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలను తాకే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1 డిగ్రీ సెల్సియస్ వరకు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. భూతాపంతో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులే దీనికి కారణమని భారత వాతావరణ శాఖ సైతం స్పష్టం చేసింది. మార్చి రెండోవారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు మే నెలలో అధికంగా వడగాల్పులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.

11 వేడి సంవత్సరాలు నమోదు
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన వేసవితాపం, ఉక్కపోతలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు. గాలి బాగా తగిలేలా ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే చిన్న పిల్లలు, వృద్ధులకు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలని వారు పేర్కొంటున్నారు.

1901 నుంచి ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఆరు సంవత్సరాల్లో 2018 సంవత్సరం కూడా ఒకటని వాతావరణ శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. 2004 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు మొత్తం 11 వేడి సంవత్సరాలుగా (ఎండలు) ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో 1981 నుంచి 2010 మధ్యలో నమోదైన సగటు ఉష్ణోగ్రతల కంటే 2018లో 0.41 డిగ్రీలు ఎక్కువగా నమోదయినట్టు అధికారులు తెలిపారు. వందేళ్లకు పైగా ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకొని 2018లో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ సైతం గతంలో ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే.

2010, 2014, 2015, 2016 సంవత్సరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు
2010, 2014, 2015, 2016 సంవత్సరాల్లో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలంలో 48.2 డిగ్రీలు నమోదు కాగా, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో 48.5 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో 48.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి మండలంలో 48.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా ఎర్‌గట్లా 47.8 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 48.9 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో 48.6 డిగ్రీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలో 48.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలకపల్లి మండలంలో 48 డిగ్రీలు, మహబూబాబాద్‌లోని గార్ల మండలంలో 48.5 డిగ్రీలు, వరంగల్ రూరల్‌లోని పర్వతగిరి మండలంలో 48.7 డిగ్రీలు, వరంగల్ అర్బన్‌లోని కమలాపూర్ మండలంలో 47.6 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో 48.8 డిగ్రీలు నమోదయ్యింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ గణాంకాలను బట్టి తెలుస్తోంది.

Densely cloudy in Telugu states
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News