*రాష్ట్ర మంత్రి జోగు రామన్న
మన తెలంగాణ/ఆదిలాబాద్ టౌన్ : పార్టీలకు అతీతంగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం రూ.5 లక్షల చొప్పున 7 వార్డుల్లో మొత్తం 35 లక్షల రూపాయలతో నిర్మించే డ్రైనేజీ పనులకు ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అందులోనే భాగంగా ప్రతి మున్సిపల్‌లో డైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, సిఎం కెసిఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఆరోపణలు చేసిన అభివృద్ధే లక్షంగా ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుతం పట్టణంలో మిషన్ భగీరథ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇంటింటికీ తాగు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, టిఆర్‌ఎస్ నాయకులు సాజిదొద్దిన్, సిరాజ్ ఖద్రి, తదితరులు పాల్గొన్నారు.