Home తాజా వార్తలు భారత్‌కు ఎదురుదెబ్బ

భారత్‌కు ఎదురుదెబ్బ

శిఖర్ ధావన్‌కు గాయం
లండన్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయానికి గురయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. కాగా, ధావన్ గాయానికి మంగళవారం బిసిసిఐ అధికారులు స్కానింగ్ చేయించారు. వైద్య పరీక్షల్లో ధావన్ ఎడమ చేతి బొటన వేలుకు గాయమైందని తేలింది. గాయం తీవ్రంగా ఉండడంతో ధావన్‌కు కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ప్రపంచకప్ మిగతా మ్యాచుల్లో ధావన్ ఆడడం ప్రశ్నార్థకంగా మారింది. ధావన్ దూరమైతే ఆ లోటును పూడ్చడం చాలా కష్టమని చెప్పాలి. ఐసిసి టోర్నీల్లో, ముఖ్యంగా ఇంగ్లండ్‌లో ధావన్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో అతని సేవలు అందుబాటులో లేకుండా పోతే జట్టుకు తీవ్ర నష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ధావన్ మెరుపు శతకం సాధించాడు. సహచరుడు రోహిత్ శర్మతో కలిసి సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ధావన్ ఈ మ్యాచ్ ద్వారానే మళ్లీ గాడిలో పడ్డాడు. అనుకోకుండా అదే మ్యాచ్‌లో గాయానికి గురి కావడంతో జట్టుకు దూరంకాక తప్పని పరిస్థితి నెలకొంది. ధావన్ సేవలు కోల్పోవడంతో భారత్‌కు ఇబ్బందికర పరిణామంగా మారింది. వన్డేల్లో ధావన్ మెరుగైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ధావన్ ఒకడు. రోహిత్‌తో కలిసి భారత్‌కు ఎన్నో మ్యాచుల్లో శుభారంభం అందించిన ఘనత అతని సొంతం. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం జట్టుకు పెద్ద లోటుగా పరిణమించింది.
ఇంగ్లండ్‌లోనే..
ఇదిలావుండగా గాయానికి గురైన ధావన్ జట్టుతో పాటు ఇంగ్లండ్‌లోనే ఉంటాడని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తమ పర్యవేక్షణలో అతను జట్టుతో పాటే ఇంగ్లండ్‌లోనే ఉంటాడని, స్వదేశానికి పంపే ప్రసక్తే లేదని బిసిసిఐ పేర్కొంది. గాయానికి గురైన ధావన్ కనీసం రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందడని బిసిసిఐ తెలిపింది. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. గాయం తీవ్రతను కొన్ని రోజులపాటు వైద్యులు పర్యవేక్షిస్తారని, అ తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని బిసిసిఐ స్పష్టం చేసింది.
రిషబ్‌కు చోటు?

Rishabh pant
కాగా, గాయం బారీన పడిన ధావన్ స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటన వెలువడక పోయినా ధావన్‌కు బదులు పంత్ జట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంబటి రాయుడితో పోల్చితే ధావన్‌వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. గవాస్కర్, గంగూలీ, మంజ్రేకర్ వంటి మాజీ క్రికెటర్లు రిషబ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం రాయుడిని ఎంపిక చేయడమే ఉత్తతమమని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులు మాత్రం రిషబ్‌కే అనుకూలంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే పంత్ ఇంగ్లండ్‌కు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Dhawan to stay in England under observation: BCCI