Home తాజా వార్తలు సెమీ మెకానికల్ పద్ధతిలో అడవులను అభివృద్ధి చేయండి

సెమీ మెకానికల్ పద్ధతిలో అడవులను అభివృద్ధి చేయండి

Develop Forestry

 

వనపర్తి, పాన్‌గల్, ఖిల్లా ఘణపురం, బుద్దారం ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో
అడవులను అభివృద్ధి చేయాలి : రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎ.కె. సిన్హా

వనపర్తి : వనపర్తి జిల్లాలోని అన్ని ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో పది ఎకరాల్లో సెమి మెకానికల్ పద్దతిలో అడవులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎ.కె.సిన్హా చెప్పారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఏకో పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా సిసిఎఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని రిజ ర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌ల్లో పది ఎకరాల్లో సెమి మెకానికల్ పద్దతిలో అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందు లో భాగంగా ఇదివరకే అడవుల్లో ఎండిపోయిన చెట్లను తీసివేసి ఆ ప్రాంతాన్ని చదును చేసి మంచి మొక్కలను నాటాలని సూచించారు. ఇలాంటివి ప్రతి నియోజకవర్గానికి ముఖ్యంగా ప్రతి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుకు 1 చొప్పున అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎకో పార్కు వనపర్తి పట్టణానికి అతి సమీపంలో ఉండడం , వనపర్తి, కర్నూల్ రహదారి పార్కు చెంతనే వెళ్తు ఉండడం వల్ల ప్రస్తుతం ఏకో పార్కును ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో సెమి మెకానికల్ పద్దతిలో ఆడవిని అభివృద్ధి చేస్తే బాగుం టుందని సూచించారు. ప్రస్తుతం ఈ అడవిలో ఎండిపోయిన చెట్లు, యూకలిప్టస్ చెట్లు, తుప్పలను తొలగించి రహదారి వెంట వెళ్లేవారికి సుందరంగా కనిపించే పొడవాటి మొక్కలను నాటాలని సూచించారు. అంతేకాక అడవి మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలను బాగా దున్ని మంచి మొక్కలు నాటితే అడవి అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు గాను అవసరమైన మొక్కలను అందుబాటులో ఉన్న నర్సరీల నుండి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ శ్వేతామహంతి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఎకోపార్కు పక్కన ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు పాన్‌గల్, ఖిల్లా ఘణపురం, బుద్దారం ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులు ఉన్నట్లు సిసిఎస్ దృష్టికి తీసుకొచ్చారు.

కొత్తకోట నుండి వనపర్తికి వెళ్లే రహదారికి ఇరుపక్కల హరితహారం కింద అవసరమైన పెద్ద మొక్కలను నాటించడంతో పాటు కంచె ఏర్పాటుకు తాను నిధులు మంజూరు చేస్తానని ఇందుకు అవసరమైన సాంకేతిక సూచనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ఇందుకు స్పంధించిన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అన్ని రిజర్వు పారెస్ట్‌ల్లో సెమి మెకానికల్ పద్దతిలో మొక్కలు నాటి అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు. కొత్తకోట ,వనపర్తి రహదారి పక్కల పొడవాటి మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్‌ఒ బాబ్జీరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Develop Forestry in semi-mechanical manner