Home జాతీయ వార్తలు వాయిదాల వల్లే కేసులు ఆలస్యం

వాయిదాల వల్లే కేసులు ఆలస్యం

ఈ సంప్రదాయాన్ని మానుకోవాలని న్యాయవాదులకు రాష్ట్రపతి హితవు

President-Ramnath-Kovind

న్యూఢిల్లీ: వాయిదాలు కోరే సంస్కృతిని ఒక విధానంగా చేసుకోవడం కోర్టుల్లో కేసుల పరిష్కారంలో విపరీత జాప్యానికి ఒక కారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం అభిప్రాయపడ్డారు. ఈ సంప్రదాయాన్ని అదుపు చేయడానికి న్యాయవ్యవస్థ చర్యలు తీసుకుంటోందని కూడా ఆయన చెప్పారు. దేశంలోని వివిధ కోర్టుల్లో కేసులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉం డడాన్ని రాష్ట్రపతి ప్రస్తావిస్తూ భారత న్యాయవ్యవస్థను కేసుల పరిష్కారం లో విపరీత జాప్యం పట్టి పీడిస్తోందని, కోర్టుల్లో ముఖ్యంగా సబారినేట్ కోర్టుల్లో మౌలిక సదుపాయాల కొరత, భారీ సంఖ్యలో ఖాళీలు ఉండడం దీనికి కారణాల్లో కొన్ని అని అన్నారు.‘ న్యాయం కోసం వాదించుకునే శక్తి, స్తోమతులేని వారికి న్యాయాన్ని అందించే వ్యవస్థగా భారతీయ న్యాయవ్యవస్థకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. పెద్ద సంఖ్యలో కేసుల కారణంగా మన న్యాయమూర్తులు మితిమీరిన పని భారాన్ని ఎదుర్కొంటున్న మాట కూడా నిజమే. ఫలితంగా భారతీయ న్యాయవ్యవస్థ సుదీర్ఘ జాప్యం అనే సమస్యతో సతమతమవుతోంది’ అని శనివారం ఇక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్ల అసోసియేషన్ (ఎస్‌సిఎఒఆర్‌ఎ) ఏర్పాటు చేసిన ఒక సదస్సును ప్రారంభిస్తూ రాష్ట్రపతి అన్నారు. వాయిదాలను కోరడం ఒక మినహాయింపుగా కాక ఒక విధానంగా చేసుకునే సంస్కృతి వ్యవస్థలో ఉంది. తరచూ వాయిదాలను కోరడం పై క్రమంగా కొత్త ఆలోచన మొదలైంది. దీన్ని అదుపు చేయడానికి న్యాయవ్యవస్థ్థ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప వాయిదాలు కోరకూడదని మొత్తం న్యాయవాదులు తీర్మానించుకుంటారన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.

న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి: దీపక్ మిశ్రా

కాగా న్యాయవ్యవస్థపై మచ్చ పడడానికి ముందే వీలయినంత త్వరగా ఈ వ్యవస్థలోని మౌలిక సదుపాయాల అంతరాన్ని భర్తీ చేయాలని, నిధుల కొరతను సాకుగా చూపవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి దీపక్ మిశ్రా అన్నారు. ‘భారత దేశంలో మారుతున్న న్యాయవిద్య ముఖచిత్రం’ అన్నఅంశంపై జరుగుతున్న ఈ సదస్సులో మిశ్రా మాట్లాడుతూ, న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, దీని ఫలితంగా న్యాయాన్ని అందించే వ్యవస్థ వేగవంతం కావడమేకాక నాణ్యత కూడా పెరుగుతుందని, ఫలితంగా న్యాయాన్ని అందించడమనే ప్రయోజనం నెరవేరుతుందని ఆయ న అన్నారు. సాంకేతికంగా ఎదిగిన యువ లాయర్లకు కేసులను వాదించేందుకు పాత వారు అవకాశమివ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నా రు. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా అసోసియేషన్‌కు చెందిన ఇ జర్నల్‌ను విడుదల చేశారు. అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తదుపరి సిజెఐ రంజన్ గొగోయ్ ?

కేంద్రానికి సిఫార్సు, అక్టోబర్ 2న ప్రమాణం

న్యూఢిల్లీ: జస్టిస్ రంజన్ గొగోయ్ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఆయన సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. సీనియార్టీన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను సిజెఐ నియమించాలని ప్రస్తుత ప్రధాన న్యా యమూర్తి దీపక్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. విధివిధానాల ప్రకారం చీఫ్ జస్టిస్ తమ పదవీవిరమణకు ముందు తమ పదవీ వారసుడి పేరును ప్రభుత్వానికి సూచించడం ఆనవాయితీగా వస్తోంది. సిజెఐ దీపక్ మిశ్రా అక్టోబర్ 2వ తేదీన రిటైర్ కానున్నారు. సీనియార్టీ మేరకు చూస్తే దీపక్ మిశ్రా తరువాతి స్థానంలో జస్టిస్ గొగోయ్ ఉన్నారు. దీనితో ఆయనకే ఈ కీలక న్యాయవ్యవస్థ బాధ్యత లు దక్కేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. పదవీ వారసుడి పేరును సూచించాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత నెలలోనే కోరారు. ప్రధాన న్యాయమూర్తి సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఇక జస్టిస్ గొగోయ్ దేశ సిజెఐగా అక్టోబర్ 2న ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుంటుంది. అయితే జస్టిస్ గొగోయ్ ఈ ఏడాది నవంబర్ 17నే పదవీ విరమణ చేయాల్సి ఉంది.

వ్యక్తిగత వివరాలు: జస్టిస్ రంజన్ గొగోయ్ అసోంలో 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. వయస్సు 63 సంవత్సరాలు. ఆయన తండ్రి కేశబ్ చంద్ర గొగోయ్ అసోం సిఎంగా ఉండేవారు. తమ వృత్తి నిర్వహణలో ఆయన పలు కీలక తీర్పులు వెలువరించారు. రిలయన్స్ కమ్యూనికేషన్, మధ్యవర్తిత్వ సారథ్యం, కన్హయ్య కుమార్ కేసు, సౌమ్య అత్యాచారం హత్య కేసు వంటివాటిలో తీర్పులు ఇచ్చారు.