Home కెరీర్ పెన్సిల్ ఆర్ట్ కి రాష్ట్రపతి ఫిదా

పెన్సిల్ ఆర్ట్ కి రాష్ట్రపతి ఫిదా

Dhiraj did not break his art,mother, father Hit

చిన్నపిల్లలకు చాక్‌పీస్‌ను ఇస్తే తినేస్తుంటారు. ఇంకొందరు బోర్డుపై ఏవేవో పిచ్చి రాతలు రాస్తుంటారు…. కానీ హైదరాబాద్‌కి చెందిన ఒక అబ్బాయి మాత్రం 5వ తరగతిలో ఉన్నప్పుడే చాక్‌పీస్‌పై మహాత్మాగాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్రోద్యమకారుల చిత్రాలు వేస్తుండేవాడు. అమ్మ ఎంత తిట్టినా, నాన్న కొట్టినా కూడా తన కళను విడవలేదు ధీరజ్. అలా ఆ కళలో కృషిచేసి ఏకంగా రాష్ట్రపతి బొమ్మను వేసి ఆయన చేత అవార్డు అందుకుని శెభాష్ అనిపించుకున్న ధీరజ్‌ను యువ పలకరించింది. 

హైదరాబాద్‌కి చెందిన చంద్రశేఖర్, లక్ష్మీ దంపతుల పుత్రుడు ధీరజ్. ఇబ్రహీంపట్నంలోని ఎవిఎన్ ఐఇటి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేసాడు. మైక్రోఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చిన్నప్పుడు చాక్‌పీస్‌లపై బొమ్మ లు వేస్తుండేవాడు. క్రమంగా పెన్సిల్స్‌పై చిత్రాలు వేయడం నేర్చుకున్నాడు.ఈ క్రమంలో తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆర్ట్‌ని పోస్ట్ చేశాడు. విపరీతంగా లైక్స్, కామెంట్స్ రావడం మొదలయ్యాయి. అలా తనకు ఏదో తెలియని ఆనందంగా ఉండేది. ఇంకా మంచి మంచి చిత్రాలను వేయాలని అనుకుని పెన్సిల్‌పై రోజుకో కొత్త రకమైన పేర్లు రాయడం, బొమ్మలు వేయడం చేసేవాడు. అలా చేసిన వాటిని సోషల్ మీడియాలో పెట్టేవాడు.

ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లోవారు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోతే తిడుతుంటారు. అలాంటి పరిస్థితులు ధీరజ్‌కి కూడా ఎదురయ్యాయి. ఇంట్లో పెన్సిల్ ఆర్ట్ చేసే సమయంలో డస్ట్ వస్తుండేది. ఇంక అమ్మనాన్నలు కూడా కెరియర్‌పై దృష్ట్టి పెట్టుకో ఇలాంటి పనులు వద్దనే వారు. అయినా ధీరజ్ తన కళను కొనసాగించేవాడు. కానీ ఇప్పుడు తాను చేసిన మైక్రోఆర్ట్‌కి విశేష స్పందన వస్తుండటంతో కుటుంబసభ్యులు కూడా ఆనందంగా ఉన్నారు. ధీరజ్‌కి ఎలాంటి గురువు లేడు. సోషల్‌మీడియాలో రష్యా, చైనాకి చెందిన కొందరు మైక్రోఆర్టిస్టులను స్ఫూర్తిగా తీసుకున్నాడు. పెన్సిల్ ఆర్ట్ కు సంబంధించి కాలేజీల్లో, స్కూల్స్‌లో వర్క్‌షాప్‌లు నిర్వహించాడు. ఇప్పటి వరకు బెంగళూరు వంటి నగరాల్లో తన ప్రదర్శనలను ఇచ్చాడు. కేవలం ఆర్ట్ అని కాకుండా సోషల్ మీడియాపై అవగాహన ఉండడంతో తనకు ఉన్న స్నేహితులకు మిగతావారికి సోషల్ అవేర్‌నేస్ ప్రోగ్రాంలు చేస్తుంటాడు. ప్రస్తుతం చదువుకుని ఉద్యోగం లేక ఉండేవారు, చదువుకునే ఆర్థిక సోమత లేని వారు, ఇంట్లో ఉండేవారి కోసం తను ఈ ప్రోగ్రాంలు చేస్తుంటాడు. కాలేజీల్లో విద్యార్థులకు గెస్ట్ లెక్చరర్‌గా వెళ్లి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేస్తుంటాడు.

