Home తాజా వార్తలు వినాయకుణ్ణి మట్టితో ఎందుకు చేయాలంటే

వినాయకుణ్ణి మట్టితో ఎందుకు చేయాలంటే

Did you know Why ganesha statue make with Clay

పూర్వకాలం వినాయక విగ్రహాన్ని మట్టితోనే చేయాలని చెప్పేవారు. చెరువుల్లోనూ, కుంటల్లోనో మట్టి తీసుకువచ్చి గణపతి ప్రతిమలు చేసేవారు. గ్రామపెద్దలు, ఊరి మతపెద్దలు వర్షాకాలానికి ముందే సమావేశమై మట్టి విగ్రహాల గురించి ఓ నిర్ణయం తీసుకునేవారు. ఊర్లోని ఆసక్తికల యువకులను, ఇతరులను పిలిచి మట్టి ప్రతిమలు చేసే పనిని అప్పగించేవారు. అంతే వారంతా చెరువుల్లోనూ, కుంటల్లోనూ మట్టి తవ్విపోగేసేవారు. వానాకాలం ఇంకా రాలేదు కనుక మట్టి తవ్వితీయడం తేలికయ్యేది. అలా ఒక క్రమపద్ధ్దతిలో మట్టి తీయడంతో కాలువులు, కుంటలు, చెరువుల్లో నీటినిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుని ప్రతిమల తయారీ వెనుక, చెరువులు, కాల్వల పూడికతీత పనులు చేసేవారు. ఆ రకంగా తీసిన తరువాత వానాకాలంలో వానలు పడ్డప్పుడు చెరువులు, కుంటల్లో నీళ్లు ఎక్కువగా నిల్వఉండేవి. నీటి నిల్వ సామర్థ్యం పెరిగేది. ఇలా నిలిచిన నీటిలో అధికభాగం ఆ ఊరి వ్యవసాయానికి, తాగునీటికీ, ఇతర అవసరాలకు ఉపయోగపడేది. పైగా, మట్టి వినాయకుల తయారీ వల్ల పూడికతీత పనులు కూడా పూర్తికావడంతో సహజంగానే భూగర్భజల మట్టం పెరిగేది. చెరువులు, కుంటల్లోని నీరు క్రమంగా భూమిలోకి ఇంకడంతో చుట్టూ ఉన్న గ్రామాల్లోకూడా భూగర్భజలం బాగా ఉండేది. ఎండాకాలంలో చెరువులు, కుంటలు ఎండిపోయినా, భూగర్భజలమట్టం పెరిగిన కారణంగా బావుల్లో నీరు ఉండేది. ఇంతటి పరమార్థంతో మట్టివినాయకుల తయారీకి పూనుకునేవాళ్లు. ఒక్క మాటలో చెప్పాలంటే, మట్టివినాయకుల తయారీ జలయజ్ఞంలో ఒక భాగమే అయ్యేది.