Home తాజా వార్తలు విద్యతోనే ఆదివాసీల అభివృద్ధి

విద్యతోనే ఆదివాసీల అభివృద్ధి

Adivasi

 

చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలి,  ఆదివాసీ భవన నిర్మాణానికి కృషి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్ : ఆదివాసీ కుటుంబాలు విద్య, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషకృషి చేస్తుందని రాష్ట్ర పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని వైస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.ఆదివాసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఆదివాసీలు విద్యనభ్యసించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆశ్రమ పాఠశాలల ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, స్కూల్‌డైరీలు, సీసీ కెమెరాలు, డ్యూయల్ డెస్క్, మంచాలు, దుప్పట్లు, కార్పె ట్లు, టవల్స్, బ్లాంకెట్స్ పరుపులు, కాస్మోటిక్ వస్తువులు అందిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఆదివాసీల కోసం 37 ప్రాథమిక,17 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నామని 2018 19 సంవత్సరానికి భోజన వసతి కొరకు రూ. 4కోట్ల77 లక్షలు ఖర్చు చేశామన్నారు. పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల కింద 66లక్షలు, ప్రీమెట్రిక్ కింద 5.35 లక్షలు రూపాయలు అందించడం జరిగిందన్నారు. గిరిజన విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇంగ్లీష్ క్లబ్, కరాడిమాల్ నిర్వహిస్తున్నామన్నారు.

ఆర్‌ఓఎఫ్‌ఆర్ పథకం కింద గిరిజన వ్యవసాయదారులకు 5495 మందికి హక్కుల పత్రాలు ఇచ్చామన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసుకుంటున్నామన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని జిల్లాలో ఆదివాసీ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. మంత్రి అంతకు ముందు రాంజీగొండ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు.

ఆదివాసీ అభివృద్ది కోసం పోలీసుశాఖ జిల్లాలోపలు కార్యక్రమాలు చేపట్టేందుకు ఆదివాసిల కోసం వైద్య శిబిరాలు, జాబ్‌మేళా, వెంకటాపూర్, పెంబి,కడెం,ఖానాపూర్‌లో జాబ్‌మేళా నిర్వహించి 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, డిటిడబ్లుఓ శ్రీనివాస్‌రెడ్డి, నాయక్‌పోడ్ జిల్లా అధ్యక్షులు ముసలి చిన్నాయ్య,వెంకాగారి భూమయ్య, నాయకులు సాకి లక్ష్మణ్, మల్లేశం, నారాయణ, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

Development of Adivasis with Education