Tuesday, February 7, 2023

ఆహార నియమాలతోనే డయాబెటిస్ నియంత్రణ

- Advertisement -

Diabetes

 

రుచిలో మార్పు తెలీకుండా అలవాట్లు మార్చుకోవాలి
బరువు తగ్గడానికి వ్యాయామమే సరైన మార్గం
డాక్టర్ టిఎన్‌జి రాజేష్

హైదరాబాద్ : ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అత్యధికంగా పెరుగుతున్నదని.. నిశ్చలమైన జీవన శైలి, అధిక కార్బోహైడ్రేట్ల ఆహార అలవాట్లే ఇందుకు కారణమని స్టార్ హాస్పిటల్స్, డాక్టర్ టిఎస్‌జె రాజేష్ స్పష్టం చేశారు. ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డయాబెటిస్‌కి ప్రాథమిక కారణాలు, నివారణ, అందుబాటులో ఉన్న చికిత్స పద్ధతులు గురించి రాజేష్ తెలియజేశారు. డయాబెటిస్ వ్యాధి వల్ల శరీరంలో విడుదలయ్యే చెక్కరలు నిరోధించడానికి రోగులు చెక్కర తక్కువగా కలిగిన కఠినమైన ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పా మరోక మార్గం లేదని కచ్చితంగా చెప్పారు. డయాబెటిక్ రోగులకు అప్పటి వరకు అలవాటుపడిన ఆహారాలు తినకుండా వదులుకోవడానికి వారి మెదడు సహకరించదు, అందువల్ల సాధారణ ఆహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపడం వల్ల వారి వ్యాధి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు.

సాధారణ రుచులు అలవాటు పడిన నాలుకను ఒక పద్ధతి ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారపు రుచిని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. పాలిష్ చేసిన బియ్యం నుంచి బ్రౌన్ లేదా క్వినోవా రైస్ బియ్యానికి మారాలంటే 75 శాతం పాలిష్ రైస్, 25 శాతం బ్రౌన్, క్వినావో రైస్‌తో 10 నుంచి 20 రోజుల పాటు కలిపి తీసుకోవాలన్నారు. అయితే వాటిని విడివిడిగా ఉడికించి తీసుకోవాలని సూచించారు. అనంతరం 2 నుంచి 3 వారాల పాటు 60 శాతం తెల్ల బియ్యం, 40 శాతం బ్రౌన్ బియ్యం తీసుకోవాలన్నారు. ఆపై సగంసగం పాలిష్, బ్రౌన్ బియ్యం తీసుకుంటే..3 నుంచి 4 నెలల్లో తెల్లని పాలిష్ బియ్యం నుంచి బ్రౌన్ రైస్‌కు పూర్తిగా మారవచ్చని డాక్టర్ తెలిపారు. బ్రౌన్ రైస్ అందుబాటులో లేనప్పుడు చపాతీ వంటివి తీసుకోవడం మంచిదన్నారు. ఈ విధంగా చెయడం వల్ల రుచిలో మార్పు జరుగుతుందన్న భావన ఉండదని అన్నారు.

అల్పాహారంలో రాగితో తయారుచేసే ఇడ్లి, దోసలు తినడం ఉత్తమమని డాక్టర్ రాజేష్ తెలిపారు. రాగి పదార్ధాలలో ఇనుము, కాల్షియం, ప్రొటీన్, పొటాషియం అధికంగా ఉంటుందని తెలిపారు. అయితే, గుండె సంబంధిత రోగులు రాగి పదార్ధాలను వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు. గోధుమ రవ్వ ఉప్మా, పెసరట్టు, చపాతీ, గుడ్డు, దోసకాయ, టమోటాలు, కూరగాయలతో కూడిన శాండ్విచ్‌లు డయాబెటిక్ పేషెంట్‌లకు చాలా మంచిదన్నారు. దుంప మినహాయించి అన్ని కూరగాయాలు బయాబెటిక్ రోగికి చాలా మేలు కలిగిస్తాయన్నారు. బంగాల దుంప ఇష్టమైన వాళ్లు పైపొరను తీయకుండా ఉడికించి తీసుకోవచ్చని చెప్పారు. జామ, గ్రీన్ యాపిల్, పండిన బొప్పాయి, పుచ్చకాయలు, కమల, కివి, దోసకాయ, దానిమ్మ పండ్లు ఉపకారం చేస్తాయన్నారు. వాల్‌నట్స్, బాదం, పిస్తాలను నమలగలిగిన వారు తినవచ్చన్నారు.

డయాబెటిక్ రోగులు చెక్కర పదార్ధాలు తినకుండా ఉండలేరు, కనుక అందుకు బదులుగా బెల్లం, చెరుకు రసం, బెర్రీస్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్పెర్రీ వంటివి తీసుకోవచ్చన్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడమే కాకుండా వారానికి 2 గంటల 30 నిమిషాల వ్యవధి(చెమట పట్టినప్పటి నుంచి)లో శారీరక వ్యాయామం అవసరమన్నారు. బరువులు తగ్గడానికి వ్యాయామమే సరైన మార్గం ఇతరత్రా సులువైన మార్గాలు ఎంచుకోకూడదని కచ్చితంగా తెలిపారు. డయాబెటిక్ రోగులకు చికిత్సలో 60 శాతం మంచి ఆహారం, శారీరక శ్రమ ఉంటుందన్నారు. మిగిలిన 40 శాతం తగిన మందులపై ఆధారపడి ఉంటుందని టిఎన్‌జె రాజేష్ స్పష్టం చేశారు.

Diabetes control with Dietary Restrictions
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles