Home తాజా వార్తలు మురికి కూపంగా మారుతున్న బండ చెరువు…

మురికి కూపంగా మారుతున్న బండ చెరువు…

 Banda Cheruvu

 

మల్కాజిగిరి: ప్రభుత్వంలో ఒక విభాగం అధికారులు చెరువుల అభివృద్దికి చర్యలు చేపడుతుంటే… అదే ప్రభుత్వంలో మరో విభాగం అధికారులు చెరువులను మురికి కూపంగా మారుస్తున్నారు. ఒక వైపు లక్షల రూపాయలు వెచ్చించి చెరువులో పేరుకు పోతున్న చెత్తా చెదారాలను, గుర్రపు డెక్కను తొలగించి శుభ్రంగా చేస్తుంటే, మరో వైపు మరిన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి డ్రైనేజీ పైపు లైన్లను చెరువులోకి కలుపుతూ మురికి కూపాలుగా మారుస్తున్నారు. ఒకప్పుడు ప్రజలు దాహం కోసం చెరువులను ఆశ్రయిస్తే, ఇప్పుడు అదే చెరువుల నుండి తమ ఆరోగ్యాలను కాపాడు కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. వర్షపు నీటితో కళకళలాడాల్సిన చెరువులు మురికి నీటితో ముక్కుపుటాలధిరే దుర్గందం వెదజల్లుతూ మురికి కూపంగా మారుతున్నాయి.
డ్రైనేజీ దారులన్నీ చెరువులోకే…
మల్కాజిగిరి మండల పరిధిలోని బండ చెరువు దీనికి నిదర్శనం. చెరువులో పేరుకు పోయిన గుర్రపు డెక్కను తొలగించారు. కానీ ఆ చెరవులోకి వచ్చి కలుస్తున్న మురుగు నీరును దారి మళ్ళించేందుకు మాత్రం సంబంధిత అధికారులు శ్రద్ద చూపడం లేదు. ఈ చెరువు చూడడానికి నీటితో నిత్యం నిండు కుండలా కనబడుతుంది కాని అందులోకి వచ్చి చేరుతున్న నీరు మురుగు నీరు అని ఆ చెరువు పరిసర ప్రాంతాల్లోకి వెళితే గానీ అర్థం కాదు. చెరువు చుట్టు పక్కల రోజురోజుకు పెరుగుతున్న నివాసాల కారణంగా మురుగు నీటితో బండ చెరువు నిత్యం కళకళలాడుతుంది. డ్రైనేజీ పైపు లైన్లను ఏకంగా చెరువులోకే కలుపుతుండడంతో సమస్య తలెత్తుతోంది.

ఇరిగేషన్ అధికారులు చెరువు అభివృద్దికి చర్యలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం డ్రైనేజీ లైన్లను చెరువులోకి కలుపుతూ సమస్యను తీవ్రం చేస్తున్నారు. మున్సిపల్ విభాగంలోని శానిటేషన్ అధికారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామని చెరువు వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేస్తే ఇంజనీరింగ్ అధికారులు అదే ప్రాంతం నుండి చెరువులోకి డ్రైనేజీ లైను వేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో చెరువుకు ఒక వైపు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ది చేసినా స్థానిక ప్రజలు వాకింగ్ చేసేందుకు అంతగా ఇష్టపడరు. చెరువు నుండి వచ్చే దుర్గంధం, దోమల బెడదతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బండ చెరువు మురికి కూపంగా మారకుండా కృషి చేయాలని మల్కాజిగిరి ప్రజలు కోరుతున్నారు.

 

Dirty water in Banda Cheruvu