Friday, April 19, 2024

డిగ్రీలో డిటెన్షన్ నిలిపివేత

- Advertisement -
- Advertisement -

Degree

 

బిఎ, బికాం, బిఎస్‌సి కోర్సులకు వర్తింపు n చివరి సంవత్సరం మినహా మిగతా విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోషన్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలలో బిఎ, బి.కాం,బి.ఎస్‌సి కోర్సులు చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ సారి డిటెన్షన్ విధానాన్ని నిలిపివేశారు. ఈ మేరకు వర్సిటీల రిజిస్ట్రార్లతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మినహా ఆయా కోర్సుల్లోని మిగతా సంవత్సరాలకు డిటెన్షన్ నిలిపివేతను అమలు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా డిగ్రీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర పరీక్షలను తాత్కాలికంంగా నిలిపివేసి, లాక్‌డౌన్ తరువాత ముందుగా ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షలను మాత్రం యథావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సుమారు 4 లక్షల మందికి నో టెన్షన్
రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతుండగా, అందులో సుమారు 2 లక్షల వరకు చివరి సంవత్సరం విద్యార్థులు ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. డిగ్రీలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు రెండవ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం వారికి నాలుగవ సెమిస్టర్, మూడవ సంవత్సరంం ఆరవ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిం చాల్సి ఉంది. కరోనా కారణంగా మార్చి 15 నుంచి విద్యాసంస్థలు మూతపడటంతో ఆయా పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లోని ఫైనలియర్ విద్యార్థులు మినహా మిగిలిన విద్యార్థులకు డిటెన్షన్‌ను తాత్కాలికంగా నిలిపేసి పైతరగతికి (తర్వాతి సెమిస్టర్‌కు) ప్రమోట్ చేసి విద్యార్థులకు ఊరట కలిగిస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అమల్లోకి తెచ్చిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం నిబంధన ప్రకారం విద్యార్థుల ఒక సంవత్సరం చదువులో కనీసం 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉంటే ఆ తర్వాతి సంవత్సరంలోని సెమిస్టర్‌కు ప్రమోట్ చేయాలి. దానినే డిటెన్షన్ విధానం అంటారు. ఆ నిబంధన ప్రకారం పరీక్షలు నిర్వహించకుండా, విద్యార్థులు ఉత్తీర్ణులు కాకుండా పైతరగతులకు ప్రమోట్ చేసే వీల్లేదు. అందుకే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ ఒక్క సెమిస్టర్‌కు డిటెన్షన్‌ను ఎత్తివేయాలని ఉన్నతవిద్యా మండలి నిర్ణయించింది.

ఇంజనీరింగ్ కోర్సులకు ఇంకారాని స్పష్టత
ఇంజనీరింగ్, ఫార్మసీలతో ఇతర సాంకేతిక కోర్సుల్లో డిటెన్షన్ విధానం నిలిపివేతపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుత ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు రెండవ సెమిస్టర్, నాలుగవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్‌తోపాటు 4వ సంవత్సర విద్యార్థులకు 8వ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే సాంకేతిక కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) మార్గదర్శకాలు జారీ చేస్తుంది. జెఎన్‌టియుహెచ్ సహా అన్ని వర్సిటీలు ఈ విషయంపై ఎఐసిటిఇతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు డిటెన్షన్ విధానం తొలగింపుపై చర్చల దశలోనే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎఐసిటిఇ మార్గదర్శకాల జారీ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

Detention withheld in Degree
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News