Friday, March 29, 2024

ఏప్రిల్ నుంచి ‘ధరణి’ వెబ్‌సైట్

- Advertisement -
- Advertisement -

Dharani website

 పరిగిలో సంవత్సరకాలంగా ట్రయల్న్ విజయవంతం
రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సమాయత్తం

హైదరాబాద్ : రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ఒకేచోట పొందేందుకు వీలుగా రూపొందిస్తున్న ధరణి వెబ్‌సైట్ స్టాఫ్‌వేర్ రూపకల్పన ఓ కొలిక్కి వచ్చింది. ఏప్రిల్ నుంచి దీనిని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. పరిగి మండలాన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్న ప్రభుత్వం ‘ధరణి’ వెబ్‌సైట్ ఆధారంగా సంవత్సరకాలంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తుంది. అక్కడ రోజుకు 20 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా అందులో 8 రిజిస్ట్రేషన్లు వ్యవసాయ భూములకు సంబంధించినవే. అయితే సంవత్సరకాలంగా ఇక్కడ చేస్తున్న (ధరణి) రిజిస్ట్రేషన్లు సత్ఫలితాలు ఇస్తుండడంతో ఏప్రిల్ నుంచి ఈ విధానాన్ని అన్ని మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. అయితే రిజిస్ట్రేషన్‌ల విషయంలో పరిగిలో సక్సెస్ అయిన మ్యుటేషన్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు గుర్తించారు. వాటిని కూడా మార్చిలోపు సరిచేసి ఏప్రిల్ నెలాఖరులోగా దీనిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టుగా సమాచారం.

రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మ్యుటేషన్‌కు అవసరం లేకుండా..

‘ధరణి వెబ్‌సైట్’ ప్రారంభం అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి అవసరం ఉండదు. మన ఇంటికే పాసు పుస్తకం వచ్చేలా దీనిని డిజైన్ చేశారు. అయితే పరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిన తరువాత తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని అధికారులు గుర్తించారు. ఆ సమస్యలను ఇప్పటికే రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాటి పరిష్కారానికి అధికారులు సిద్ధమయ్యారు.

కొత్తగా 443 మండలాల్లో తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ సేవలు భూముల మ్యుటేషన్ మొదలు, ఆన్‌లైన్ రికార్డుల వరకు ధరణి ప్రాజెక్టు ప్రారంభమయితే చాలావరకు రైతులతో పాటు మిగతా వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తోడు, కొత్తగా 443 మండలాల్లో తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. దీంతోపాటు 125 కొత్త మండలాల్లో భవనాల కొరత, విలువైన డాక్యుమెంట్లు, పత్రా లు, స్ట్రాంగ్ రూంలను నిర్మించాల్సి ఉంది. ధరణి ప్రాజెక్టు ప్రారంభ అయిన తరువాత నిర్వహణకు సం బంధించి ప్రైవేటు సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం ఓ ఆలోచనకు వచ్చినట్టుగా తెలిసింది.

తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలను ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినా కొన్ని కారణాల వలన అది సాధ్యం కాలేదు. అయితే ధరణి వెబ్‌సైట్ ప్రారంభమయిన తరువాత తహసీల్దార్లకు కూడా రిజిస్ట్రేషన్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 20కి పైగా మండలాల్లో తహసీల్దార్లు సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రిజిస్ట్రేషన్ బాధ్యతల్లో తహసీల్దార్లు సక్సెస్ కావడంతో ధరణి ప్రారంభం అనంతరం సబ్ రిజిస్ట్రార్‌లు లేని మండలాల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల వివరాలు నమోదు

భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం మాభూమి వెబ్‌సైట్ నుంచి భూముల వివరాలను తొలగించారు. భూ రికార్డుల ప్రక్షాళన జరగడంతో కొత్తగా ధరణి వెబ్‌సైట్‌లో డిజిటల్ సంతకాలతో ధ్రువీకరించిన రికార్డులను తాత్కాలికంగా వెబ్‌సైట్‌లో పెట్టారు. తాజాగా మిగతా జిల్లాల రికార్డులను తొలగించి ధరణి సాఫ్ట్‌వేర్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతున్న రికార్డులను ఆ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తుండడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల వివరాలు ఆ వెబ్‌సైట్‌లో నమోదు అవుతున్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.

రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ఒకే సాఫ్ట్‌వేర్ కిందకు

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రోజుకు ఐదు నుంచి ఆరువేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ధరణి వెబ్‌సైట్ అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ఒకే సాఫ్ట్‌వేర్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన. ప్రయోగాత్మకంగా 10 మండలాల్లో దీనిని అమలు చేసి, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను అధికారులు అధ్యయనం చేశారు. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రత్యేకంగా ఉన్న వెబ్‌సైట్ ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు ఉన్న వెబ్‌ల్యాండ్ స్థానంలో ధరణి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన రికార్డుల రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఒక్కో మండలానికి ఒక్కో ఐటి నిపుణుడు

గతంలో మాభూమి వెబ్‌సైట్‌లో హైదరాబాద్ పరిసర జిల్లాలకు సంబంధించిన సేత్వార్, నక్షా (మ్యాప్) వివరాలు అందుబాటులో ఉండేవి. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం మాభూమి వెబ్‌సైట్ నుంచి వాటిని తొలగించారు. కొత్తగా ధరణి వెబ్‌సైట్‌లో డిజిటల్ సంతకాలతో ధ్రువీకరించిన రికార్డులను ఆ వెబ్‌సైట్‌లో పెట్టారు. కౌలు, రుణ, అర్హత కార్డులు, భూ యజమాని, ఖాతా నెంబర్, సర్వే నెంబర్, మొత్తం విస్తీర్ణం, ఎన్నేళ్లుగా పొజిషన్‌లో ఉన్నారు, వాటిలో ఏ పంట వేస్తున్నారు, ఆ భూమికి ఉన్న నీటి వసతి, వాటిపై ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలను ఒక్కో మండలానికి ఒక్కో ఐటి నిపుణుడు ఎప్పటికప్పుడు ఆయా లెక్కలను ఈ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నారు.

Dharani website from April 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News