Friday, April 26, 2024

రాజకీయ మసికి శిక్ష

- Advertisement -
- Advertisement -

Dilip Ray sentenced to three years in jail by CBI special court

 

ఒక బొగ్గు గనిని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌రేకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించడం రాజకీయ అవినీతిపరుల విషయంలో చట్టం అత్యంత అరుదుగా పని చేస్తున్న తీరుకు నిదర్శనమని భావించవచ్చు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు దిలీప్‌రే 1999లో ఈ కుంభకోణానికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో 21 సంవత్సరాల తర్వాత సోమవారం నాడు న్యాయస్థానం ఈ శిక్ష విధించింది.వెంటనే బెయిల్ కూడా లభించింది. దిలీప్‌రేతో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన మరి ఇద్దరు అధికారులకు కూడా మూడేసి సంవత్సరాల శిక్షను కోర్టు ప్రకటించింది. ఒడిశాకు చెందిన దిలీప్‌రే బొగ్గు శాఖ మంత్రిగా జార్ఖండ్‌లోని గిరిధిలో గల 105 హెక్టార్ల బ్రహ్మదిహ బొగ్గు బ్లాకును కాస్ట్రన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సిటిఎల్)కు కేటాయింప చేశారు. అంతకు ముందే తవ్వకం జరిపి విడిచిపెట్టిన ఆ గనిలో నీరు నిండి ఉందని, దాని నుంచి తిరిగి బొగ్గు తీయడం ప్రమాదకరమని కోల్ ఇండియా లిమిటెడ్ తన నివేదికలో స్పష్టంగా హెచ్చరించినప్పటికీ మంత్రి బేఖాతరు చేసి దానిని మంజూరు చేశారన్నది అభియోగం. నేరస్థ కుట్రకు, ప్రజావిశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడి కావడంతో ఈ శిక్షలు పడ్డాయి.

దేశంలో అధికార పదవుల్లోని నాయకుల నీతి, నిజాయితీ, నిబద్ధతలు బోనెక్కి చాలా కాలమైంది. ఓటర్లను డబ్బు, కానుకలతో లోబర్చుకోడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికవుతున్న ప్రతినిధులు అధికారం చేపట్టిన తర్వాత భారీ అవినీతికి పాల్పడి అపరిమితంగా వెనకేసుకుంటున్నారనే అభిప్రాయం స్థిరపడిపోయింది. కాని ఎప్పుడోగాని అటువంటి ఉదంతాలు తగిన ఆధారాలతో చట్టం దృష్టికి వెళ్లడం లేదు. అందుచేత అటువంటి వారికి శిక్షలు పడడం అరుదుగా గాని చోటు చేసుకోడం లేదు. ప్రస్తుత కేసులో నిందితులకు యావజ్జీవ శిక్షలు వేయాలని సిబిఐ వాదించింది. దేశంలో తెల్లచొక్కా నేరాలు మితిమించిపోతున్నాయని వాటిని నిరోధించాలంటే చట్టంలో సూచించిన గరిష్ఠ స్థాయి శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న బొగ్గు, ఇనుము తదితరాల గనులపై ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు కన్ను వేసిన సంగతి విదితమే. అయితే దేశాభివృద్ధి కోసం వాటిని కేటాయించేటప్పడు అక్కడ నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు, పర్యావరణానికి, అటవీ సంపదకు హాని కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ మేరకు కట్టుదిట్టమైన నియమాలతో గతంలో చట్టాలను కూడా చేశారు.

కాని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు మంత్రులను కూడా లోబర్చుకొని అక్రమంగా గనులు కేటాయింప చేసుకున్న ఉదంతాలు చాలానే జరిగి ఉండాలి. 20042009 మధ్య కేంద్ర ం జరిపిన బొగ్గు గనుల కేటాయింపులలో అసమర్థత రుజువవుతున్నదని టెండర్లను పిలిచి వేలం ద్వారా కేటాయించే అవకాశమున్న ప్పటికీ ప్రభుత్వం అలా చేయలేదని అందువల్ల రూ. 1556 బిలియన్ల నష్టం వాటిల్లిందని ఆమేరకు గనులు పొందిన పబ్లిక్, ప్రైవేటు రంగాల కంపెనీలు లాభపడ్డాయని 2012లో కాగ్ నివేదిక ఎత్తి చూపింది. రానురాను ప్రైవేటు రంగాన్ని మితిమించి ప్రోత్సహించే ధోరణి పరాకాష్ఠకు చేరుకున్నది. అందుకనుగుణంగా అనుమతులు, ఆంక్షల వ్యవస్థ పలచబడిపోయింది. కఠిన శిక్షలు పడినా రాజకీయ పలుకుబడితో కొందరు నేతలు దీర్ఘకాల పెరోల్ వంటివి పొంది జైలు జీవితం అనుభవించకుండా తప్పించుకోగలుగుతున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలాకు, ఆయన కుమారుడు అజయ్ చౌతాలాకు 2016లో పదేసి సంవత్సరాల శిక్షలు పడ్డాయి. కాని వారు అప్పటి నుంచి అనేక సార్లు ప్రత్యేక అనుమతులు పొంది జైలు బయటే గడపగలుగుతున్నారు.

కొన్ని వారాలు, మాసాల పాటు బయటకు వెళ్లడానికి అధికారులు అనుమతిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జననాయక్ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాలు గెలుచుకొని బిజెపి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత వీరికి ఈ వెసులుబాటు మరింతగా కలిగింది. మొత్తంగా రాజకీయ అవినీతి అంతమొందితేగాని ప్రభుత్వయంత్రాంగం క్షాళన కాదు. రాజును బట్టే ప్రజలూ అన్నట్టు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వంటి రాజకీయ పాలక సారథులు నీతిమంతులుగా ఉంటే ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులు, ఉద్యోగులు కూడా నైతిక ప్రవర్తనను అలవర్చుకుంటారు. దురదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్య వృక్షాన్ని మూలంలోనే రాజకీయ అవినీతి అనే పురుగు తొలిచివేస్తున్నది. ఈ దుస్థితి తొలగాలంటే చట్టాలు మరింత పకడ్బందీగా మారి పాలక అవినీతి ఉదంతాల్లో తరచూ శిక్షలు పడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News