Home జాతీయ వార్తలు ఢిల్లీలో డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు

ఢిల్లీలో డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు

Diesel price to decrease by Rs 8.36 per litre

 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో డీజిల్ ధర గణనీయంగా తగ్గింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గించడంతో గురువారం రాష్ట్రంలో డీజిల్ ధర లీటరుకు రూ. 8.36 తగ్గింది. డీజిల్‌పై ఉన్న వ్యాట్ లేదా అమ్మకం పన్నును 30శాతం నుంచి 16.75 శాతానికి తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఈ చర్య దోహదపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చే వ్యాట్ తగ్గింపు కారణంగా ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ. 73.64కు లభిస్తుంది.

ఢిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది మే 5న పెట్రోల్‌పై వ్యాట్‌ను 27 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌పై వ్యాట్‌ను 16.75 శాతం నుంచి 30 శాతానికి పెంచింది. దీంతో అప్పట్లో డీజిల్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరుకు రూ. 7.10 పెరగగా పెట్రోల్ ధర రూ. 1.67 పెరిగింది. అంతర్జాతీయ ముడి చమురు ధర పెరగడంతో ఈ పెంపు అనివార్యమైందని అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పొరుగున ఉన్న గురుగ్రామ్, నోయిడా, ఘజాయాబాద్ నగరాలతో పోలిస్తే ఢిల్లీలో డీజిల్ ధర అత్యధికంగా ఉంది. ఈ పెంపుదల కారణంగా స్థానిక పరిశ్రమలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. డీజిల్‌పై వ్యాట్ పెంపును ఉపసంహరించినట్లు ప్రకటించిన కేజ్రీవాల్ పెట్రోల్‌పై మాత్రం ఎటువంటి మార్పులు తెలియచేయలేదు.

Diesel price to decrease by Rs 8.36 per litre