Friday, April 19, 2024

పోషకాహార భద్రతా కావాలి

- Advertisement -
- Advertisement -

Developing countries need nutritional security

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరువు, ఆకలి చావులు, పోషకాహారలోపం పెద్ద సవాళ్ళుగా నిలిచి, కోట్లాది అమాయక చిన్నారుల బతుకులు బలి కొంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా పండినా, విశ్వవ్యాప్తంగా 2 బిలియన్లు, ఇండియాలో 194.4 మిలియన్ల ప్రజలు ఆహార భద్రతకు దూరంగా, చావుకు దగ్గరగా జీవచ్ఛవాల్లా కాలం గడపడం అత్యంత విషాదకరం. ఐదేండ్ల లోపు పిల్లలకు పోషకాహార లోపంతో అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువు లేకపోవడం), స్టంటెడ్ గ్రోత్ (వయసుకు తగ్గ పొడవు లేకపోవడం), వేస్టెడ్ గ్రోత్ (పొడవుకు తగ్గ బరువు లేకపోవడం) సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఈ సమస్యలకు 2030 నాటికి సరైన సమాధానం ఇవ్వాలని పథకాలు రచించి, అమలు చేస్తున్నారు.

ప్రపంచ జనాభాలో ఇండియాలో 30.9 శాతం (46 మిలియన్లు) స్టంటెడ్ గ్రోత్ ఉన్న పిల్లలు, 50.9 శాతం (25.2 మిలియన్లు) వేస్టెడ్ గ్రోత్ పిల్లలు ఉన్నారు. పేద పిల్లలు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు పోషకాహార లోపంతో బాధపడడం కఠిన నిజంగా అనుభవంలోకి రావడం చూస్తున్నాం. అందరికీ పోషకాహార భద్రత కల్పిస్తేనే ప్రజలు ఆరోగ్యంగా ఎదుగుతూ, దేశాభివృద్ధికి దోహదపడతారని, లేని యెడల దేశానికి భారమవుతారని అర్థం చేసుకోవాలి. పోషకాహార, సూక్ష్మ ఖనిజ లవణాల లోపాలతో నిరుపేద మహిళలు, బాలల పెరుగుదల మందగించడం, శక్తిహీనులుగా మారడం జాతికి అవమానకరం. అందరికీ పోషకాహార భద్రత కల్పించడం, పేదరిక నిర్మూలన, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, సమర్థవంతంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నెలకొల్పడం, మహిళలకు విద్య కల్పన లాంటి చర్యలు పోషకాహార భద్రతకు తోడ్పడతాయని నివేదిక తెలియజేస్తున్నది. పిల్లలు, బాలికలు, మహిళలు, కౌమార దశ బాలికల్లో రక్తహీనత సమస్య, తక్కువ బరువుతో శిశు జననాలు మన దేశానికి శాపంగా పరిగణించాయి.

నాబార్డ్, ఐసిఆర్‌ఐఇఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) సంయుక్తంగా నిర్వహించిన ‘భారత్‌లో పోషకాహార భద్రత సాధన – విజన్ 2030 ’లో భాగంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఇండియాలో పోషకాహార లోపం అనబడే శాపంతో చిన్నారుల బతుకులు బరువుగా సాగడం వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 809.9 మిలియన్ల ప్రజలు పోషకాహార లోప కారణ అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. ఈ గంభీరమైన సమస్యకు పరిష్కారంగా అందరికీ పోషకాహార భద్రతను 2030 నాటికి కల్పించాలనే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నెరవేరడానికి సఫల అడుగులు పడాల్సి ఉంది. మిలినియమ్ అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఆహార భద్రత, పోషకాహార లభ్యత, బాలల మానసిక, శారీరక సమగ్రాభివృద్ధి దిశగా దృష్టి పెట్టడం జరుగుతున్నది. ప్రపంచంలోని పోషకాహార లోప జనాభాలో 24 శాతం భారత్‌తోనే ఉన్నారని తేలింది. ఇండియాలో పిల్లల సంతులిత పెరుగుదలకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వసతులు, అంగన్‌వాడీ వ్యవస్థతో గర్భిణులు, పిల్లలకు పోషకాహార పంపిణీ, తక్కువ ఖరీదుకే ఆహార ధాన్యాల ప్రజా పంపిణీ లాంటి చర్యలు తీసుకుంటున్నారు.

ఆహార భద్రత కన్న పోషకాహార లభ్యత ముఖ్యమని గమనించి, సమతుల పోషకాహార కిట్లు మహిళలకు, పిల్లలకు ఉచితంగా/తక్కువ ఖర్చుతో చేరవేయాల్సి ఉంది. పేద కుటుంబాల ఆదాయ వనరులు పెంచడం, పని కల్పన, ఆరోగ్య కేంద్రాల స్థాపన, మహిళా విద్య, పిల్లల ఆరోగ్య సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, బాలల ఉచిత నిర్బంధ విద్య, సురక్షిత ప్రసవాలు, మాతాశిశు ఆరోగ్యం, కాలుష్యం తగ్గించడం, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ లాంటి చర్యలు జాతి హితాలుగా పని చేస్తాయని మరువరాదు. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్ అభియాన్’, ‘జల్ జీవన్’ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది.

నేటికీ మహిళలకు ఉన్నత విద్య 13.7 శాతం మందికి మాత్రమే అందుతోంది. తల్లి విద్యావంతురాలైతే కుటుంబం కూడా విద్యా వెలుగులతో నిండుతుంది. దాదాపు 55 శాతం తల్లులు మాత్రమే శిశువులకు రొమ్ముపాలు అందించడం దురదృష్టకరం. భారత్‌లో 25 శాతం 6 -23 నెలల పిల్లలకు కనీస పోషకాహార లభ్యత, 10 శాతం పిల్లలకు పూర్తి పోషకాహారం అందుతున్నాయి. గర్భిణులకు, ప్రసవాల అనంతర సంరక్షణ చర్యలు ఆరోగ్యకర ఎదుగుదలకు సహకరిస్తాయి. కోవిడ్- 19 విజృంభణతో పెరిగిన భయాలు, సామాజిక కట్టుబాట్లు, తరిగిన ఆహార లభ్యత, పని దొరక్క పోవడం, జీతాలు తగ్గడం, ఉద్యోగాలు ఊడడం, వలసదారులుబారులు తీరడం, ఉపాధులు మందగించడం లాంటి సమస్యలు పోషకాహార లభ్యతకు అవరోధాలుగా మారడం చూస్తున్నాం.

పోషకాహార అమలుకు బహుముఖ కోణాల్లో చర్యలు తీసుకోవలసి ఉంది. పోషకాహారం, కుటుంబ ఆదాయం, మహిళా విద్య, పేదరికం, ఆహార భద్రత, బాలల విద్య, వ్యవసాయం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పేదరికాన్ని తగ్గించడం, శిశు మరణాలను కట్టడి చేయడం, పోషకాహార లోపాన్ని అధిగమించడం తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వాలు భావించాలి. ప్రభుత్వాలతో పాటు సున్నితమైన బాధ్యత గల పౌరులు, స్వచ్ఛంద సంస్థలు పోషకాహార లోపాల పట్ల యుద్ధం చేయాలి. రాబోయే తరాలు పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్య భారతాన్ని నిర్మిస్తారని ఆశిద్దాం. ఆహార లభ్యతే కాదు పోషకాహార భద్రతను కూడా కల్పిద్దాం.

బి.మధుసూదన్ రెడ్డి – 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News