Saturday, April 20, 2024

వాస్తవికతకు పట్టం కట్టిన రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి

- Advertisement -
- Advertisement -

Devulapalli Krishna Murthy stories

దేవులపల్లి కృష్ణమూర్తి ఒక అసాధారణ వ్యక్తి. ఉద్యోగ జీవితం నుండి రిటైరయిన తర్వాత వారు తమ జీవితకేంద్ర బిందువు వద్దకు చేరుకున్నారు. అప్పటికి పాఠకుడిగా వారికి 45 సంవత్సరాల సాహిత్య జీవితం ఉంది. అంతకుమించిన జీవితానుభవం ఉంది. ప్రౌఢ వయసులో ఉన్న ఆ సాహిత్య పాఠకుడు, చుట్టూ ఉన్న జీవితాన్ని పరిశీలనాదృష్టితో చూస్తూ వచ్చిన లోపలి మనిషి ఊరుకోరుగదా! ఆ ఇద్దరూ కుమ్ముక్కయి కుట్ర చేయసాగారు. ఆ కుట్ర పేరే సృజనాత్మక శక్తి. ఇది నిద్ర లేవాలెగాని ఆ వ్యక్తిని బేచైన్ చేస్తుంది. లోపటి ద్వారాలు తెరిచి ప్రవేశించమంటుంది. ఒత్తిడి చేస్తుంది. కాగితాలు ముందరేసుకొని కలం పట్టుమంటుంది. పాపం! కృష్ణమూర్తి విషయంలో అదే జరిగింది. అప్పుడు ఆయన వయస్సు ఎంతలేదన్నా 68 సంవత్సరాలు. మనకు రౌండ్ ఫిగర్ మీద నమ్మకం ఎక్కువ కనుక 70 సంవత్సరాలు అనుకుందాం.

ఈ 70 ఏళ్ల వయసు నిజానికి సాధారణ రచయితల చేయగూడని పనులు చేసి, పాపపరిహారార్థం చేయవలసిన రచనలు చేసి రచనారంగం నుండి రిటైరయిపోయే వయసు. కాని కృష్ణమూర్తి ఫైలు ఉల్టా సాగింది. అందరూ నిష్క్రమించే వయసులో వారు పైలా పచ్చీసు ఉత్సాహంతో అరంగేట్రం చేశారు. అందుకే ఆయన అసాధారణ వ్యక్తి. ‘ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో’ అని ఎవరో చేసిన పేరడీ గారడి చేసింది. ఫలితంగా వారి కలం నుండి మూడు నవలలు, నాలుగు కథాసంపుటాలు, ఒక యత్రా చరిత్ర వెలువడ్డాయి.

నా దృష్టిలో నవలలు రాసే చాలా మంది స్వీయ చరిత్రకారులే. కుటుంబరావు, గోపీచంద్ వంటి వారు తామూ చేసిన రచనల్లో నిజజీవితంలో తెలిసిన వ్యక్తులు పాత్రలుగా ఉన్నారని చెప్పుకున్నారు. ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ నవల కథానాయకుడు ఎవరోకాదు ఆళ్వారుస్వామే అన్నవాళ్లున్నారు. అలాగే కృష్ణమూర్తి నవలలు, కథల్లో స్వీయ జీవితానుభవాలు బలంగానే ఉన్నాయి. ఎల్డీసీ, యూడీసి, తహసీల్దార్ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తనకో తన సహోద్యోగులకో సంభవించిన అనుభవాలు తప్పకుండా వారి రచనల్లో ఉండి ఉంటాయి. ఇందుకు ప్రధానకారణం కృష్ణమూర్తి గారు మానవ సంబంధాలకు విలువ ఇవ్వటమే. వారు సాటి మనుషుల కష్టసుఖాలకు, ఆత్మీయతలు దూరం కాలేదు.

సాహితీ పాఠకుడిగా ఉత్తమ సాహిత్యం చదువుతున్నప్పుడు ఆ పాత్రల్లో తనను తెలిసిన మనుషులను పోల్చుకోగలిగారు. తెలిసిన మనుషులలోని జీవలక్షణాలను తన మనసులో రికార్డు చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా రచయితగా రూపొందుతున్నక క్రమంలో నవలలు, కథానికల్లోని పాత్రలలో ఈ లక్షణాలు ప్రాణం పోసుకున్నాయి. అందుకే అవి కాల్పనిక పాత్రలుగా కాక, వాస్తవిక పాత్రలుగా రూపొందాయి. ఆ పాత్రలన్నీ అట్టడుగు వర్గాలకు, దిగువ మధ్యతరగతికి చెందినవే. తెలంగాణ సాహిత్యంలో బి.సి. చైతన్యంతో వాస్తవికతను పోషించిన రచయితగా భావితరాలు కృష్ణమూర్తి గారిని తప్పక గుర్తుంచుకుంటాయి. జీవితచిత్రణ, వాతావరణ చిత్రణ, తెలంగాణ భాష అన్న మూడు గొప్ప లక్షణాలు త్రివేణీ సంగమంగా వారి రచనలలో కనిపిస్తాయి. ఈ మూడింటికి ఆలంబనంగా పాత్రలు ఉండనే ఉన్నాయి.

