Tuesday, May 30, 2023

ఉన్నత పదవులు – ఊడిగం

- Advertisement -
- Advertisement -

DGP Gupteshwar pandey joins in JDU

 

కొన్ని పరిణామాలు ‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగే’ మాదిరిగా జరిగిపోతుంటాయి. లోకం తన దొంగ బుద్ధిని గమనించడం లేదని, అది కూడా కళ్లు మూసుకొనే ఉందని, పాలు తాగే పిల్లి అనుకుంటుందట. పాలకులైనా చట్ట విరుద్ధంగా వ్యవహరించినప్పుడు, జన హితానికి హాని తలపెట్టినప్పుడు చట్టం అవకాశం ఇచ్చినంత మేరకు దానిని అడ్డుకోవలసిన బాధ్యతతో కూడిన పదవుల్లోని వారు రిటైర్ కాగానే పాలకుల ప్రమేయంతో దక్కే ఉన్నత స్థానాలుగాని, పాలక పక్షంలో ప్రవేశంగాని పొందినప్పుడు ఆయా వ్యక్తులు పూర్వపు పదవుల్లో ఉండగా వాటికి అమ్ముడుపోయి ఉంటారని, తమ విధ్యుక్త ధర్మానికి వెన్ను పోటు పొడిచే ఉంటారని అనుమానించవలసి వస్తుంది. అలా అనుమానించే వారిని తప్పు పట్టలేని స్థితి నెలకొంటుంది. కొద్ది రోజుల క్రితం బీహార్ డిజిపి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న గుప్తేశ్వర్ పాండే ఆదివారం నాడు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సమక్షంలో పాలక జెడి(యు)లో చేరడం ఇటువంటి అనుమానానికే దారి తీస్తుంది. మూడు మాసాల వ్యవధి ఇస్తూ స్వచ్ఛంద పదవీ విరమణకు నోటీసు ఇవ్వవలసి ఉంటుంది.

గుప్తేశ్వర్ పాండే విషయంలో ఈ నియమం గాలికి పేలపిండి అయిపోయింది. నోటీసు ఇచ్చిన ఐదు రోజులకే ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించి పదవీ బాధ్యతల నుంచి విముక్తి కలిగించింది. నేరుగా పాలక పక్షంలో చేరిపోడానికి అది దారి ఇచ్చింది. డిజిపిగా ఉండగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఆత్మహత్య కేసులో పాండే రాజకీయ స్థాయి ప్రకటనలు చేసి అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించారు. ముంబైలో జరిగిన ఆత్మహత్యపై పాట్నాలో కేసు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ నేరుగా ముఖ్యమంత్రి నితీశ్‌ను విమర్శించిన సుశాంత్ సహచరి రియా చక్రవర్తిని తూలనాడుతూ ఆమెకంత స్థాయి లేదని పాండే విమర్శించారు. ముఖ్యమంత్రికి ఇందులో ఏమాత్రం ప్రమేయం లేదన్నారు. సుశాంత్ పై పాట్నాలో కేసు నమోదు బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి బీహారీల అభిమానం చూరగొనడం కోసమే ఈ కేసు నమోదు జరిగిందని భావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ కేసులో సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్లను కూడా ప్రయోగించిందనే అభిప్రాయం ఏర్పడింది.

అంతకు ముందు బీహార్‌లో జరిగిన ఓ మూడు హత్యల కేసులోనూ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌పై పాండే పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో పాలక పక్షం తరపున టిక్కెట్ ఆశించి పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఒకసారి బక్సర్ అసెంబ్లీ స్థానం టిక్కెట్‌ను ఆశించి ఆయన స్వచ్ఛందంగా ఐజిపి పదవి నుంచి తప్పుకున్నారు. ఆ టిక్కెట్టు లభించే అవకాశాలు సన్నగిల్లడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అండదండలతో తిరిగి ఆ పదవిలో చేరిపోయారు. ఇంతగా పాలక పక్షంతో పెనవేసుకుపోయిన వ్యక్తి రాష్ట్ర పోలీసు అధిపతిగా పరిమితులు మీరిపోయి పాలకుల ప్రయోజనాలకు ఊడిగం చేసి ఉంటారని అనుకోడాన్ని ఆక్షేపించలేము. ఉన్నత పదవుల్లోని వారు తమ చేతిలోని అధికారాలను ‘నీకిది నాకది’ పద్ధతిలో దుర్వినియోగం చేయడం ప్రజాప్రయోజనాలకు ఎంతటి ప్రమాదకరమో చెప్పనక్కర లేదు. ఇటువంటిదే మరో సందర్భం దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు రేకెత్తిస్తూ జరిగిపోయింది.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేసిన వెంటనే రాజ్యసభ సభ్యులుగా నియమితులు కావడం కూడా తీవ్ర సందేహాలకు తావిచ్చింది. న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని మంటగలిపారనే అభిప్రాయం కలిగేలా చేసింది. గొగోయ్ అధ్యక్షతన గల ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చిరకాల చిక్కుముడిగా సాగిన అయోధ్య స్థల వివాదం కేసును ఆగమేఘాల మీద పరిష్కరించి వేసిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణ ట్రస్టుకు అప్పగించడానికి ఆ తీర్పు మార్గం సుగమం చేసింది. ఆ తీర్పు అత్యంత తులనాత్మకమైనదని, చరిత్రాత్మక మైనదని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అఖిల భారతీయ కార్యకారీ మండల్ బైఠక్ కొనియాడింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గొగోయ్ రాజ్యసభ సభ్యులయ్యారు. అసోంలో లక్షలాది మందిని భారత పౌరసత్వానికి దూరం చేసిన జాతీయ పౌరసత్వ చిట్టాను దేశ భవిష్యత్తుకు ప్రధాన ప్రాతిపదిక పత్రం అంటూ రంజన్ గొగోయ్ కీర్తించడమూ వివాదాస్పదమైంది.

రాజ్యసభ సభ్యత్వం మీద కన్నుతోనే ఆయన కేంద్రంలోని పాలక పక్ష ప్రయోజనాలకు అనుగుణంగా సుప్రీంకోర్టును నడిపించారనే బాధాకరమైన అభిప్రాయం నెలకొన్నది. మొత్తం సుప్రీంకోర్టు తీసుకుంటున్న నిర్ణయాలే వివాదాస్పదమైన సంగతి ఇటీవల ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కార వ్యాజ్యం వెలుగులో చర్చనీయాంశమైంది. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినా లోకం మాత్రం కళ్లు మూసుకోదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News