Home ఎడిటోరియల్ హాకీ మహామాంత్రికుడు

హాకీ మహామాంత్రికుడు

Dhyan-Chandభారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచ మంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళిన ఘనత మేజర్ ధ్యాన్‌చంద్‌దే. ఆయన జన్మదినమైన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అయితే జాతీయ క్రీడా దినోత్సవం గురించి చాలా మందికి తెలియదు. ధ్యాన్‌చంద్ చరిత్ర, హాకీ క్రీడలో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చటం ద్వారా బాల, బాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుంది. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలను సునాయాసంగా చేజిక్కించుకోవచ్చునని అతడి జీవితం విపులంగా తెలియజేస్తుంది.

ధ్యాన్‌చంద్ ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1905లో ఆగస్టు 29న జన్మించారు. ఆయన చిన్నతనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. హాకీ స్టిక్ అతని చేతిలో మంత్రదండగా మారిపోతుంది. బంతిపై నియంత్రణ, అద్భుత చాతుర్యం, అసాధారణ నైపుణ్యం, ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‌చంద్‌ను హాకీ మాంత్రికుడిగా చేశాయి. 1920లో బెల్జియలో జరిగిన ఒలింపిక్స్ లో భారత జట్టు హాకీ క్రీడలో పాల్గొంది. 1928లో ఆమ్‌స్టర్‌డాంలో జరిగిన పోటీలలో భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించింది. 1936లో లాస్ ఎంజిల్స్ లో జరిగిన పోటీలో అమెరికాపై ధ్యాన్‌చంద్ 9 గోల్స్ చేసి గెలిపించారు. ధ్యాన్‌చంద్ ఆటకు ముగ్ధుడైన జర్మనీ నియంత హిట్లర్ ధ్యాన్ చంద్‌కు జర్మనీలో కల్నల్ హోదా ఇస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్ చంద్ తన మాతృదేశాన్ని వీడనని చెప్పటం అతడి దేశభక్తికి నిదర్శనం.

ప్రపంచ హాకీలో ‘ది విజార్డ్’, ‘మెజిషియన్’ గా ధ్యాన్ చంద్ గుర్తింపు పొందాడు. ధ్యాన్‌చంద్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 1948 లో ఆడాడు. తన అంతర్జాతీయ హాకీ కెరీర్‌లో 400 కు పైగా గోల్స్ ను నమోదు చేశాడు. క్రీడా రంగంలో ధ్యాన్‌చంద్ చేసిన కృషికి ప్రభుత్వం 1956 లో భారతీయ మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది. జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యం క్రీడల ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కల్పించడం, ఆటల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడం. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు దేశంలోని అన్ని విద్యాలయాలు, స్పోర్ట్స్ అకాడమీల్లో ఘనంగా నిర్వహిస్తారు. హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, మారథాన్స్, బాస్కెట్‌బాల్ వంటి వివిధ రకాల పోటీలను నిర్వహించి గెలిచిన వారికి ప్రోత్సహకంగా బహుమతులను అందజేస్తారు.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డులను క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అందజేస్తారు. క్రీడా రంగంలో ఎంతో కృషి చేసిన రిటైర్డ్ ఆటగాళ్లకు ‘ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డును అందజేస్తారు.ధ్యాన్ చంద్ స్ఫూర్తితో అనేక మంది మన క్రీడా యవనిక మీద మెరిసిపోతున్నారు. 1964 జూన్ 27 న జన్మించిన పిటి ఉష పరుగుల పోటీల్లో 4 స్వర్ణాలను, 1 కాంస్య పతాకాన్ని భారత్‌కు సాధించిపెట్టి ‘పరుగుల రాణి’గా గుర్తింపు పొందింది. క్రికెట్ దేవుడిగా ఆరాధించబడే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోని పలు రికార్డులను తన వశం చేసుకున్నాడు. ఎంతో సౌమ్యుడు, గుణవంతుడిగా పేరు పొంది అద్భుత క్రీడా నైపుణ్యం కలిగిన సచిన్ తన తర్వాతి తరాలకు చక్కని మార్గదర్శకుడయ్యారు.

100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్సమెన్‌గా, వన్డేల్లో మొదటిసారిగా 200 పరుగులు సాధించిన క్రికెటర్‌గా సచిన్ గుర్తింపును పొందాడు. కొన్ని వందల సంఖ్యలో రికార్డులను తిరగరాసి కొన్ని సంవత్సరాలు ప్రపంచ క్రికెటును శాషించాడంటే అతిశయోక్తి కాదేమో. పివి సింధు 2016 సమ్మర్ ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్‌ను సాధించిన తొలి మహిళా షట్లర్‌గా గుర్తింపును పొందిం ది. 2018లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించింది. వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో 2013, 2014లో కాంస్య పతకాలు గెలుపొందిన సింధు.. ఆ తర్వాత 2017, 2018లో రజతాలు చేజిక్కించుకుంది. 2019లో వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచింది. ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆద్యుడు, అవకాశాల సృష్టికర్త మాత్రం ధ్యాన్ చంద్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు.

dhyan chand magician of hockey

* కాళంరాజు వేణుగోపాల్, 8106204412