కృష్ణమూర్తి కథనంలో ఒక విశేషముంది. అది ఆశుధోరణిలో ఆగకుండా కథనం చేయటం. ఇది జానపద ధోరణి. ఈ మౌఖికత వారి గ్రామీణ నేపథ్యం ఉన్న రచనలను మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. వారు కథను ‘చూపించే’ ప్రయత్నం కూడా చేస్తారు. తమ రచనలలోని పాత్రల స్థాయి ఉన్నవారే తమ పాఠకులు అయి వుండాలని కూడా వారి అభిమతమనుకుంటాను. ఇంకో ప్రధానమైన అంశం కృష్ణమూర్తి తెలంగాణ ఉద్యమంతో మమేకమైన వ్యక్తి. సాయుధ రైతాంగ పోరాటం విడిచివెళ్లిన సోయిలో సాంస్కృతికంగా పాటలు ముఖ్యమైనవి. వీరి తొలి నవల ‘ఊరు వాడ బతుకు’ నవలలో 60దాకా తెలంగాణ పాటలుండటం కృష్ణమూర్తి గారి సామాజిక రాజకీయ చైతన్యానికి గుర్తు. ఈ పాటలు నవలకు కొంత భావుకతను ప్రసాదించాయి. ఈ నవలలో ఒక పిల్లవాడే కథానాయకుడు.

అతని బాల్యం చుట్టూ, “ఊరుమ్మడి బతుకు చుట్టూ పద్మశాలీ వృత్తి చుట్టూ జీవితం తిరుగుతుంది. ‘తీరకుంట చేస్తే చాలకుంటాయె’ వంటి సామెతలలో శ్రమదోపిడీ కనిపిస్తుంది. చిన్న ఊరి నుంచి పెద్ద ఊరికి వచ్చినప్పుడు చిన్న కళ్ళకు పెద్ద దృశ్యాలు కనిపిస్తాయి. రైతాంగ పోరాట దృశ్యాలను రచయిత చూసింది ఈ కళ్ళతోనే. నల్లగొండ పోరాట గడ్డ కావటం, ఆ మట్టిలో పుట్టి పెరిగిన కృష్ణమూర్తిలో అభ్యుదయ విప్లవభావాలు రగలటం ఒక నైసర్గిక పరిణామం. భావుకమైన ప్రణయోద్వేగంతో సాగే రచనలకు వీరు దూరం. ‘కథలగూడు’ వారి రెండవ పుస్తకం. ఇందులోని కథలకు తెలిసిన జీవితమే పునాది. ఒక కథలో రహస్యదళంలో పనిచేసే పోరాటయోధురాలు ఉద్యమావసరాల కోసం తన కొడుకును వదులుకుంటుంది. ప్రాణాలకంటే ఉద్యమమే ముఖ్యం అనుకునే ఆ రోజుల్లో మూగరోదనతో పేగుబంధాన్ని తెంచుకోవటం ఒక లెక్క కాదు, ఇట్లాంటి ఉదంతాలు నిజజీవితంలో అప్పట్లో ఎన్నో జరిగాయంటూ కమలమ్మ అనే యువతిని డా.దేవకీదేవి తమ ‘తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం’లో పేర్కొన్నారు.

‘మాయాత్ర’ ఒక చిన్నపాటి యాత్రా చరిత్ర. దైవక్షేత్రాలను, చారిత్రక స్థలాలను సందర్శించే సందర్భంలో రచయిత ఏమీ వ్యాఖ్యానించకుండా తటస్థంగా ఉంటాడు. మౌంట్ అబూ వెళ్లే తోవలో అడవి దొంగలు వాళ్ళ బ్యాగులను ఎత్తుకుపోతే యాత్రికులంతా కట్టుబట్టలతో మిగిలిపోతారు. అనూహ్యంగా జీవితంలో తటస్థించే పరిస్థితులను, పరిణామాలను ఇట్లాంటి ఉదంతాలు తెలియజేస్తాయి.

‘తారుమారు’ కథాసంపుటిలో మంచికథలు అనేకం ఉన్నాయి. కుటుంబ సంబంధాల్లో వస్తున్న మార్పుల చిత్రీకరణ కూడా ఈ కథల్లో కనిపిస్తుంది. తండ్రులుఅత్యవసరాలు ఏర్పడ్డప్పుడు మాత్రమే ఆస్తులను అమ్మాలనుకుంటే, వెంటనే వాటిని అమ్మి నగదును పంచి ఇవ్వాలని కొడుకులు కోరుకుంటారు. దీన్ని తరాల మధ్య అంతరంగా భావించవచ్చు. ‘తారుమారు’ అనే మరో కథలో పెద్దవాడు విద్యాధికుడు. వాడి తెలివితేటల మీద తల్లిదండ్రులకు మంచి అభిప్రాయం ఉంటుంది. చిన్నవాడు శ్రమజీవి. ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టుకునే రకం. కాలక్రమంలో పెద్దవాడు జీవితంలో దెబ్బతింటాడు. చిన్నవాడే వాళ్లనందరినీ ఆదుకుంటాడు. శ్రమజీవి సంస్కారాన్ని, శ్రమకున్న విలువను నిదర్శనపూర్వకంగా చెప్పిన కథ ఇది. సమాజం దొంగలుగా ముద్రవేసిన ‘మొండి’ కులానికి చెందిన వారి జీవిత చిత్రణ ‘బయటిగుడిసెలు’, ఈ కులంవాళ్ళు సంచార జాతుల వాళ్ళు.