రాష్ట్రపతి నుంచి అవార్డు….. రాష్ట్రపతికి రాంనాథ్ కోవింద్ చిత్రాన్ని వేసి ఆయనకే బహుమతిగా అందించాడు. కేవలం ఒక్క రోజులో రాత్రి ట్రైన్‌లో వెళ్తూ తయారు చేశాడు. ధీరజ్‌కి జాగృతియాత్రలో (8000 కి.మీ ) పాల్గొనాలని చాలా కోరిక. దాని కోసం రెండు సంవత్సరాల నుంచి అప్లై చేసుకున్న తనకు అవకాశం లభించలేదు. అందులో మొత్తం 500 సభ్యులు 60,000 ఫీజు కట్టాల్సి ఉంటుంది. కానీ ఒక రోజు వారి నుంచి ధీరజ్‌కు ఆహ్వానం లభించింది. తన మైక్రోఆర్ట్‌ని చూసి వారు తనను గెస్ట్‌గా పిలిచారు. వారితో రాష్ట్రపతిని కలిశాడు. రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు. అంతే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి, మంత్రి కెటిఆర్ నుంచి ఆవార్డులు కూడా పొందాడు. సినిమా రంగంలో కూడా చాలా డైరెక్టర్స్‌కి, హీరో హీరోయిన్స్‌కి కూడా తను చేసిన పెన్సిల్ ఆర్ట్‌ని బహుమతిగా ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రత్యేకంగా ఉండే ప్రాంతాలను పెన్సిల్ ఆర్ట్‌గా వేసి ముఖ్యమంత్రి గారికి బహుమతిగా ఇవ్వాలనేది తన కోరిక అంటున్నాడు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో పెన్సిల్ ఆర్ట్‌లను రూపొందించాడు.

ధీరజ్ వాడే పెన్సిల్స్ చాలా వరకు మనం వాడేవే. కొన్ని మాత్రం విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. ఎవ్వరికైనా ఇలాంటి ఆర్ట్ నేర్చుకోవాలనే కోరిక ఉంటే వారికి ఉచితంగా నేర్పిస్తుంటాడు. ఎవరికైనా కావాలనుకునే వారికి ఆర్డర్‌పై కూడా చేస్తుంటాడు. వాటి ధర ఎన్ని తీసుకుంటున్నారో దానిపై ఆధారపడివుంటుంది.

ఆకలి తీర్చేందుకు పుట్టుకు వచ్చిందే.. ‘షేర్ ఏ మీల్’ …… ధీరజ్ లో ఎంతటి టాలెంట్ ఉందో అంతే స్థాయిలో సమాజం పట్ల ప్రేమ కూడా ఉంది. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క షేర్ ఏ మీల్ పేరుతో ఇప్పటికీ 350 రోజుల నుండి ప్రతిరోజూ ఒకరికి భోజనాన్ని అందిస్తున్నాడు.

మిత్రుడు మేఘరాజ్ ఆనంద్‌తో కలిసి ధీరజ్ ‘షేర్ ఏ మీల్’ కి పునాది వేశారు. పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పడిన ఓ స్వచ్ఛంద సంస్థ.. ప్రభుత్వ నిధులు అవసరం లేదు.. సహాయం చేయాలనే మనసుంటే చాలని నిరూపించారు.. తామే స్వయంగా వంట చేసి దానిని ఆకలితో అలమటిస్తున్న వారికి రోజుకొకరికి అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక సంవత్సరం నుంచి ఈ ప్రాజెక్టును నిర్విరామంగా నిర్వహిస్తున్నారు.

ప్రతి రోజు పాకెట్‌మనీతో ఒకరికి ప్లేట్ మీల్స్ ఇచ్చి అలా ఇచ్చిన సమయంలో వారితో ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు వీరు. అలా పెట్టిన ఫొటోలను వారి స్నేహితులకు ఛాలెంజ్‌గా విసురుతారు. వారు కూడా ఇలా చేసి వారి ఫేస్‌బుక్‌లో పెట్టడం ద్వారా ఇది ఇప్పుడు ఒక ఉద్యమంగా మారిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ధీరజ్. ఇప్పటి వరకు ఆ ఛాలెంజ్‌ని వందల సంఖ్యల మంది స్వీకరించి చాలా మంది ఆకలిని తీర్చారు.

                                                                                                                                              -విష్ణు కాసోజు