Home తాజా వార్తలు కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి…

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి…

 Government Hospitals

 

నిర్మల్  : కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సందర్శించారు.ఈ సందర్బంగా మంత్రులు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటెల మాట్లాడారు. అంతకుముందు మంత్రి అల్లోల మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలను వివరించారు. అలాగే ఆసుపత్రికి అదనంగా 150 పడకలతోపాటు ఎంసిహెచ్ భవనానికి రూ. 20 కోట్లు మంజూరు చేయాలని ఇందుకు గాను ఐదు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేయ డం జరిగిందన్నారు.

అలాగే పొన్కల్, మెడిపెల్లి, సారంగాపూర్‌లలో హిహెచ్‌సి కేంద్రాలు మంజూరు కావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఐదేళ్ల కాలంలో వేల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. గతంలో ప్రభుత్వ వైద్య మం టేనే రోగులు భయపడేవారని కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ది చేయడంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు ఎదురుకాకుండా చూస్తునామన్నారు. ప్రతీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులతోపాటు మెరుగైన వైద్య పరికరాలను సమకూరుస్తామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రోగులు ప్రైవేట్ వైద్యాన్ని ఆశ్రయించకుండా పేదలకు అన్ని రకాల సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పిహెచ్‌సిలను అభివృద్ధిచేయడంతో పాటు వైద్య సేవలను మరింత మెరుగుపర్చి ప్రభుత్వ వైద్యమంటేనే గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల డాక్టర్ డే సందర్బంగా కొందరూ వైద్యులు తమకు రక్షణ కల్పించాలని, దాడులు జరుగుతున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. వైద్యులు దైవంతో సమానమని, పది సంవత్సరాల పాటు వైద్య విద్యను చేపట్టి ఈ వృత్తిలోకి వస్తారని వారికి ప్రభుత్వపరంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రాబోవు రోజుల్లో ముఖ్యంగా అటవీ ప్రాంతాల పరిధిల్లో మొబైల్ రక్తనమూన వాహనాలను ఏర్పాటు చేస్తామని, కేవలం కొన్ని గంటల్లోనే రక్తనమూనాలను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్యులు సైతం అంకిత భావంతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. నిర్మల్‌లో ట్రామాకేర్‌సెంటర్‌తో పాటు అదనంగా భవనాల మంజూరుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి అన్ని విభాగాలను మ్రంతి ఈటెల పరిశీలించారు. ఈ సందర్బంగా ఆసుప్రతిలో వసతులకల్పన రోగులకు అందుతున్న వైద సేవలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్లకు ధీటుగా ఆధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి, ముథోల్ ఎమ్మెల్యేలు జి. విఠల్‌రెడ్డి, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జెడ్పిచైర్‌పర్సన్ కోరిపెల్లి విజయలక్ష్మిరెడ్డి, ఎంపిపి కోరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్‌కుమార్,డాక్టర్ కార్తీక్, డాక్టర్ సుభాష్, డాక్టర్ ప్రమోద్‌చంద్రారెడ్డి,డాక్టర్ దేవేందర్‌రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్‌కృష్ణ, డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, వైద్యాధికారులు, సిబ్బంది, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Development of Government Hospitals