అట్టడుగు వర్గానికి చెందినవాళ్ళ భిన్న ప్రవృత్తులను బాగా అర్థం చేసుకున్న సాహసులే ఎన్నుకోవలసిన వస్తువు. సంచార జాతులవాళ్ళు వ్యవస్థతో ఎపుపడూ ఘర్షణకు లోనవుతుంటారు. కథానాయకుడు తన కుటుంబంతో సంచారజీవితం గడుపుతూ సంపాదించిన అనుభవాలు, ఆయన ఆయన సాటివాళ్ళు అనుభవించిన శిక్షలు, పోలీసుల దౌర్జన్యాలు చిత్రితమయ్యాయి. మూలికావైద్యం, చిట్కావైద్యం సహాయంతో వివిధ వ్యాధులను సంచారజాతుల వారు నయం చేస్తారని కృష్ణమూర్తి తెలియజేస్తున్నారు. ‘యక్షగానం’ మరో కథాసంపుటి. యక్షగానం కథలో ఊరి దొర యక్షగానం కళాకారుడైన దాసరి రామచంద్రాన్ని పిలిచితనకు కలలో మైసమ్మతల్లి కనిపించి గుడి కట్టించమని ఆజ్ఞాపించినట్లు చెప్పగానే గుడి నిర్మాణానికి సంబంధించిన ప్రచారం జరిగిపోతుంది. గుడి కూడా వెలుస్తుంది. యక్షగాన కళాకారుల కుటుంబమే పూజలు నిర్వహిస్తుండటం వల్ల వాళ్లకో జీవిక ఏర్పడుతుంది. అయితే దొరవారి కుట్ర పారటంతో ఆయన పొలాల ధర బాగా పెరుగుతుంది! భూస్వామ్యం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మతవిశ్వాసాలను కూడా వాడుకుంటుందని రచయిత బలంగా చెప్పగలిగారు.

‘మూడుముక్కలాట’ రియల్ ఎస్టేట్ మాయాజాలం గూర్చి వివరంగా చెప్పిన నవల. డబ్బే ప్రధానమైనప్పుడు తక్కిన విలువలకు చోటుండదు. సర్వేల పేరుతో పాట్ల వైశాల్యం తగ్గించటం,డబుల్ రిజిస్ట్రేషన్లు, అడ్వాన్సు డబ్బులు వసూలు చేసుకొని పరార్ కావటం ఇంకా మోసగాడి తెలివి తేటలను బట్టి కొత్త కొత్త మోసాలు చోటుచేసుకుంటాయి. ఈ మూడు భాగాల నవలలో మొదటిభాగానికి శ్రీశైలం నాయకుడు. ఇతడు అధీర నాయకుడు. రెండవ భాగానికి నాయకుడు వెంకటాద్రి. ఇతడు సమర్ధుడే కాని అత్యాశాపరుడు. మూడవ భాగం జాన్‌ఖాన్ నాయకుడిగా సాగుతుంది. ఎత్తుకు పై ఎత్తులలో పెద్ద సంస్కారాన్ని ఈదుతుంటాడు. ఇతడు బతుకనేర్చినవాడు. వైవిధ్యంతోకూడిన మూడు పాత్రలతో సాగే నవల ఇది. కృష్ణమూర్తి మరో కథాసంపుటి ‘అవతలిగట్టు’ ముద్రణలో ఉంది. తమ మొదటి రచనతోనే రచయితగా నిలదొక్కుకొని కీర్తిప్రతిష్ఠలు సంపాదించినవారు ఎందరోలేరు. తమ తొలినవల “ఊరువాడ బతుకు’తో కీర్తి గడించినవారు కృష్ణమూర్తి. ఇప్పుడు వారి వయస్సు ఎనభై ఒకటి. ఇంకా 19ఏళ్ల ఆయష్షు వారి ఖాతాలో బాలెన్సు ఉంది. నాలుగు కాలాలపాటు నిలిచే మరో నాలుగు రచనలను వారి నుంచి ఆశించటం అత్యాశకాదనుకుంటా.
(దేవులపల్లి కృష్ణమూర్తి గారికి 81 ఏళ్లు నిండిన సందర్భంగా..)

                                                                                  అమ్మంగి వేణుగోపాల్
                                                                                   9441054637

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News