Home ఆఫ్ బీట్ లక్ష్యసాధనకు వైకల్యం అడ్డుకాదు

లక్ష్యసాధనకు వైకల్యం అడ్డుకాదు

సమాజంలో ఏ వ్యక్తి ఏ పని చేసినా దాని వెనుక సమాజం పాత్ర ఎంతైనా ఉంటుంది. సమాజ సహకారం, ప్రోత్సాహంతో ఎవరైనా సరే ఎంత ముందుకైనా వెళ్ళగలరు. లక్షాన్ని సునాయాసంగా సాధించగలరు అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటికాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హాను ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా ఎంతోమంది తమ వైకల్యాన్ని అధిగమించి విజయాలను సొంతం చేసుకున్నారు. నిజమైన సామర్థం గురించి తెలుసుకున్న వారు ఎవరూ కూడా ఎవరినీ తక్కువ అంచనా వేసి చూడరు.

lf

ప్రపంచంలో పనికిరాని వారంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైన వారే ఉండరు. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేకపోతే మనం వాళ్లకన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే వికలాంగులను అర్థం చేసుకోవడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే “ఒక వ్యక్తి కూర్చున్న చోటినుండి లేవలేకపోవడం శారీరక సమస్య అయితే, ఆ వ్యక్తి నిలబడడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన వైకల్యం అంటారు.’
వైకల్యం అనేది ఒక సంఘటన మాత్రమే కాని సమస్య కాదు, అంటువ్యాధి అంతకన్నా కాదు అనే విషయంపై సమాజాన్ని చైతన్యపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. లక్షాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో, ప్రపంచ ఆధునిక ఆవిష్కరణలు ఆవిష్కరించడంలో వైకల్యం అడ్డు కారాదని నిరూపించిన వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు.
వివిధ రకాల వైకల్యాలు ః
* దృష్టి లోపాలు : చూడటంలో సమస్యలు
* పూర్తి అంధత్వం : పూర్తిగా చూడలేనివారు
* పాక్షిక అంధత్వం : చూడటంలో స్పష్టత లేకపోవడం, పాక్షికంగా చూపులేకపోవడం.
* శ్రవణలోపం : వెనుకనుండి, వేరే ఏ వైపు నుండైనా వచ్చే శబ్దాలు వినలేకపోవడం.
* భాషణ లోపం : సరైన శబ్దాల్ని పలుకలేక పోవడం ఇది ఒక మోస్తరు నుండి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చు.
* చలన వైకల్యం (కాళ్ళు, చేతులు కదలికలో సమస్య): ఎముకలు, కీళ్ళు, కండరాల్లో సమస్య వల్ల చేతులు, కాళ్లు శరీరంలోని ఇతర అవయవాలు సరిగా కదల్చ లేక పోవడం.
* బుద్ధిమాంద్యత పూర్తిగా ఎదుగుదల లేకుండా, సరైన సామాజిక ప్రవర్తన కలిగి యుండని వారు .
* సెరిబ్రల్ పాల్సి (మస్తిష్క పక్షవాతం) : మెదడు నాడీమండల వ్యవస్థ దెబ్బతినడం వల్ల అవయవాలపై నియంత్రణ లేకపోవడం, శారీరక బలహీనత, అవయవాల సమన్వయలోపం, అసంకల్పిత కదలికలు మొదలగునవి.
* ఆటిజం : ఇది ఒక మానసిక స్థితి. ఆటిజం ఉన్న పిల్లలు సామాజిక, భాషా నైపుణ్యాలు ప్రదర్శించటంలో ఇబ్బందులు
* అభ్యసన సమస్యలు : చదవటంలోనూ, రాయటంలోనూ, లెక్కలు చేయటంలో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
* బహుళ వైకల్యం : రెండు లేదా ఎక్కువ వైకల్యాలు కల్గి ఉండటం.
సామాజిక బాధ్యత
* వైకల్యంతో పుట్టిన శిశువుకు చేసే ప్రతి సేవను భగవంతునికి ప్రత్యక్షంగా చేసిన సేవగా సమాజం భావించాలి.
* ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చదువుకోవడానికి అనువైన పరిసరాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కల్పించాలి.
* పిల్లలలో నెగెటివ్ ఆలోచనలను దరిచేరనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* దివ్యాంగులలో స్వతంత్రంగా జీవించడానికి కావలసిన అన్ని సహాయ సహకారాలను తల్లిదండ్రులు అందించేలా చూడాలి. అలా స్వతంత్రగా జీవించగలిగితే వారికి వారిపై ఆత్మవిశ్వాసం పెంపొంది, జీవన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.
* ఎందరో దివ్యాంగులు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారి విజయగాథలను చెప్పడం ద్వారా, వీడియో క్లిప్పింగ్‌లు చూడటం ద్వారా లక్షాన్ని స్థిరీకరించుకోవడానికి దోహదపడుతుంది.
* దివ్యాంగులలో తమ తప్పులను, అపజయాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సరైన ప్రోత్సాహాన్ని అందించాలి.
* సైకాలజిస్ట్ ద్వారా లక్ష నిర్థారణ, ఆత్మవిశ్వాసం, మనో ధైర్యాన్ని నింపే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. తద్వారా జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను తనకు తానుగా పరిష్కరించుకోగలుగుతారు.
* ప్రభుత్వ పథకాల ద్వారా వివిధ రకాల సేవలు, పింఛన్, ఉపకార వేతనాలు, రవాణా సౌకర్యాలు, రిజర్వేషన్, విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు చైతన్యం చేయాలి.
* ప్రతి జిల్లాలో ప్రత్యేక పాఠశాలలు (అంధుల పాఠశాల, మూగచెవిటి, మానసిక వికలాంగుల) ప్రభుత్వ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.