Home తాజా వార్తలు నా కల నెరవేరింది

నా కల నెరవేరింది

పలు సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు దిల్ రాజు. 50 చిత్రాల నిర్మాణ ప్రయాణం ఆయనది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమాను నిర్మించి తన కల నెరవేర్చుకున్నారు దిల్ రాజు. శుక్రవారం ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా దిల్ రాజు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

Dilraju Interview about 'Vakeel Saab' Movie

బ్యూటిఫుల్ జర్నీ
పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చేయడంతో నా కల నెరవేరింది. ఈ సినిమా విజయం సాధిస్తే అప్పుడు ఇంకా సంతోషం కలుగుతుంది. బ్యూటిఫుల్ జర్నీ ఇది. ఈ చిత్రాన్ని ఫాస్ట్‌గా తీసి రిలీజ్ చేయాలని అనుకున్నాను. 2019 డిసెంబర్‌లో మొదలు పెట్టాం. 2020లో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ లాక్ డౌన్ రావడం వల్ల పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము.
మ్యాజిక్ జరుగబోతోంది…
‘తొలి ప్రేమ’ సినిమా సమయంలో నేను చూసిన పవన్ కళ్యాణ్ క్రేజ్, స్టార్‌డమ్ ఇవన్నీ నా మనసులో గట్టి ముద్ర వేశాయి. అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను. చివరికి ‘వకీల్ సాబ్’తో ఆ కోరిక తీరింది. ఈ సినిమా నా కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఒక మ్యాజిక్ జరుగబోతోంది అని ‘వకీల్ సాబ్’ బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది.
ఈ సినిమా చేయమని చెప్పా…
ఈ సినిమా కోసం ముందుగా ఇద్దరు, ముగ్గురు దర్శకులను అనుకున్నాం. అప్పటికే అల్లు అర్జున్‌తో శ్రీరామ్ వేణు ఓ సినిమా చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ సినిమాలు లాక్ డౌన్ వల్ల ముందుకు జరుగుతూ వచ్చాయి. అలా ఆ సినిమా లేట్ అవుతుంది కదా అని ‘వకీల్ సాబ్’ చేయమని చెప్పాం.
కత్తి మీద సాములాంటి ప్రాజెక్ట్…
‘పింక్’ కథను ఏమాత్రం మార్చకుండా హీరో ఇమేజ్‌కు తగినట్లు ‘వకీల్ సాబ్’ ఉంటుంది. ‘పింక్’ రీమేక్ అనగానే… ఇలాంటి సాఫ్ట్ సినిమా ఎందుకు అని చాలా మంది అడిగారు. మేము సినిమా చేస్తున్నాం కాబట్టి అందులో ఏముంటుందనేది మాకు బాగా తెలుసు. ఫార్ములా చెడిపోకుండా, పవన్ ఇమేజ్‌కు తగినట్లు శ్రీరామ్ వేణు కథనంపై బాగా కసరత్తు చేశాడు. హీరోయిజాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన సినిమా. కత్తి మీద సాము లాంటి ప్రాజెక్ట్ ఇది. దర్శకుడు చాలా బాగా చేశారు.
కొత్తగా ఉందని ఫీలవుతారు…
పవన్ కళ్యాణ్‌ను హీరో అనుకున్నప్పుడే సాంగ్స్‌ను, ఫైట్స్, ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేశాం. ఈ సినిమా చూశాక చాలా మంది తెలిసిన కథనే అయినా కొత్తగా ఉందని ఫీలవుతారు. ఎంజాయ్ చేస్తారు.
జాగ్రత్తగా ఉంటూ…
మాస్క్ ధరించి, శానిటైజ్ చేసుకొని సినిమాలు చూడమని చెబుతున్నా. మనకున్న ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. దాన్ని వదలిపెట్టి ఉండలేం. ఒక స్టార్ హీరో సినిమా చూడక 15నెలలు అవుతోంది. కొందరికి భయాలున్నాయి. చాలా మంది సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉంటూ సినిమా చూడమనేది మా విజ్ఞప్తి.
గొప్పగా సినిమా చేశాడు…
దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ సినిమాకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాకు ఎన్ని సెట్ అయినా చివరకు దర్శకుడే స్క్రీన్ మీదకు చూపించాలి. శ్రీరామ్ వేణు నేను కూడా ఊహించనంత గొప్పగా సినిమా చేశాడు. డబుల్ పాజిటివ్ చూసి ఈ సినిమా ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి. ఫైనల్ మిక్సింగ్ చూసి సూపర్ హిట్ అని చెప్పాను.
తదుపరి చిత్రాలు…
శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లోని సినిమా జూలైలో ప్రారంభమవుతుంది. ‘థాంక్యూ’ సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. రౌడీ బాయ్స్, పాగల్, థాంక్యూ, ఎఫ్ 3, చరణ్, శంకర్ సినిమాలు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌లో జెర్సీ, హిట్ సినిమాల రీమేక్‌లు చేస్తున్నాము. సల్మాన్ సోదరుడితో మరో రీమేక్ సినిమా ఉంటుంది. త్వరలో అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుంది. దీనికి శ్రీరామ్ వేణు దర్శకుడు.

Dilraju Interview about ‘Vakeel Saab’ Movie