Home జాతీయ వార్తలు ప్రభంజన’కరన్’

ప్రభంజన’కరన్’

tamil

తమిళనాడు ఆర్‌కెనగర్ ఉప ఎన్నికలో ‘అమ్మ’ను మించిన మెజారిటీతో అత్యద్భుత విజయాన్ని సాధించిన టిటివి దినకరన్
సుదూరంగా రెండవస్థానంలో అధికార అన్నా డిఎంకె
డిపాజిట్ కోల్పోయిన డిఎంకె, బిజెపికి 519 ఓట్లతో నోటాలో మూడో వంతు

చెన్నై: తమిళనాడులో ప్రతిష్ఠాత్మక ఆర్‌కె నగర్ అసెంబ్లీ స్థానం లో అన్నాడిఎంకె బహిష్కృత నేత టిటివి దినకరన్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. దివంగత నాయకురాలు, అప్పటి సిఎం జయలలిత ప్రాతినిధ్యం వహించిన కీలక అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేశారు. అధికార అన్నాడిఎంకెకు, ప్రతిపక్ష డిఎంకెకు గట్టి ఎదురుదెబ్బను ఇచ్చారు. ఈ నెల 21న జరిగిన ఆర్‌కె నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడ్డా యి. ఈ స్థానం తమిళనాడు రాజకీయ భవితకు మార్గదర్శకం అవుతుందని అన్ని కీలక పార్టీలూ విజయం కోసం పోటాపోటీగా వ్యూహరచన చేశాయి. అయితే ఇటీవలి కాలంలో వరుస ఎదురు దెబ్బలు తింటూ వస్తున్న దినకరన్ రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి అనూహ్య భారీ విజయం సాధించారు. ఈ స్థానంలో ఆయన 4౦,7౦7 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. రెండో స్థానంలో అన్నాడిఎంకె అభ్యర్థి నిలవగా, స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె మూడో స్థానంలో ధరావత్తు పోగొట్టుకుంది. గతంలో 2౦16 అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని నాయకురాలు జయలలితకు 39,545 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు దినకరన్ ఈ రికార్డును అధిగమించారు. జయలలిత మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వాయిదాల తరువాత జరిగింది. ఆదివారం ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచి కూడా దినకరన్ ఆధిక్యత చాటుతూ వచ్చారు. దినకరన్‌కు 89,౦13 ఓట్లు, అన్నాడిఎంకెకు చెందిన మదుసూధన్‌కు 48,3౦6 ఓట్లు, డిఎంకెకు చెందిన ఎన్ మారుత్ గణేష్‌కు కేవలం 24,651 ఓట్లు వచ్చాయి. బిజెపికి 519 ఓట్లు రాగా, నోటాకు 1732 పడ్డాయి. ఇండిపెండెంట్‌గా నిలిచిన దినకరన్‌కు ప్రెషర్‌కుక్కర్ ఎన్నికల గుర్తు దక్కింది. అన్నాడిఎంకెలో వర్గ పోరు ఆరంభం అయిన తరువాత జైలులో ఉన్న శశికళ మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి వెలివేశారు. అయితే తనదే అన్నాడిఎంకె పార్టీ అని, తమ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు రెండాకులు వస్తుందని దినకరన్ చేసిన పోరు ఫలించలేదు. దీనితో ఆర్‌కె నగర్ నుంచి ఆయన ఇండిపెండెంట్‌గా ఎవరికి ఎక్కువగా పరిచయం లేని ప్రెషర్‌కుక్కర్ గుర్తుతో బరిలో నిలవాల్సి వచ్చింది. అయినా గుర్తుతో సంబంధం లేకుండా ఈ స్థానంలో అన్ని వర్గాల నుంచి తనకు ఆదరణ కనబడుతోందని, తనదే గెలుపని ప్రచారం ఆరంభం నుంచీ దినకరన్ చెపుతూ వచ్చారు. అన్ని వైపులా కమ్ముకొస్తున్న కేసుల కష్టాలు, ఆదాయపు పన్ను, ఇడి వర్గాల సోదాల నడుమ, కోర్టు వ్యాజ్యాలు, వాద ప్రతివాదాల మధ్యనే ఎన్నికల పోటీలోకి దిగిన దినకరన్ తమ గెలుపుతో పొట్టివాడు గట్టివాడన్పించుకున్నాడు. రాష్ట్రంలో మారబోయే రాజకీయ సమీకరణలకు ఈ గెలుపు ఆరంభం అయిందని, ఇక వచ్చే రెండు మూడు నెలల్లోనే అధికార అన్నాడిఎంకె ప్రభుత్వ పతనం తప్పదని స్పష్టం చేశారు. జయలలిత మరణానంతరం తమిళనాడు అధికార పార్టీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటూ వచ్చాయి. జయలలిత మృతి దశలో ఇక పార్టీకి తిరుగులేని మరో నాయకురాలు శశికళ అని అంతా అనుకున్నారు. ఆ విధంగా పార్టీలో పలు సంకేతాలు వెలువడ్డాయి. ఇక మేనల్లుడు దినకరన్ అంతా తానే అయి చక్రం తిప్పారు. కానీ శశికళ అవినీతి కేసులో జైలు పాలుకావడంతో రాజకీయ సుడులు తారుమారు అయ్యాయి. సిఎం పళనిస్వామి ఏకంగా శశికళకు ఎదురుతిరగడం, పార్టీలోని ఆయన వర్గం, మాజీ సిఎం పన్నీరు సెల్వం వర్గం ఒకటికావడం, వారు శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం వంటి పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్ని ప్రతిబంధకాల నడుమ ఇప్పుడు దినకరన్ విజయం రాష్ట్రంలో రాజకీయాలలో ఎప్పుడేం జరుగునుందనే పరిస్థితిని తెచ్చిపెట్టింది.
బెంగాల్‌లో టిఎంసి, అరుణాచల్‌లో బిజెపి
పశ్చిమ బెంగాల్‌లోజరిగిన సబాంగ్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార టిఎంసి ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి గీతారానీ భూనియా సమీప లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు అభ్యర్థిని రీటా మోండాల్‌ను దాదాపు 65వేల ఆధిక్యతతో ఓడించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో లికాబలలీ , పక్కే కెసాంగ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో , ఉత్తరప్రదేశ్‌లోని సికింద్ర అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి గెలిచింది.